Begin typing your search above and press return to search.

కొత్త ఇంట్లో వ్రతం.. గుంపుగా వెళ్లిన హిజ్రాలు ఏం చేశారంటే?

By:  Tupaki Desk   |   27 Dec 2020 6:20 AM GMT
కొత్త ఇంట్లో వ్రతం.. గుంపుగా వెళ్లిన హిజ్రాలు ఏం చేశారంటే?
X
మాటల్లో చెప్పలేని ఆరాచకం హైదరాబాద్ లోని కొందరు హిజ్రాలు తరచూ చేస్తుంటారు. తమలోని లోపాల్ని వారు బయటపెట్టుకుంటూ.. దాన్నో దందాగా చేసుకునే వైనం తరచూ చర్చకు వస్తుంటుంది. కొత్త షాపు ఓపెన్ చేస్తే చాలు.. ఆ షాపు వద్దకు వచ్చి.. రచ్చ చేసే కొందరు హిజ్రాలు.. తాము అడిగింది ఇవ్వకుంటే.. చేసే రభస అంతా ఇంతా కాదు. ప్రతి షాపుకు వెళ్లటం.. రోజువారీ మామూలు.. వారం వారీగా మామూళ్లు వసూలు చేయటం ఒక అలవాటుగా మారింది.

హైదరాబాద్ మహానగరంలోని ఏ కొత్త షాపు అయినా ఓపెన్ చేస్తే.. రెండు.. మూడు లక్షల వరకు వసూలు చేస్తారు. కాదు కూడదంటే.. రూ.50వేలకు తగ్గకుండా వసూళ్లకు పాల్పడతారు. ఒకవేళ.. వారు అడిగినంత ఇవ్వకుంటే.. బట్టలు విప్పేసి రచ్చ రచ్చ చేస్తారు. దీంతో.. బెదిరిపోయిన వ్యాపారులు.. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటే.. వేదన చెందుతూనే డబ్బులు సమర్పించుకుంటారు. ఇది ఎప్పటి నుంచో సాగే యవ్వారమే. ఇదిలా ఉంటే.. తాజాగా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో హిజ్రాలు ఆరాచకం పరాకాష్ఠకు చేరకుంది.

కొత్త ఇంట్లో జరుగుతున్న వ్రతానికి పది మంది హిజ్రాలు వెళ్లారు. ఇంట్లోకి వెళ్లిన వారు.. ఇంటి యజమానిని డబ్బులు అడిగారు. ఆయన ఇవ్వకపోవటంతో.. గొడవ గొడవ చేయటమే కాదు.. బట్టలు విప్పి అసభ్యంగా వ్యవహరించారు. దీంతో బంధువుల ముందు తలకొట్టేసినంత పనైంది. బలవంతంగా ఆ ఇంటి యజమాని నుంచి రూ.16500 వసూలు చేసుకొని వెళ్లారు.

ఈ దందాపై బాధితుడు.. బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. విచారణ జరిపిన పోలీసులు పది మంది హిజ్రాల్ని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. వారి నుంచి ఏడు సెల్ ఫోన్లు.. రూ.16500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే హిజ్రాల తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తగిన చర్యలకు అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.