Begin typing your search above and press return to search.

థ్యాంక్స్ రేవంత్.. టీఆర్ఎస్ రెడ్లకు సుడి తిరిగినట్లే

By:  Tupaki Desk   |   13 Jun 2022 12:30 PM GMT
థ్యాంక్స్ రేవంత్.. టీఆర్ఎస్ రెడ్లకు సుడి తిరిగినట్లే
X
ఎక్కడో స్విచ్ వేస్తే మరెక్కడో లైటు వెలిగినట్లుగా.. రాజకీయాల్లో చోటు చేసుకునే ఒక పరిణామం.. దానికి సంబంధం లేని మరో పరిణామానికి కారణమవుతుంటుంది. తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిస్థితులే నెలకొన్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఒక క్రమపద్దతిలో రెడ్ల సామాజిక వర్గానికి ఉన్న ప్రాధాన్యతను.. ప్రాముఖ్యతను ఒక క్రమపద్ధతిలో తగ్గించినట్లుగా చెబుతారు. ఆ మాటకు వస్తే ఏపీతో పోలిస్తే తెలంగాణలో కులాల మీద చర్చ జరగటం.. రాజకీయాల్లో కుల ప్రాతిపదిక అంశాలకు పెద్దగా చోటు ఉండేది కాదు.

గులాబీ బాస్ కేసీఆర్ పుణ్యమా అని అలాంటి పరిస్థితి తెలంగాణలోనూ షురూ అయ్యిందని చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో రెడ్లకు పెద్ద పీట వేయటంతో పాటు.. పదవుల పంపకం విషయంలోనూ వారికి ప్రాధాన్యత లభించేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ప్రాధాన్యత తగ్గటాన్ని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు తరచూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. రాజకీయంగా తమకు తిరుగులేని అధిక్యత ఉండేదని.. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడటాన్ని వారు జీర్ణించుకోలేని పరిస్థితి.

అయితే.. రెడ్లను ముందుకు కదల్చటానికి.. వారి వర్గానికి నాయకత్వం వహించటానికి చాలామంది నేతలు ఉన్నా.. సమర్థుడు.. అందరికి ఆమోదయోగ్యమైన నేత లేరన్న లోటు ఉండేది. రేవంత్ రెడ్డి ఆ లోటును తీర్చటంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. టీపీసీసీ చీఫ్ పదవికి రేవంత్ ను నియమించిన నాటి నుంచి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఎక్కడెక్కడి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారంతా తమకో సమర్థుడైన నాయకుడు దొరికాడన్న సంతోషాన్ని వ్యక్తం చేసే పరిస్థితి. ఇంతకాలం తమకు నాయకుడు లేడన్న లోటును రేవంత్ తీర్చటంతో పాటు భవిష్యత్తు మీద కొత్త ఆశలు కల్పించటంలో సక్సెస్ అవుతున్నారు.

ఈ కారణంతో ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న పలువురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు సైతం సమయం చూసుకొని కారు నుంచి దిగిపోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ మార్పును గుర్తించిన గులాబీ బాస్ కేసీఆర్ కొత్త ప్లాన్ వేసినట్లుగా చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో రెడ్లకు అధిక ప్రాధాన్యత కల్పించేలా ఆయన వ్యూహరచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.వచ్చే ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేయటంతో పాటు.. ఆ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలకు టికెట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదంతా రేవంత్ ఎఫెక్టేనన్న మాట వినిపిస్తోంది.

గెలిచే సీట్లలో రెడ్లకు పెద్ద పీట వేయటంత.. ఓటమి చెందే స్థానాలకు బీసీలకు అప్పజెప్పటం.. రిజర్వు స్థానాలకు తప్పనిసరిగా వారికే అప్పజెప్పటం ద్వారా.. రెడ్లకు పెద్ద పీట వేసిన భావన కలిగించాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. తెలంగాణలో రేవంత్ ఎఫెక్టు మొదలైందని.. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఆ విషయాన్ని చెప్పేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.