Begin typing your search above and press return to search.

ధర్మ పరిరక్షణ కోసం పవన్ యాగం!

By:  Tupaki Desk   |   12 Jun 2023 2:00 PM GMT
ధర్మ పరిరక్షణ కోసం పవన్ యాగం!
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీస్ ప్రాంగణంలో యాగాన్ని చేపట్టారు. ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమం, సామాజిక పరివర్తన కోరుతూ పవన్ ఈ యాగాన్ని చేపడుతున్నట్లుగా జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ యాగాన్ని పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం ఆరు గంటల 55 నిముషాలకు సంప్రదాయ వస్థాలతో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టడం ద్వారా ప్రారంభించారు.

అయిదుగురు దేవతా మూర్తులను అధిష్టించి యాగాన్ని నిర్వహిస్తున్నారు. స్థిరత్వం, స్థిత ప్రజ్ఞత ప్రసాదించే గణపతి, అలాగే శత్రు నిరోధిత దేవత చండీ మాత, అష్టైశ్వర ప్రసాదితులు అయిన శివ పార్వతులు, ఆయురారోగ్య ప్రదాత సూర్య భగవానుడు, త్రిస్థితి యుక్త కారకుడు విష్ణు మూర్తిలను యాగపీఠం మీద ప్రతిష్టించి యాగాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ యాగం ద్వారా రాష్ట్రానికి మేలు చేయడానికే అని జనసేన వర్గాలు వెల్లడించాయి. యాగాన్ని రుత్వికులు సంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ యాగం ఈ నెల 13తో పూర్తి అవుతుంది. నిరాడంబరంగా కేవలం యాగానికి సంబంధించిన వారు మాత్రమే ఇందులో పాలుపంచుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ఈ నెల 14న పవన్ కళ్యాణ్ వారాహి రధయాత్ర మొదలు కాబోతోంది. ఆయన ఏకంగా 11 నియోజకవర్గాలలో యాత్ర చేపట్టనున్నారు. ఎనిమిది కీలకమైన ప్రదేశాలలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు ఉన్నాయి. ఈ నెల 23 వరకూ తొలి విడత రధయాత్ర సాగనుంది అని అంటున్నారు.

మరో వైపు ఏపీలో యాగాలను చేయడం ద్వారా రాజ్యాన్ని అందుకున్న వారుగా జగన్ కనిపిస్తారు. ఆయన నేరుగా యాగం చేయకపోయిన రాజశ్యామల యాగాన్ని విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా నిర్వహించారు. ఈ యాగాన్ని స్వామి స్వరూపానందేంద్ర చేపట్టారు.

ఇక ఇటీవల విజయవాడలో దేవాదాయ శాఖ ఆద్వర్యంలో యాగం జరిగింది. ఇపుడు పవన్ కూడా యాగాన్ని చేపట్టారు. ఏపీ రాజకీయాలు జోరుగా సాగుతున్న వేళ వేడెక్కిన నేపధ్యంలో ఆధ్యాత్మికత కూడా అంతటా కనిపిస్తోంది. గతసారి పవన్ ఒంటరిగా పోటీ చేసినపుడు ఎటువంటి యాగాలను నిర్వహించలేదు. ఈసారి మాత్రం ఆయన దైవ బలాన్ని కూడా గట్టిగా కోరుకుంటున్నారు.

మొత్తం మీద చూసుకుంటే జగన్ పవన్ యాగాలతో కూడా పోటీ పడుతున్నారు. మరి చంద్రబాబు కు ఈ ఆలోచనలు ఉన్నాయా ఉంటే కనుక ఆయన తరఫున ఎవరైనా యాగాలను చేయిస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఏపీలో రాజకీయాలతో పాటు ఆధ్యాంతికత కూడా పెనవేసుకుని పోయినట్లుగా కనిపిస్తోంది. దాని వల్ల రానున్న రోజులలో దైవబలం కూడా తమ వైపే ఉందని నేతాశ్రీలు గట్టి ధీమాతో ముందుకు సాగేందుకు ఆస్కారం ఏర్పడుతోంది.