కుప్పం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న హాట్ టాపిక్ గా ఉంది. అది చంద్రబాబు ఇలాకా కావడంతోనే చిన్న మునిసిపాలిటీకి అంతటి పొలిటికల్ ఇంపార్టెన్స్ వచ్చింది. ఇక కుప్పం అన్నది ఇపుడు టోటల్ గా వైసీపీ పరం అయింది. దాని మీద మొదటి నుంచి కన్నేసి జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం చక్రం తిప్పారు. ఇందులో స్వామి కార్యం, స్వకార్యం కూడా ఇమిడి ఉన్నాయని అంటున్నారు.
వైసీపీని గెలిపించాలన్న పార్టీ ఆదేశాలను పాటిస్తూనే కుప్పంలో కూడా తమ ఫ్యామిలీ మెంబర్సే నాయకత్వం వహించాలన్న స్వార్ధం కూడా ఆయనకు ఉందని అంటున్నారు. కుప్పం విషయంలో రెండు నెలల ముందు నుంచే పెద్దిరెడ్డి ఫ్యామిలీ బరిలోకి దిగిపోయి మొత్తానికి మొత్తం బిగించేసింది.
కుప్పం మీద ఇంతలా ఫుల్ కాన్సట్రేషన్ చేయడం వెనక చాలా రాజకీయ కధే ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి పెద్దిరెడ్డి సోదరుడి కుమారుడు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు. అంటే అక్కడ చంద్రబాబును తప్పించి తమ ఫ్యామిలీ హస్తగతం చేసుకోవడం ద్వారా కుప్పం కోట తమదని చాటాలని పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆరాటపడుతోంది అంటున్నారు. ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.
అందులో భాగంగా సేఫ్ సైడ్ గా కుప్పం వైసీపీ ఇంచార్జి భరత్ కి ఎమ్మెల్సీ సీటు ఇచ్చారని కూడా చెబుతున్నారు. అంటే మరో రెండున్నరేళ్లలో జరిగే కుప్పం ఎన్నికల్లో భరత్ పోటీలో ఉండకుండా సుధీర్ రెడ్డిని దింపుతారు అన్న మాట. ఇక ఇప్పటికే పెద్దిరెడ్డి కుటుంబంలో చూసుకుంటే ఆయనతో పాటు కుమారుడు మిధున్ రెడ్డి, తమ్ముడు ద్వారకానాధ్ రెడ్డి ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు.
ఇపుడు కుప్పం నుంచి సుధీర్ రెడ్డిని దింపితే టోటల్ ఫ్యామిలీకి నాలుగు పదవులు అన్న మాట. మరి దీనికి జగన్ ఓకే చెబుతారా లేదా అన్నది కూడా చూడాలి. అయితే చిత్తూరు జిల్లాలో వైసీపీకి అతి పెద్ద దిక్కుగా ఉంటూ అన్ని ఎన్నికల్లోనూ పార్టీని గెలిపిస్తూ చంద్రబాబును చిత్తు చేస్తున్న పెద్దిరెడ్డి విషయంలో మరో మాట జగన్ చెప్పరని అంటున్నారు.
అంటే వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తే కనుక పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచే డైరెక్ట్ అటాక్ స్టార్ట్ అవుతుంది అనే తెలుస్తోంది. చూడాలి మరి ఈ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో.