Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు వారసుడి కోసం వెదుకుతున్నారా?

By:  Tupaki Desk   |   10 Aug 2019 8:00 PM IST
చంద్రబాబుకు వారసుడి కోసం వెదుకుతున్నారా?
X
తెలుగుదేశం పార్టీలో స్తబ్ధత నెలకొని ఉంది. ఎన్నికలు పూర్తి అయ్యి మూడు నెలలు గడిచిపోయాయి, కొత్త ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతూ ఉంది. చంద్రబాబుకు ఒకవైపు కేసుల టెన్షన్ మొదలైంది. మరోవైపు ఆయన ఆరోగ్యం బాగోలేదని అంటున్నారు. అమెరికా వరకూ వెళ్లి ఆయన ఇటీవలే చికిత్స పొంది వచ్చారు.

ఇంకా ఎన్నికలకు చాలా సమయమే ఉంది. చంద్రబాబు చుట్టూ ఏయే కేసులు చుట్టుకుంటాయో, గత అవినీతి వ్యవహారాల్లో ఏది గట్టిగా పట్టుకుంటుందో చెప్పలేని పరిస్థితి. మరోవైపు ఆయనకు వయసు మీదపడుతూఉంది.

ఇంతకు ముందులా చంద్రబాబు నాయుడు జనాల్లోకి వెళ్లి పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని అనుకోవడం భ్రమే అయ్యేలా ఉంది. చంద్రబాబు నాయుడు ఇక ఎలాంటి యాత్రలూ చేసే పరిస్థితి లేదనే అభిప్రాయాలు టీడీపీ వాళ్ల నుంచినే వినిపిస్తూ ఉన్నాయి. ఇంతకు ముందు పాదయాత్ర చేసినప్పుడే చంద్రబాబు నాయుడు చాలా కష్టాలు పడ్డారు.

అలాంటిది ఇప్పుడు ఆయన ఏం చేయగలరు? అనేది ప్రశ్నార్థకమే. అధికారంలో లేనప్పుడే జగన్ అల్లాడించాడు. తన చాకచక్యంతో తెలుగుదేశం పార్టీని కట్టడి చేశాడు జగన్. అలాంటిది ఇక నుంచి జగన్ ను ఎదుర్కొనడం అంటే మాటలేమీ కాదు.

ఇక చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ సంగతి సరేసరి. లోకేష్ నాయకత్వ లక్షణాల గురించి ఎంతతక్కువగా మాట్లాడుకుంటే అంతమంచిదని టీడీపీనేతలే ఆఫ్ ద రికార్డుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఈ పరిణామాల్లో కొందరు తెలివిగా బీజేపీ వైపు జంప్ చేసేశారు. ఇంకొందరు ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం మీదే ఇంకా ఆశలు పెట్టుకున్న నేతలు మాత్రం తమకు మరో నేత కావాలని ఆకాంక్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కు తగిన వారసుడు అవసరం అని, పార్టీ భవితవ్యాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబుకు వయసు అయిపోతోంది, లోకేష్ లో చేవ కనిపించడం లేదు..ఈ నేపథ్యంలో తగిన ప్రత్యామ్నాయ నేత అవసరం అని వారు అనుకుంటున్నారట. మరి తెలుగుదేశానికి చంద్రబాబు వారసుడు ఎవరవుతారు? అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే!