Begin typing your search above and press return to search.

విజయవాడ నుంచి టీడీపీ ఎంపీగా ఆ బీజేపీ మాజీ ఎంపీ!

By:  Tupaki Desk   |   10 Nov 2022 3:30 PM GMT
విజయవాడ నుంచి టీడీపీ ఎంపీగా ఆ బీజేపీ  మాజీ ఎంపీ!
X
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారిపోయిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ అన్ని పార్టీలు అప్పుడే అభ్యర్థుల ఎంపిక, గెలుపు వ్యూహాలపై దృష్టి సారించాయి.

ఈ క్రమంలో టీడీపీకి కీలకమైన రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడ నగరం నుంచి పోటీ చేసే అభ్యర్థిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈసారి ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న కేశినేని నానికి టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. మరోవైపు కేశినేని నాని కూడా పార్లమెంటుకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో ఉన్నారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ తరఫున లోక్‌సభకు పోటీ చేస్తారని టాక్‌ నడుస్తోంది.

వాస్తవానికి సుజనా చౌదరి గత ఎన్నికల నాటికి టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే 2019లో టీడీపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యాక సుజనా చౌదరితోపాటు సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ తదితరులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎడమ భుజం, కుడి భుజంలాంటి వ్యక్తులైన సుజనా చౌదరి, సీఎం రమేష్‌లను బీజేపీలోకి పంపిందే చంద్రబాబు అని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి సుజనా చౌదరి మళ్లీ తన మాతృ పార్టీ టీడీపీలోకి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు చంద్రబాబు వద్దకు తన దూతలను సైతం పంపారని వార్తలు వస్తున్నాయి. అలాగే చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను సైతం సుజనా చౌదరి సంప్రదించినట్టు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం సుజనా చౌదరి రాజ్యసభ్య సభ్యుడిగా పదవీకాలం ముగిసింది. దీంతో ఇక మళ్లీ రాజ్యసభకు వెళ్లే చాన్స్‌ లేకపోవడంతో లోక్‌సభకు టీడీపీ తరఫున పోటీ చేసే యోచనలో ఉన్నారని సమాచారం.

తనకు విజయవాడ టీడీపీ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తే కృష్ణా జిల్లాలో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఖర్చంతా తాను భరిస్తానని సుజనా చౌదరి ఆఫర్‌ ఇచ్చినట్టు చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.