Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై లాక్‌ డౌన్ ఉల్లంఘన కేసు - హైకోర్టు ఆగ్రహం!

By:  Tupaki Desk   |   28 May 2020 5:18 PM GMT
చంద్రబాబుపై లాక్‌ డౌన్ ఉల్లంఘన కేసు - హైకోర్టు ఆగ్రహం!
X
మాజీ ముఖ్యమంత్రి - టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ ముగిసింది. అధినేతతో పాటు నారా లోకేష్ - మరికొందరు ఎమ్మెల్యేలపై ఈ పిల్ దాఖలైంది. ఇందులో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపు మూడు గంటల పాటు హైకోర్టు వాదనలు విన్నది.

కరోనా కట్టడికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రకృతి విపత్తు నివారణ చట్టం 2005 ప్రకారం ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని హైకోర్టు పేర్కొంది. తొలుత సంబంధిత శాఖకు ఫిర్యాదు చేయకుండా నేరుగా కోర్టుకు రావడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. నేరుగా పిల్ వేసినందున వాస్తవ విషయాలపై విచారణ చేయలేమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ నిబంధనలపై బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ఉల్లంఘించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

నిబంధనల ఉల్లంఘనపై చట్టం ప్రకారం సంబంధిత శాఖలో ఫిర్యాదు చేసేందుకు అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఫిర్యాదులు అందగానే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద చంద్రబాబు - ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు.