Begin typing your search above and press return to search.

ఆస్ప‌‌త్రికి వెళ్తే చాలు క‌రోనా అంటించేస్తున్నారు!!

By:  Tupaki Desk   |   19 July 2020 3:30 PM GMT
ఆస్ప‌‌త్రికి వెళ్తే చాలు క‌రోనా అంటించేస్తున్నారు!!
X
ఇదో చిత్ర‌మైన ప‌రిస్థితి. ఓ వైపు క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టించిన క‌ల‌క‌లంతో జ‌నాలు స‌త‌మ‌తం అయిపోతుంటే మ‌రోవైపు దాని సైడ్ ఎఫెక్ట్స్‌ తో ఇంకా చిత్ర‌మైన షాకులు త‌గులుతున్నాయి. ప్ర‌ధానంగా ఆస్ప‌త్రుల‌కు వెళ్లే వారికి ఈ స‌మ‌స్య‌లు ఓ రేంజ్‌లో ఎదుర‌వుతున్నాయి. క‌రోనా విస్తృతి నేప‌థ్యంలో ఆస్ప‌త్రులు ప‌రిమిత స్థాయిలోనే సేవ‌లు అందిస్తుండ‌గా...స‌ద‌రు ఆస్ప‌త్రుల్లో కూడా అనారోగ్య సమస్య ఏదైనా తప్పనిసరిగా కరోనా టెస్ట్‌ చేయించుకుని రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో సామాన్య జ‌నం షాక్‌కు లోన‌వుతున్నారు. ఇటు అప్ప‌టికే ఎదుర‌వుతున్న అనారోగ్య సమస్యలకు ప‌రిష్కారం చూసుకోవాలా లేక‌పోతే.... కరోనా పరీక్ష చేయించుకోవడానికి వెళ్లాలా అంటూ తేల్చుకోలేక‌పోతున్నారు.

వివిధ జిల్లాల్లోని ప‌ట్ట‌ణాలు - న‌గ‌రాల్లో సామాన్య రోగ ల‌క్ష‌ణాల‌తో అయినా ఆస్ప‌త్రుల్లో చేరిన వారికి చికిత్స‌కంటే ముందే కోవిడ్ రిపోర్టు తెచ్చుకోవాల‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. రిపోర్టులో నెగ‌టివ్ వ‌స్తేనే - వైద్యం చేస్తామ‌ని తేల్చిచెప్తున్నారు. దీంతో కోవిడ్‌కు శాంపిల్లు ఇచ్చి ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు ఎదురుచూసి వైద్యం పొందుతున్నారు. ముఖ్యంగా జ్వ‌రం ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికైతే స‌మ‌స్య‌లు చెప్ప‌న‌ల‌వి కాదు. కొద్దిపాటి జ్వరం వచ్చినా కూడా కొవిడ్‌ పరీక్షా రిపోర్టు తేవాల‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. దీంతో రిపోర్టు కోసం ఆయా డ‌య‌గ్నోసిస్‌ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఇలాంటి వారితో స‌ద‌రు కేంద్రాల్లో రద్దీ పెరుగుతోంది.

మ‌రోవైపు, ఈ నిబంధ‌న‌ల వ‌ల్ల‌ అత్యవసర పరిస్థితిలో వైద్యం చేయించుకోవడానికి చేరుతున్నవారి పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. అనారోగ్య సమస్యతో ఉన్నవారిని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు యాజమాన్యాలు అంగీకరించడం లేదు. జలుబు - దగ్గు - ఫ్లూ జ్వరాలతో వస్తున్న రోగులను పరీక్షించకుండానే కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకుని రావాలని చెప్పేస్తున్నారు. అనారోగ్య సమస్య ఏదైనా తప్పనిసరిగా కరోనా టెస్ట్‌ చేయించుకుని రావాల్సిందేనని చెబుతుండడంతో రోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.