Begin typing your search above and press return to search.

పోలీసుల జాబితాను టీడీపీ రెడీ చేస్తోందా ?

By:  Tupaki Desk   |   30 Nov 2021 4:00 PM IST
పోలీసుల జాబితాను టీడీపీ రెడీ చేస్తోందా ?
X
‘అధికారపార్టీ నేతల ఒత్తిళ్ళకు తలవంచి అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారుల జాబితా తయారు చేయాలి’ తాజాగా చంద్రబాబు నాయుడు తమ్ముళ్ళకు ఇచ్చిన ఆదేశాలు. ఇలాంటి ఆదేశాలు, బెదిరింపులు గతంలో చంద్రబాబు నుంచి చాలానే వచ్చాయి. ఒక్క చంద్రబాబే కాదు సీనియర్ తమ్ముళ్లు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, చింతమనేని లాంటి వాళ్ళు కూడా తమ స్థాయిలో పోలీసులతో పెద్ద గొడవలు పెట్టుకున్నారు, అందరినీ గుర్తుంచుకుంటున్నట్లు చాలాసార్లే పబ్లిక్కుగా బెదిరించిన విషయం అందరికీ తెలిసిందే.

సరే పార్టీ వ్యూహకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పోలీసు అధికారుల జాబితాను రెడీ చేయమని చెప్పడం విచిత్రంగానే ఉంది. చంద్రబాబు వ్యవహారం ఎలాగుందంటే ఆంబోతుల పోరాటం మధ్యలో లేగదూడ నలిగిపోయినట్లుంది. రాజకీయంగా టీడీపీ-వైసీపీలు బాగానే ఉంటాయి కానీ మధ్యలో ఇరుక్కుపోతున్నది మాత్రం పోలీసులే అన్న విషయం అర్థమవుతోంది. చంద్రబాబు జాబితా రెడీ చేస్తారా ? చేసి ఏమి చేస్తారు ? అసలు అధికారంలోకి వస్తారా ? అన్నది వేరే సంగతి.

ఇప్పటికైతే పోలీసు అధికారులను బెదిరిస్తున్నది మాత్రం వాస్తవం. దీనిపై ఇప్పటికే పోలీసు అధికారుల సంఘాలు కూడా గట్టిగానే రిటార్టు ఇస్తున్నాయి. అయినా చంద్రబాబు అండ్ కో తమ బెదిరింపులను మానుకోవటం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరు అధికారంలో ఉన్న పోలీసులను ప్రత్యర్ధులపైకి ఉసిగొల్పుతున్నది వాస్తవం.

చంద్రబాబు అధికారంలో ఉండగా కొందరు వైసీపీ ఎంఎల్ఏలు, నేతలపై పోలీసులు ఎన్నో కేసులు పెట్టారు. అప్పుడు కూడా చంద్రబాబో, మంత్రులు, ఎంఎల్ఏలు లేకపోతే అధికార పార్టీ నేతల ఒత్తిళ్ళతోనే పోలీసులు కేసులు నమోదుచేశారు. కాపోతే అపుడు సామాన్యులపై పోలీసు వేధింపులు ఉండేవి కాదు, కనీసం ప్రభుత్వాన్ని విమర్శించినా ఏమీ కాదన్న ధైర్యం ప్రజల్లో ఉండేది. ఇపుడు అది లేదు.

ప్రస్తుతం ప్రభుత్వంలో పోలీసులు ప్రభుత్వ సేవలో కొన్ని హద్దులు మీరిన మాట నిజం. కోర్టుల్లో చీవాట్లు పెట్టించుకున్న మాట కూడా నిజం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒత్తిళ్ళనీ పోలీసులపైనే అని అందరికీ తెలిసిందే. అయితే అది ఈసారి ఎక్కువ డోసులో ఉంది. గతంలో డీజీపీలు ఎన్నడూ కోర్టు బోను ఎక్కలేదు. ఈసారి రెండు మూడు సార్లు కోర్టు బోను ఎక్కారు.

రేపు చంద్రబాబు అధికారంలోకి వస్తే లేదా మరొకరు అధికారంలోకి వచ్చినా వాళ్ళు చెప్పినట్లు పోలీసులు వినాల్సిందే తప్ప వేరే దారిలేదు. పోలీసులు ప్రభుత్వం చెప్పినట్లు వినాల్సిన అవసరం లేదు. చట్టం నుంచి వారికి రక్షణ ఉంది.కానీ ప్రభుత్వంతో పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడరు. కేసుల విషయంలో అధికారంలో ఉన్నపుడు టీడీపీ చేసిన పనే ఇపుడు వైసీపీ చేస్తోంది. అయితే ఆ డోసు ఎక్కువ కావడంతో చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి మీదో లేకపోతే ఇంకెవరిపైనో తేల్చుచుకోవాల్సిన చంద్రబాబు పోలీసులను బెదిరించటం వల్ల ఏమిటి ఉపయోగం?