Begin typing your search above and press return to search.

కీల‌కమైన నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి బీసీ అభ్య‌ర్థికి టీడీపీ సీటు ఇస్తోందా?

By:  Tupaki Desk   |   13 Sep 2022 10:30 AM GMT
కీల‌కమైన నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి బీసీ అభ్య‌ర్థికి టీడీపీ సీటు ఇస్తోందా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం మాత్ర‌మే ఉంది. దీంతో అన్ని పార్టీలు త‌మ వ్యూహ‌, ప్ర‌తివ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నాయి. ఇప్ప‌టి నుంచే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టి సారించాయి. ఇప్ప‌టికే కొంత‌మంది అభ్య‌ర్థుల‌ను ఆయా పార్టీలు ఫైన‌లైజ్ కూడా చేసేశాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో చావో రేవో తేల్చుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కూడా పార్టీ అభ్య‌ర్థుల‌పై దృష్టి సారించారు. ఇప్ప‌టికే ఆయ‌న జిల్లాల‌వారీగా నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌ల‌ను కూడా చేప‌ట్టారు. కొంత‌మందికి ప‌నిచేసుకోవాల‌ని గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చేశారు. మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ఫైన‌ల్ చేసే ప‌నిలో ఉన్నారు.

ఏపీ అసెంబ్లీతోపాటే పార్ల‌మెంటుకు కూడా ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో పార్ల‌మెంటుకు పోటీ చేసే అభ్య‌ర్థుల‌పైన చంద్ర‌బాబు ఫోక‌స్ పెట్టారు. ఈ నేప‌థ్యంలో ప‌ల్నాడు జిల్లా న‌ర‌స‌రావుపేట ఎంపీ స్థానం నుంచి ఈసారి బీసీ అభ్య‌ర్థిని బ‌రిలోకి దించుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టిదాకా టీడీపీ త‌ర‌ఫున న‌ర‌స‌రావుపేట నుంచి క‌మ్మ‌, రెడ్డి అభ్య‌ర్థులే ప్రాతినిధ్యం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం న‌ర‌స‌రావుపేట నుంచి వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈయ‌న క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌. విజ్ఞాన్ విద్యా సంస్థ‌ల‌కు లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు వైస్ చైర్మ‌న్ గా ఉన్నారు. ఈసారి ఈయ‌న‌కు వైఎస్సార్సీపీ త‌ర‌ఫున సీటు ద‌క్కే అవ‌కాశాలు లేవంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అధికార పార్టీ ఎమ్మెల్యేల‌తోనే లావుకు స‌రిప‌డ‌టం లేద‌ని అంటున్నారు. ముఖ్యంగా మంత్రి విడ‌ద‌ల ర‌జినితో తీవ్ర విభేదాలున్నాయ‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ప్ర‌స్తుతం బంద‌రు ఎంపీగా ఉన్న వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో ఒక‌సారి బాల‌శౌటి న‌ర‌స‌రావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

ఇక టీడీపీ త‌ర‌ఫున బీసీ అభ్య‌ర్థిని బ‌రిలోకి దించుతార‌ని చెబుతున్నారు. మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు అల్లుడు పుట్టా మ‌హేష్ కుమార్ యాద‌వ్ పోటీ చేస్తార‌ని స‌మాచారం. ఈయ‌న తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) చైర్మ‌న్ గా చేసిన పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కుమారుడు కావ‌డం గ‌మ‌నార్హం. పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ గ‌తంలో వైఎస్సార్ జిల్లాలోని మైదుకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆర్థికంగా గ‌ట్టి అభ్య‌ర్థి అయిన పుట్టా మ‌హేష్ కుమార్ యాద‌వ్ ను న‌ర‌స‌రావుపేట బ‌రిలో దించాల‌ని చంద్ర‌బాబు నిశ్చ‌యించారని తెలుస్తోంది. ఓవైపు బీసీ అభ్య‌ర్థికి ఇచ్చిన‌ట్టు ఉంటుంద‌ని, అదే కోణం ఆర్థికంగా బ‌ల‌వంతుడు కావ‌డంతో నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో పోటీ చేసే అసెంబ్లీ అభ్య‌ర్థుల‌కు వెన్నుద‌న్నుగా నిలుస్తార‌ని చెబుతున్నారు.

అందులోనూ న‌ర‌స‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంలో బీసీల జ‌నాభా ఎక్కువ‌ని చెబుతున్నారు. అందులోనూ పుట్టా మ‌హేష్ కుమార్ యాద‌వ్ సామాజిక‌వ‌ర్గ‌మైన యాద‌వుల జ‌నాభా బాగా ఉంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో బీసీ అభ్య‌ర్థి గెలుపు ఖాయ‌మ‌నే లెక్క‌ల‌తోనే ఆయ‌న‌ను టీడీపీ బరిలోకి దించుతుంద‌ని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.