Begin typing your search above and press return to search.

బాబు జిల్లా వాసులకు జగన్ తీపి కబురు!

By:  Tupaki Desk   |   12 Nov 2019 3:26 PM GMT
బాబు జిల్లా వాసులకు జగన్ తీపి కబురు!
X
ఏంటేంటీ... నిత్యం దూషణలు, ప్రతి దూషణలతో భీకర ప్రత్యర్థులుగా కనిపిస్తున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడులకు మధ్య ఇంతటి అవగాహన ఉందా? అని ఆశ్చర్యపోతున్నారా? జరుగుతున్న పరిణామాలు, జగన్ సర్కారు నుంచి విడుదలవుతున్న జీవోలు చూస్తుంటే.. ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు గానీ... జగన్ సర్కారు తీసుకున్న ‘లోకల్’ నిర్ణయం నిజంగానే చంద్రబాబు సొంత జిల్లా వాసులకు పండగ వాతావరణం తీసుకొచ్చేసింది. జగన్ తీసుకున్న ఆ నిర్ణయమేంటీ? దానితో చంద్రబాబు జిల్లా వాసులు ఏ మేర పండగ చేసుకుంటున్నారన్న వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.

మొన్నటి ఎన్నికల ప్రచారంతో పాటుగా అంతకుముందు ఏపీ వ్యాప్తంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో జగన్ చాలా నిర్ణయాలను ప్రకటించారు. తాను అధికారంలోకి వస్తే ఉద్యోగాల్లో మెజారిటీ వాటాను స్థానికులకే కేటాయిస్తామని ప్రకటించిన విషయం గుర్తుంది కదా. అనుకున్నట్లుగానే జగన్ నేతృత్వంలోని వైసీపీకి ఏపీ ప్రజలు బ్రహ్మరథం పట్టడం, జగన్ సీఎం కావడం జరిగిపోయాయి. ఇంకేముంది... ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అన్ని ప్రైవేట్ కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించాల్సిందేనని జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ జీవోకు అనుగుణంగానే చిత్తూరు జిల్లాలో కొలువై ఉన్న తిరుమల వెంకన్న వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఏర్పాటైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లోని ఉద్యోగాల్లో కూడా ఈ స్థానిక కోటాను అమలు చేయనున్నట్లుగా జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలోని ఉద్యోగాల్లో 75 శాతం చిత్తూరు జిల్లా వాసులకే కేటాయించాలని, మిగిలిన 25 శాతం ఉద్యోగాలను మాత్రమే నాన్ లోకల్ కు కేటాయించాలని బోర్డు సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనను మంగళవారం టీటీడీ బోర్డు జగన్ సర్కారు ఆమోదం కోసం అమరావతికి పంపింది. జగన్ సర్కారు దీనికి అంగీకారం తెలపడం లాంఛనమేనన్న వాదన వినిపిస్తోంది. అంటే... జగన్ సర్కారు తీసుకునే ఈ నిర్ణయంతో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా వాసులకు పండగను తీసుకొచ్చినట్టే కదా.