Begin typing your search above and press return to search.

ఆ ఎంపీకి టీడీపీ షోకాజు నోటీసు నిజ‌మేనా?

By:  Tupaki Desk   |   10 Oct 2022 11:40 AM GMT
ఆ ఎంపీకి టీడీపీ షోకాజు నోటీసు నిజ‌మేనా?
X
విజ‌య‌వాడ నుంచి టీడీపీ ఎంపీగా గ‌త రెండు ప‌ర్యాయాలు 2014, 2019ల్లో కేశినాని నాని ఘ‌న‌విజ‌యం సాధించారు. అయితే ఆ త‌ర్వాత విజ‌యవాడ న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీడీపీ నేత‌ల‌తో ఏర్ప‌డ్డ విభేదాల‌తో ఆయ‌న ఉప్పూనిప్పుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

టీడీపీ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేయ‌డం, చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ వెళ్లిన‌ప్పుడు ఆయ‌నకు పుష్ప‌గుచ్ఛం ఇవ్వ‌డానికి నిరాక‌రించ‌డం వంటి కార‌ణాల‌తో కేశినాని నాని టీడీపీకి గుడ్ బై చెప్ప‌డం ఖాయ‌మ‌నే ఊహాగానాలు వెలువ‌డ్డాయి.

అంతేకాకుండా విజ‌య‌వాడ టీడీపీలో బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరాల‌ను చంద్ర‌బాబు ప్రోత్స‌హిస్తున్నార‌ని.. అలాగే త‌న‌కు వ్య‌తిరేకంగా త‌న సోదరుడు కేశినేని చిన్నిని చేర‌దీస్తున్నార‌ని కేశినేని నాని అల‌క బూనార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న టీడీపీ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని చెప్పుకున్నారు.

ఈ నేపథ్యంలో కేశినేని నానికి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసిందంటూ వ‌స్తున్న వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. ఈ మేర‌కు టీడీపీ ఆయ‌న‌కు షోకాజ్ నోటీసు జారీ చేసిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు హల్ చల్ చేస్తోంది.

టీడీపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఇచ్చిన షోకాజ్ నోటీసు అంటూ పేర్కొన్న ఇందులో..

"పార్టీకి సంబంధించిన ఏవైనా అంతర్జాతీయ సమస్యలను పార్టీ ఫోరమ్‌లో చర్చించవచ్చు లేదా క్రమశిక్షణా కమిటీ దృష్టికి తీసుకురావచ్చు. దీనికి బదులుగా, ఎంపీ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తీకరించడాన్ని ఎంచుకున్నారు, ఇది చాలా దురదృష్టకరం" అని నోటీసులో పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో ఇలాంటి వ్యాఖ్యలు కేశినేని నాని స్థాయికి త‌గ‌వ‌ని పేర్కొన్న అర్జునుడు, పార్టీ సంక్షోభంలో ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎవరైనా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని భావిస్తే, సోషల్ మీడియాలో వారి పేర్లను వెల్లడించే బదులు పార్టీ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుందని ఆ నోటీసులో పేర్కొన్నారు.

కేశినేనికి వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని అర్జునుడు తెలిపారు. కేశినేని నాని చేసిన ఏడు రోజుల్లోగా పార్టీకి వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది.

ఈ నోటీసుపై ఇప్పటి వరకు పార్టీ నుంచి మీడియాకు అధికారిక ధృవీకరణ లేకపోయినా.. సోషల్ మీడియా పోస్ట్‌పై కేశినేని ఘాటుగా స్పందించారు.. "చా.. నిజమా.. క్ర‌మశిక్ష‌ణ ఉల్లంఘించిన‌వారి లిస్ట్ పంపిస్తాం.. మ‌రి వారిపై చ‌ర్య‌లు తీసుకుంటారా" అంటూ ప్ర‌శ్నించారు.

కాగా కేశినేని నానికి షోకాజు నోటీసు అనేది ఫేక్ అని, ఆయ‌న‌కు తాము ఎలాంటి నోటీసు జారీ చేయ‌లేద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

"అలాంటిదేదైనా ఉంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా నేరుగా కేశినేనికి నోటీసు పంపుతాం" అని టీడీపీ నేత ఒకరు తెలిపారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.