Begin typing your search above and press return to search.

మోడీ డబల్ గేమ్ ఆడుతున్నారా?

By:  Tupaki Desk   |   25 July 2022 6:05 AM GMT
మోడీ డబల్ గేమ్ ఆడుతున్నారా?
X
తాజాగా జరిగిన డెవలప్మెంట్ చూస్తే అలాగే అనిపిస్తోంది. ఢిల్లీలో ఆదివారం బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులతో మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నూరుశాతం అమలుచేయాలని గట్టిగా చెప్పారు. తొందరలో ఎన్నికలను ఎదుర్కోబోతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులకు అయితే ఇదే విషయాన్ని పదే పదే చెప్పారు. ఇక్కడే మోడీ డబల్ గేమ్ బయటపడింది.

ఒక వైపేమో ఉచిత పథకాల వల్లే దేశాభివృద్ధి దెబ్బతింటోందని ఇదే మోడీ చెబుతున్నారు. ఉచిత పథకాలు ఆపేస్తే కానీ దేశాభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రుల సమావేశంలో మాత్రం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నూరుశాతం అమలు చేయాలని కోరారు. ఇక్కడే మోడీ ఆడుతున్న డబల్ గేమ్ స్పష్టంగా బయటపడింది. ఇక్కడ సంక్షేమ పథకాలన్నా, ఉచిత పథకాలన్నా దాదాపు ఒకే రకంగా ఉంటాయి.

అర్హత కలిగిన పేదలకు వివిధ పథకాల రూపంలో బియ్యం, పప్పులు, ఉప్పులతో పాటు ఇతర నిత్యావసరాలను అందించటం, ఫించన్ పంపిణీ చేయడం, ఇంటి స్ధలాలను కేటాయించటం, అవకాశముంటే ఇళ్ళు నిర్మించివ్వటం లాంటివి అనుకుంటే ఉచితపథకాలు లేదంటే సంక్షేమపథకాలుగా చెప్పుకోవచ్చు.

పేరేదైనా, మార్గమేదైనా పేదల అవసరాలను వారిపై భారం మోపకుండా తీర్చటమే. నిజానికి ఉచితపథకాలు, సంక్షేమపథకాలు ఎక్కువైపోతున్నాయనటంలో సందేహంలేదు.

ఇలాంటి పథకాలకు కేటాయించాల్సిన నిధులు ప్రతి సంవత్సరం ఎక్కువైపోతున్నందును రాష్ట్రాల బడ్జెట్లో సుమారు సగం మొత్తాన్ని ఇలాంటి ఉచిత లేదా సంక్షేమ పథకాలకే కేటాయించాల్సొస్తోంది. బీజేపీయేతర, నాన్ ఎన్డీయే పార్టీల ప్రభుత్వాలున్న చోట మాత్రమే ఉచిత పథకాలు, హామీలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయా ? అన్నదే ఇక్కడ కీలకమైంది.

బయట వాళ్ళకేమో నీతులు, జాగ్రత్తలు చెబుతున్న మోడీ తమ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో మాత్రం సంక్షేమ పథకాలు నూరుశాతం పక్కాగా అమలు చేయాలని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. నిజంగా దేశాభివృద్ధి విషయంలో మోడీకి అంత చిత్తశుద్దుంటే దేశం మొత్తం మీద సంక్షేమ లేదా ఉచిత పథకాలను రద్దు చేయాలని చెప్పాలి.