Begin typing your search above and press return to search.

వైఎస్ జగన్.. పంచమవేదంలో పాండవులంతటి గొప్ప: ఐవీ రెడ్డి

By:  Tupaki Desk   |   21 Dec 2016 3:30 AM GMT
వైఎస్ జగన్.. పంచమవేదంలో పాండవులంతటి గొప్ప: ఐవీ రెడ్డి
X
గుండెల్లో దమ్ము.. చేతల్లో నిజాయితీ..

విశ్వసనీయతే మార్గం .. విలువలే ఊపిరి..

ప్రజల చేత.. ప్రజల కోసం..

ప్రతిక్షణం.. పోరాట పర్వం.. ఇదే జగన్నాయకుడి ప్రస్థానం.

ప్రపంచంలోని ఏ మనిషి అయినా పుట్టుకతో గౌరవింపబడతాడు. కానీ, ఆ మనిషి చేతలే అతడి గొప్పదనాన్ని నిర్ణయించేవి… అన్నాడు రాజనీతిజ్ఞుడు చాణుక్యుడు. ఆ రాజనీతికి నిలువెత్తు నిదర్శనం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పుట్టుకతో గౌరవాన్ని పొంది, తన చేతలతో గొప్పదనాన్ని ఆవిష్కృతం చేస్తున్న శక్తి ఆయన. అలాంటి వ్యక్తి పుట్టిన రోజు నేడు. తెలుగు ప్రజా సంక్షేమానికే ప్రత్యేకమైన రోజు నేడు.

దేశం ఎంతో మంది రాజకీయ నేతలను చూసింది. దార్శానికులను, రాజనీతిజ్ఞులను, మేధావులను… ఎంతోమందిని! ప్రతి విషయంలోనూ ఒక్కో ఉదాహరణ, ఒక్కో అర్హత విషయంలో కొంతమందిని ప్రస్తావించవచ్చు. కానీ.. కొన్ని అర్హతల విషయంలో మరెవరినీ ప్రస్తావించలేం. వాళ్లు అరుదైన వాళ్లు. వాళ్లకు పోలికలు తేలేం. వారికి వారే సాటి! అలాంటి మరే సాటి లేని మేటి నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

ఈ జగన్నాయకుడి ప్రత్యేకతకు ఆయన ప్రస్థానమే సాక్ష్యం. స్వతంత్రానంతరం జగన్ లాంటి మరో రాజకీయ నేతను ఎరగదు భారతదేశం. జగన్ ఒక ధిక్కార పతాక. అధికారం ముందు, అధికారం కోసమో అణిగిమణిగి ఉండేది కాదిది. అబద్ధాలు, అభూత కల్పనలతో ప్రజలను మోసం చేసే తత్వం కాకపోవడమే జగన్ గొప్పదనం. అభిమానగణానికి అదే గర్వకారణం.

ప్రతిపక్షంలోనే ఉండవచ్చు గాకా కానీ ఆయన ప్రతిక్షణం ప్రజాపక్షమే. రాజకీయ మనుగడే ముఖ్యం అనుకుని ఉంటే జగన్ ప్రస్థానం వేరే రకంగా ఉండేదని వేరే చెప్పనక్కర్లా. అధికారమే పరమావధి అనుకుని ఉండి ఉంటే.. ఎముకలు కుళ్లి, రక్తం చల్లబడి, మెదడు మొద్దుబారి బతికి ఉన్న ముసలి శవాల మధ్యనే జగన్ నిలిచిపోయే వారు. అలా రాజీ పడిన రాజకీయనేతలు, స్వార్థపూరితంగా వ్యవహరించిన శక్తులు దేశ చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. కానీ.. జగన్ లాంటి నేత మాత్రం ఒక్కరే.. అది జగనే!

ప్రత్యర్థులు ఎంత స్ట్రాంగో తెలిసి కూడా పోరాట పంథానే అనుసరించిన దమ్మూధైర్యమే.. జగన్ వ్యక్తిత్వానికి మచ్చుతునక. జగన్ రాజకీయ ప్రస్థానంలో ప్రతి మలుపూ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేదే. అభిమానులను, ఆంధ్రులను గర్వపడేలా చేసేదే.

దమ్మూ ధైర్యం ప్రజాభిమానం కలిగిన యువకుడు తమకు లొంగి ఉండలేదని, అవినీతి కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేసి దాడి మొదలు పెట్టింది. ఆ పద్మవ్యూహాన్ని చేధించి… ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అంతు చూసిన అర్జునుడయ్యాడు.

రాష్ట్రాన్ని విభజించడం ద్వారా.. జగన్ పై ఉన్న కసిని జనంపై తీర్చుకుంది కాంగ్రెస్. ఇదే సమయంలో అబద్ధాలు, కట్టుకథలే అస్త్రాలుగా తప్పుడు హామీలతో అధికారాన్ని మరొకరు దక్కించుకున్నారు కానీ.. అంతిమ విజయం మాత్రం ధర్మానిదే. ఆ ధర్మ విజయం కోసం మరికొంత కాలం వేచి చూడాలంతే. ద్వాపరయుగంలోనే ధర్మవిజయానికి కొంత సమయం పట్టింది. అంతిమ విజయం ఎప్పుడూ ధర్మానిదే.

మహానేత, దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు - ఆలోచనలు - ధీర్ఘదృష్టిని పుణికిపుచ్చుకుని ఆయన అడుగుజాడల్లో అలుపెరగని పోరు చేస్తూ ప్రజా సంక్షేమానికై తపిస్తున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. ఎన్ని కష్టాలు వచ్చినా విలువలూ, విశ్వసనీయతలే ఊపిరిగా రాజకీయాలు సాగిస్తున్న జగన్ జయకేతనాలకు మరెంతో సమయం లేదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని గెలిపించుకున్న దళం, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీర్చిదిద్దుకున్న సైన్యం.. తెలుగునేల అంతా పరుచుకుని ఉంది, తెలుగునేలనంతా గెలుచుకునే సత్తా ఉంది.

విలక్షణ వ్యక్తిత్వం, తలవంచని తత్వం, కష్టాలనే కడతేర్చేటంతటి పోరాటపటిమ.. పంచమవేదంలో పాండవులు ప్రస్థానాన్ని గుర్తు చేస్తుంది జగన్ రాజకీయ గమనం. ఆనాడు పాండవులకు శ్రీకృష్ణుడు తోడు, ఆధునిక మహాభారతంలో ప్రజానీకంతో పాటు, దేవుడి ఆశీస్సులే జగన్ కు తోడు. అలాంటి ప్రియతమ నేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రజాపక్ష పోరాటాలకు పునరంకితం.

ఇట్లు…
మీ ఐవీ రెడ్డి,
గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ - ప్రకాశం జిల్లా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/