Begin typing your search above and press return to search.

వెంటాడిన గ‌తం.. ఇంగ్లండ్ క్రికెట‌ర్ స‌స్పెన్ష‌న్‌.. మ‌హిళ‌ల‌పై అలా

By:  Tupaki Desk   |   7 Jun 2021 12:00 PM IST
వెంటాడిన గ‌తం.. ఇంగ్లండ్ క్రికెట‌ర్ స‌స్పెన్ష‌న్‌.. మ‌హిళ‌ల‌పై అలా
X
తెలిసి ప‌ట్టుకున్నా.. తెలియ‌క ప‌ట్టుకున్నా.. నిప్పు కాలుతుంది. ఇంగ్లండ్ క్రికెటర్ విష‌యంలో ఇదే జ‌రిగింది. తాను అజ్ఞానంతో త‌ప్పు చేసిన‌ట్టు తెలుసుకునే స‌మ‌యానికి జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఫ‌లితంగా.. కెరీర్‌ తొలి టెస్టును ఘ‌నంగా ప్రారంభించిన గంట‌ల్లోనే.. స్పెన్ష‌న్ కు గుర‌య్యాడు. ఇంత‌కీ అత‌డు చేసిన త‌ప్పు ఏమంటే..

ప్ర‌స్తుతం ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లోనే అరంగేట్రం చేశాడు ఇంగ్లండ్ యువ‌పేస‌ర్ ఓలీ రాబిన్ స‌న్‌. తొలి మ్యాచ్ లోనే 4 వికెట్లు తీసి కెరీర్ ను ఘ‌నంగా ఆరంభించాడు. ఆ ప్ర‌శంస‌ల జ‌ల్లు ఆగ‌క‌ముందే.. విమ‌ర్శ‌ల జ‌డి మొద‌లైంది. అత‌న్ని గ‌తం వెంటాడింది. ఆరేడు సంవ‌త్స‌రాల క్రితం సోష‌ల్ మీడియాలో మ‌హిళ‌ల‌పై వివ‌క్ష‌, జాత్యంహంకారంతో కూడిన వ్యాఖ్య‌లు చేశాడు.

స‌రిగ్గా చెప్పాలంటే.. 2012 నుంచి 2014 మ‌ధ్య ద‌శ‌ల వారీగా ట్విట‌ర్ వేదిక‌గా ఈ త‌ర‌హా పోస్టులు చేశాడు రాబిన్ స‌న్‌. ఇప్పుడు అత‌డు టెస్టుల్లోకి అరంగేట్రం చేయ‌డంతో అంద‌రూ పొగుడుతున్నారు. అయితే.. ఇత‌గాడి నిజ‌స్వ‌రూపం ఇదిగో ఇదీ.. చూడండి అంటూ పాత పోస్టుల‌ను తెర‌పైకి తెచ్చారు కొంద‌రు. దీంతో.. గంట‌ల్లోనే ఈ పోస్టులు వైర‌ల్ అయ్యాయి.

ఈ విష‌యం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వ‌ర‌కూ వెళ్ల‌డంతో.. అత‌డిపై చ‌ర్య‌లు తీసుకున్నారు. ముందుగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) రాబిన్ స‌న్ పై విచార‌ణ‌కు ఆదేశించింది. ఆ విచార‌ణ కొన‌సాగుతుండ‌గానే.. అత‌డిపై వేటు వేసింది. ఈ నిర్ణ‌యం ప్ర‌కారం.. అన్ని అంత‌ర్జాతీయ టోర్నీల నుంచి సస్పెన్ష‌న్ విధించింది.

దీనిపై ఓలీ రాబిన్ స‌న్ స్పందించాడు. తాను త‌ప్పు చేసిన‌ట్టు అంగీక‌రించాడు. అయితే.. తెలియ‌ని వ‌య‌సులో జ‌రిగిపోయింద‌ని అన్నాడు. ప్ర‌స్తుతం రాబిన్ స‌న్ వ‌య‌సు 27 సంవ‌త్స‌రాలు. అంటే.. 18 నుంచి 20 ఏళ్ల వ‌య‌సు మ‌ధ్య‌లో ఈ వ్యాఖ్య‌లు చేశాడ‌న్న‌మాట‌. అయిన‌ప్ప‌టికీ వేటు మాత్రం త‌ప్ప‌లేదు.