Begin typing your search above and press return to search.

పవన్ ఇప్పుడు సరైన దారిలోనే వెళ్తున్నారా?

By:  Tupaki Desk   |   11 Jun 2022 5:29 AM GMT
పవన్ ఇప్పుడు సరైన దారిలోనే వెళ్తున్నారా?
X
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. కొద్ది రోజుల క్రితం పొత్తులపై పవన్ కల్యాణ్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని.. అవి జనసేన, బీజేపీ, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదా బీజేపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదా జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం అని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై టీడీపీ మౌనంగా వహించగా బీజేపీ పవన్ కు ఒక రకంగా షాక్ ఇచ్చింది.

ఏపీ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజమండ్రిలో జరిగిన సభలోనూ, మీడియాతోనూ మాట్లాడినప్పుడు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. బీజేపీని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలంతా పార్టీని పటిష్టం చేయాలని కోరారు. ఎక్కడా పవన్ కల్యాణ్ ప్రస్తావన, జనసేన పార్టీతో పొత్తు వ్యవహారాలను జేపీ నడ్డా అస్సలు ప్రస్తావించలేదు. వాస్తవానికి పవన్ కల్యాణ్ ను తమ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని జనసేన వర్గాలు భావించాయి. పవన్ అభిమానులు కూడా జేపీ నడ్డా నుంచి ఇదే ప్రకటన వస్తుందని భావించారు. అయితే వారి ఆశలు నెరవేరలేదు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పవన్ కల్యాణ్ పొత్తులపై ఏమీ స్పందించలేదు. ఇటీవల రెండు రోజులపాటు నిర్వహించిన మహానాడు సక్సెస్, బాదుడే బాదుడు కార్యక్రమాలు విజయవంతం కావడంతో టీడీపీలో కొత్త జోష్ నెలకొంది. తాము సొంతంగా అధికారంలోకి వస్తామని.. తమకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ కల్యాణ్ కు బీజేపీ, టీడీపీ ఎలాంటివో తెలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బీజేపీ రోడ్ మ్యాప్ కోసం తాను చూస్తున్నానని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలోనూ, పలు సందర్భాల్లోనూ పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే తాము బీజేపీతో పొత్తులో ఉన్నామని.. బీజేపీతో కలసి నడుస్తామని చెప్పారు. అయితే ఇదే రకమైన స్పందన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి రాకపోయేసరికి పవన్ హర్ట్ అయ్యారని అంటున్నారు. తాను ఇన్నిసార్లు బీజేపీ గురించి మాట్లాడితే.. జేపీ నడ్డా ఏపీ పర్యటనలో ఎక్కడా జనసేన పార్టీ, తన ప్రస్తావన తేకపోవడం పవన్ కల్యాణ్ కు నచ్చలేదని చెప్పుకుంటున్నారు. బీజేపీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క శాతం లోపు మాత్రమే ఓట్లు వచ్చాయని.. తన పార్టీకి ఏడు శాతం వచ్చాయని.. అలాంటిది బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇలా ఎలా వ్యవహరిస్తారని పవన్ ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం.

అందుకే తన పొత్తుల ప్రకటనపై స్పందించని బీజేపీ, టీడీపీలకు షాక్ ఇవ్వడానికి పవన్ కల్యాణ్ నిశ్చయించుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీలకు తనతో పొత్తు అవసరం లేనప్పుడు, వారితోనూ తనకు పొత్తు అవసరం లేదని పవన్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ముందు తన పార్టీని బలోపేతం చేసుకోవడం, అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టడం ఇందులో భాగమేనని పేర్కొంటున్నారు.

పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేసైనా కింగ్ మేకర్ గా నిలవాలని కోరుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. కనీసం 50 సీట్లు సాధించినా తాను కింగ్ మేకర్ గా నిలవడం ఖాయమని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. అప్పుడు ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 88 సీట్లు ఏ పార్టీకి రావని, అలాంటి పరిస్థితిలో చంద్రబాబు అయినా, చివరికి జగన్ అయినా మద్దతు కోసం తన కాళ్ల దగ్గరకు రాక తప్పదని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గం ఎవరికి ఓట్లేస్తే ఆ పార్టీ మాత్రమే అక్కడ గెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ పార్టీని బలోపేతం చేసుకుంటే ఆయన కింగ్ మేకర్ కావడం పక్కా అని రాజకీయ విశ్లేషకులు ఢంకా బజాయిస్తున్నారు.

ఇదంతా జరగాలంటే ముందు పార్టీని బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. అలాగే జూలై నెలాఖరులోపు రాష్ట్రంలో అన్ని గ్రామాలు, మండలాలు, పట్టణాలు, నగరాల్లో వార్డులు, బూత్ ల వారీగా పార్టీ కమిటీలు వేయాలని నిర్ణయించారని తెలుస్తోంది.

ఇప్పటికే జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో పవన్.. పశ్చిమ గోదావరి, కర్నూలు, అనంతపురం జిల్లాలను చుట్టేసి వచ్చారు. ఆయా జిల్లాల్లో ఆత్మహత్మలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున తన సొంత నిధులను వెచ్చించి ఆదుకున్నారు. భీమ్లా నాయక్ హిట్ మీద వచ్చిన రూ.5 కోట్లను కౌలు రైతులను ఆదుకోవడానికి వెచ్చిస్తున్నానని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. కేవలం కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయమే కాకుండా వారి పిల్లల చదువులకు కావాల్సిన నిధిని కూడా ఏర్పాటు చేస్తానని పవన్ ఇప్పటికే పలుమార్లు చెప్పిన సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఇప్పటికి తనలో అసలైన సామర్థ్యాలను గుర్తించారని, తాము కోరుకుంటున్నది కూడా ఇదేనని జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు చెబుతున్నారు. తాము ఎవరి కాళ్ల దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదని, ఎవరైనా తమ కాళ్ల దగ్గరకు రావాల్సిందేనని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. ఈ క్రమంలో పవన్ తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి రాష్ట్ర పర్యటనలకు శ్రీకారం చుట్టడం వారిని సంతోషంలో ముంచెత్తుతోంది.