Begin typing your search above and press return to search.

సేనానా మజాకానా : ఫస్ట్ చాన్స్ నాకే అంటున్న పవన్...?

By:  Tupaki Desk   |   30 Jun 2022 2:30 PM GMT
సేనానా మజాకానా  : ఫస్ట్ చాన్స్ నాకే అంటున్న పవన్...?
X
పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఆరితేరిపోతున్నారు. ఆయన మాటలు చేతలు మునుపటిలా ఏ మాత్రం అమాయకంగా అయితే లేవు. ఆయనకు ఏం కావాలో తెలుసు. దాన్ని ఎలా రాబట్టుకోవాలో కూడా ఇపుడు ఇంకా బాగా తెలుసు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి 2024 లో ఎట్టి పరిస్థితుల్లో సీఎం కావాలని ఉంది. ఆ విషయంలో ఏ మాత్రం మొహమాటం లేకుండానే తమ ఆశను బయటపెట్టేసుకుంటున్నారు. అయితే అది సాధ్యమా అంటే రాజకీయాల్లో ఏదైనా జరుగుతుంది. దానికి తగిన అనుకూల‌ పరిస్థితులు ఏర్పడాలి అంతే.

అందుకే పవన్ తెలివిగా పొత్తుల పేరిట టీడీపీకి మూడు ఆప్షన్లు ఇచ్చి మరో వైపు తన సొంత పంధాలో కూడా సాగుతున్నారు. ముందుగా జనసేనను బలోపేతం చేసుకుంటే రేపటి రోజున పొత్తుల కోసం ఎవరైనా తన వైపే చూడాలన్నది పవన్ తెలివైన ఎత్తుగడ. ఒక వేళ ఎన్నికల ముందు పొత్తులు సాధ్యం కాకపోయినా ఏమీ పరవాలేదు. ఆ తరువాత పోస్ట్ పోల్ అల‌యెన్స్ కి కూడా తాను రెడీ అని సంకేతాలు పంపుతున్నారు.

ఇక పవన్ యాభై సీట్లను టార్గెట్ చేస్తున్నట్లుగా భోగట్టా. మొత్తం 88 సీట్లు మ్యాజిక్ ఫిగర్ అయితే రేపటి ఎన్నికల్లో వైసీపీ టీడీపీల మధ్య హోరాహోరీగా ఫైట్ సాగితే మూడవ పార్టీగా తానూ రేసులో ఉండాలనే పవన్ తాపత్రయం. అలా ఓట్లను చీల్చో లేక తన ఓటు బ్యాంక్ పెంచుకునో యాభై సీట్ల దాకా సాధిస్తే అసలు కధలో తానే కధానాయకుడు కావచ్చు అన్నది పవన్ మాస్టర్ ప్లాన్ అంటున్నారు.

ఇక పొత్తుల విషయంలో పవన్ ఈ మధ్య అన్న మాటలకు అర్ధాలు వేరు అంటున్నారు. జనంతోనే పొత్తు అన్నది కేవలం ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే ఆయన అన్నారని తెలుస్తోంది. ఇక పొత్తు అంటే తన కంటే తెలుగుదేశం పార్టీకే అవసరం ఎక్కువగా ఉందని పవన్ నమ్ముతున్నారుట. ఈ ఎన్నికలు టీడీపీకి చాలా ముఖ్యం కాబట్టి పొత్తులకు చివరి క్షణంలో అయినా వస్తారని, తమ ఇంటి తలుపు తడతారని కూడా ఆయన భావిస్తున్నారుట.

అంతవరకూ తమ వైపు నుంచి ఎలాంటి ప్రతిపాదనలు లేకుండా కామ్ గా పని చేసుకుని పోవాలని కూడా పవన్ భావిస్తున్నారు అని తెలుస్తోంది. ఇక రానున్న రెండేళ్లలోనూ జనంలో ఉంటూ జనసేనను బలోపేతం చేసుకుంటే అనుకున్న టార్గెట్ రీచ్ కావడం ఏమంత కష్టం కాబోదని కూడా పవన్ విశ్వసిస్తున్నారు.

ఇక పొత్తులు ఎన్నికల ముందు కుదిరినా లేక ఎన్నికల అనంతరం కుదిరినా కూడా పవన్ అయితే కచ్చితంగా ఒక కండిషన్ మాత్రం టీడీపీ పెద్దల ముందు పెట్టబోతున్నారుట. అదేమిటి అంటే అధికారంలో సగం వాటా తమకు అప్పగించాలి. అంటే సీఎం సీటు అన్న మాట. ఆ సీఎం పదవిని కూడా తొలి విడతలో అంటే మొదటి టెర్మ్ లోనే తమకు ఇవ్వాలని డిమాండ్ పెడతారుట. ఇలా డిమాండ్ పెట్టడం వెనకేనే పవన్ ముందు జాగ్రత్త రాజకీయ తెలివిడి కనిపిస్తున్నాయని అంటున్నారు.

చంద్రబాబు రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉన్న పవన్ రేపటి రోజున తొలి రెండున్నరేళ్ళూ చంద్రబాబుకు ఇచ్చి తాము పక్కన కూర్చుంటే ఈ లోగా తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎగరేసుకుని పోతారన్న అనుమానాలు ఉన్నాయట. గతంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఏ అవసరం లేకపోయినా తన పార్టీలో చేర్చుకున్న చంద్రబాబుకు జనసేన అయినా ఒక్కటే అని భావించబట్టే అసలు నమ్మడానికి వీలు లేదు అని పవన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

అంటే ఏ విధంగా చూసుకున్నా భారీ రాజకీయ లాభం తన వైపే ఉండేలా పవన్ గట్టి వ్యూహాలు రచిస్తున్నారు అనుకోవాలి. అదే టైమ్ లో ఫస్ట్ టెర్మ్ లోనే తాను సీఎం కావాలని కూడా ఆయన పట్టుదలగా ఉన్నారుట. ఇక ఎన్నికల ముందు పొత్తులకు వీలు కాకపోతే విడిగా పోటీ చేసి సత్తా చాటాలని కూడా అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి పవన్ చూపిస్తున్న ఈ పొలిటికల్ డైనమిజం టీడీపీ పెద్దలను ఉక్కిరి బిక్కిరి చేసేలా ఉందని అంటున్నారు. తాను సీఎం గానే శాసనసభలో మళ్లీ అడుగుపెడతాను అని శపధం చేసి బయటకు వచ్చిన బాబుకు పవన్ కండిషన్లు అసలు మింగుడుపడవు.

దాంతో ఏదో ఈ రెండు పార్టీల మధ్య ఎన్నికల ముందు పొత్తులు కుదురుతాయా అన్న సందేహాలు వస్తున్నాయి. ఇక ఎన్నికల అనంతరం పొత్తులకు టీడీపీ కూడా సుముఖంగా ఉందని అంటున్నారు. తమకు సింగిల్ గా వెళ్ళినా మెజారిటీ వస్తుందని, ఒక వేళ ఏమైనా సీట్లు తగ్గితే అపుడే పవన్ తో పొత్తులకు చూడవచ్చు అని టీడీపీ శిబిరంలో భావిస్తున్నారు అంటున్నారు. ఈ కారణంగానే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు లాంటి వారు ఒంటరిగానే 160 సీట్లు అని భారీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అని తెలుస్తోంది.