Begin typing your search above and press return to search.

వైకాపాలో చిచ్చు పెట్టిన ఇన్‌ చార్జ్ నియామ‌కం

By:  Tupaki Desk   |   8 Aug 2016 6:57 AM GMT
వైకాపాలో చిచ్చు పెట్టిన ఇన్‌ చార్జ్ నియామ‌కం
X
టీడీపీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పుణ్య‌మా అని జిల్లాల్లో కీల‌కనాయ‌కులంతా సైకిల్ ఎక్కేశారు. ఒక‌ప‌క్క అంత‌ర్గ‌త రాజ‌కీయాలు - కుమ్ములాట‌ల‌తో ఉన్న వైకాపాలో కొత్త ఇన్‌ చార్జ్‌ ల నియామ‌కం మ‌రో చిచ్చుపెడుతోంది. ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లాలో ఓ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ చార్జి నియామ‌కం పార్టీ అధినేత‌కు స‌రికొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. నేత‌ల మ‌ధ్య గ‌ల అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఈ నియామ‌కంతో బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ఉన్న స‌మ‌స్య‌ల‌కు తోడు నెల్లూరు జిల్లా రాజ‌కీయాలు జ‌గ‌న్‌ కు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయ‌ట‌.

వైకాపా గూడూరు నియోజకవర్గంలో గెలిచిన పాశం సునీల్‌ కుమార్‌.. తెదేపాలో చేరిన త‌ర్వాత నెల్లూరు జిల్లాలో అస‌లైన `రాజ‌కీయాలు` తెర‌పైకి వచ్చాయి. జిల్లా ఎంపీ మేకపాటి కుటుంబీకులకి సన్నిహితుడైన మేరిగ మురళి గతంలో వైకాపా జిల్లా అధ్యక్ష పదవిలో కొన్నాళ్లు కొనసాగారు. మేకపాటివారి అండతో గూడూరు ఇన్‌ ఛార్జ్‌ పదవి కోసం రంగంలోకి దిగారు. సీనియర్‌ నేత - మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ముఖ్య అనుచరుడు వీరి చలపతి కూడా ఈ పదవిపై ఆశపెట్టుకున్నారు.

వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌ రెడ్డి అనుచరుడు శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డితో బత్తిన విజయకుమార్‌ కి మంచి స్నేహసంబంధాలున్నాయి. దీంతో బత్తిన తన ప్రయత్నాలు తాను మొదలుపెట్టారు. అయితే అధినేత మాత్రం మురళికే ప‌ద‌వి అప్ప‌జెప్పారు. దీంతో ఆశావ‌హులంతా ఒక‌రిపై ఒక‌రు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగారు. దీనికి వైకాపా సమన్వయ సమావేశం వేదికైంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి - బత్తిన విజయకుమార్‌ లపై విరుచుకుపడ్డారు. వారిపై ఉన్న నిందారోపణలన్నీ ఏకరువుపెట్టారు. దీంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై మరో వ‌ర్గం కూడా గుర్రుగా ఉంది. ఒక‌రికి మ‌రొక‌రిపై అస్స‌లు పొస‌గ‌డం లేదు. మ‌రి నెల్లూరు జిల్లా వ్య‌వ‌హారంలో జ‌గ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకుంటారో వేచిచూడాలి!