Begin typing your search above and press return to search.

టి20 ప్రపంచ కప్ లో మరో సంచలనం.. ఇంగ్లండ్ కు ఐర్లాండ్ షాక్

By:  Tupaki Desk   |   26 Oct 2022 9:14 AM GMT
టి20 ప్రపంచ కప్ లో మరో సంచలనం.. ఇంగ్లండ్ కు ఐర్లాండ్ షాక్
X
ప్రిలిమినరీ స్టేజ్ లో ఓడిపోయిన వెస్టిండీస్ ప్రపంచ కప్ సూపర్ 12కు దూరమైంది. మెయిన్ రౌండ్ లో అతిథ్య, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు న్యూజిలాండ్ షాకిచ్చింది. ఇప్పుడు ఇంగ్లండ్ వంతు. మాజీ చాంపియన్, టోర్నీ హాట్ ఫేవరెట్ అయిన ఆ జట్టును ఐర్లాండ్ దిమ్మతిరిగేలా కొట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్ చివరి దశలో ఉండగా.. వర్షం పడడంతో డక్ వర్త్ లూయీస్ నిబంధనల ప్రకారం విజేతను ఎంపిక చేశారు. ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో గెలిచినట్లు ప్రకటించారు. బట్లర్, హేల్స్, మలన్, స్టోక్స్, బ్రూక్స్, లివింగ్ స్టన్, మోయిన్ అలీలాంటి హార్డ్ హిట్టర్లున్న ఇంగ్లండ్ కు ఇది భారీ దెబ్బే.

ఐర్లాండ్ ఎదుగుతోంది చూడండి..

ఇంగ్లండ్ కు ఉత్తరాన.. ఉండే ద్వీపమే ఐర్లాండ్. దీనిలోని కొంత ఉత్తర భాగం గ్రేట్ బ్రిటన్ లోకి వెళ్తుంది. అలాంటి చిన్న ప్రాంతం నుంచి వచ్చిన ఐర్లాండ్ క్రికెట్ జట్టు వేగంగా ఎదుగుతోంది. బ్రిటీష్ ఏలుబడిలోని క్రికెట్ కల్చర్ ఉన్న దేశం కావడం ఇందుకు ఎంతో మేలు చేస్తోంది.

వెస్టిండీస్ లాంటి రెండు సార్లు చాంపియనే సూపర్ 12కు క్వాలిఫై కాలేని స్థితిలో.. ఐర్లాండ్ మాత్రం ప్రపంచ కప్ నకు అర్హత సాధించడమే కాక అదరగొడుతోంది. చూస్తుంటే.. భవిష్యత్ లో మంచి టి20 క్రికెట్ జట్టుగా ఎదిగే అవకాశాలు ఐర్లాండ్ కు చాలా ఎక్కువగా ఉన్నాయి.

ఐపీఎల్ లో లేకున్నా.. వివిధ లీగ్ ల్లో ఐర్లాండ్ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో అనుబంధం తక్కువే. వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు పదుల సంఖ్యలో ఐపీఎల్ లో ఆడుతుంటారు. కానీ, ఐర్లాండ్ వారు పెద్దగా కనిపించరు. డిర్క్ నాన్స్, డస్కాటే, వాన్ డెర్ మెర్వ్ వంటి ఒకరిద్దరు తప్ప. అయితే, ఆ జట్టులోని ఆటగాళ్లకు ప్రపంచ వ్యాప్తంగా లీగ్ లు ఆడిన అనుభవం ఉంది. దీంతో వారిలో పోటీతత్వానికి కొదవ లేదు.

దాయాదిని మళ్లీ మట్టి కరిపించింది

2011 వన్డే ప్రపంచ కప్.. భారత్ ఆతిథ్యం.. ఆ ప్రపంచ కప్ లో బెంగళూరులో జరిగిన మ్యాచ్ ఇప్పటికీ సంచలనం. ఎందుకంటే నాటి మ్యాచ్ లో 327 పరుగులు చేసి గెలుపు తమదే
అనుకుంటున్న ఇంగ్లండ్ ను ఐర్లాండ్ మట్టికరిపించింది. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 329 పరుగులు చేసి షాకిచ్చింది. బుధవారం టి20 ప్రపంచ కప్ లో మళ్లీ అలాంటి షాక్ నే ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది.

కెప్టెన్ ఆండీ బాల్ బిర్ని 47 బంతుల్లో 62, 5 ఫోర్లు, 2 సిక్సులు, లోర్కాన్ టక్కర్ 27 బంతుల్లో 34, 3 ఫోర్లు, సిక్స్ రాణించారు. అయితే, ఛేదనలో ఇంగ్లండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ జాస్ బట్లర్ ఎదుర్కొన్న రెండో బంతికే పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. హేల్స్ (7) నిరాశపర్చాడు. స్టోక్స్ (6), బ్రూక్స్ (18) విఫలమయ్యారు. అయినా, డేవిడ్ మలన్ (35) రాణించడం, మోయిన్ అలీ (12 బంతుల్లో 24, 3 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝళిపిస్తుండడం, లివింగ్ స్టన్ వంటి (1 నాటౌట్) విధ్వంసకుడు క్రీజులో ఉండడంతో ఇంగ్లండ్ గెలుపు ఖాయమే అనిపించింది. విజయ సమీకరణం 33 బంతుల్లో 55 పరుగులుగా ఉండగా.. వర్షం కురిసి ఇంగ్లండ్ ను ముంచింది. డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం చూడగా.. ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో గెలిచినట్లు ప్రకటించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.