Begin typing your search above and press return to search.

వైసీపీ రెబల్స్‌ ముగ్గురికి చంద్రబాబు టికెట్లు ఖాయం చేసినట్టేనా?

By:  Tupaki Desk   |   3 March 2023 1:32 PM GMT
వైసీపీ రెబల్స్‌ ముగ్గురికి చంద్రబాబు టికెట్లు ఖాయం చేసినట్టేనా?
X
ఏపీలో అధికార వైసీపీకి రెబల్స్‌ చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ అధిష్టానంతో విభేదించారు. అప్పటి నుంచి రచ్చబండ పేరుతో యూట్యూబ్‌ లో, సోషల్‌ మీడియాలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏకిపడేస్తున్నారు. నిత్యం వివిధ టీవీ చానెళ్లతోపాటు సోషల్‌ మీడియాలోనూ తమ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు.

మరోవైపు ఏకంగా సీఎం జగన్‌ సొంత సామాజికవర్గానికే చెందిన రెడ్లు.. అందులోనూ నెల్లూరు పెద్దారెడ్లు వైసీపీకి షాక్‌ ఇచ్చారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి.. జగన్‌ ప్రభుత్వ పనితీరుపై వరుసగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఏకంగా తమ ఫోన్లను తమ సొంత ప్రభుత్వమే ట్యాపింగ్‌ చేసిందని సంచలన విమర్శలు చేశారు.

దీంతో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలను వైసీపీ అధిష్టానం ఇంచార్జి పదవుల నుంచి తొలగించింది. వీరి స్థానాల్లో ఆదాల ప్రభాకరరెడ్డి (నెల్లూరు రూరల్‌), నేదురుమల్లి రాంకుమార్‌ రెడ్డి (వెంకటగిరి)లను ఇంచార్జులుగా నియమించింది. అంతేకాకుండా శ్రీధర్‌ రెడ్డి, రాంనారాయణరెడ్డిల భద్రతను కూడా వైసీపీ ప్రభుత్వం తగ్గించిందనే విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ ఈ ముగ్గురు రెబల్స్‌ కు టికెట్లు ఖాయం చేసిందనే వార్తలు వస్తున్నాయి. రఘురామకృష్ణరాజును వైసీపీ ప్రభుత్వం అవమానించిన తీరు, ఆయనను అరెస్టు చేసి చితకబాదిన వ్యవహారంతో క్షత్రియ సామాజికవర్గంలో తీవ్ర అసంతృప్తి ఉందని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో కీలకంగా ఉన్న క్షత్రియ సామాజికవర్గం వైసీపీకి ఓట్లేసే పరిస్థితి లేదన్నది టీడీపీ అంచనా. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజును నర్సాపురం నుంచి టీడీపీ ఎంపీగా బరిలోకి దించే అవకాశముందని అంటున్నారు.

ఇక ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయొచ్చని చెబుతున్నారు. లేకపోతే రాంనారాయణరెడ్డి కుమార్తె కైవల్యారెడ్డికి టీడీపీ సీటు ఇచ్చే చాన్సు ఉందని తెలుస్తోంది. ఆనం రాంనారాయణరెడ్డి లేదా ఆయన కుమార్తె కైవల్యారెడ్డి టీడీపీ తరఫున ఆత్మకూరు నుంచి పోటీ చేయడం ఖాయమంటున్నారు.

ఇక నెల్లూరు రూరల్‌ బరిలో ప్రస్తుత వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డికి కూడా టీడీపీ టికెట్‌ ఖరారు చేసిందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కోటంరెడ్డి సైతం తాను వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున నెల్లూరు రూరల్‌ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.

ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిలకు టికెట్లు ఇవ్వడం ద్వారా జగన్‌ ను ఆయన సొంత సామాజికవర్గంలోనే దెబ్బకొట్టాలని టీడీపీ భావిస్తోందని అంటున్నారు. అందులోనూ నెల్లూరు జిల్లాలో రెడ్లు పెద్ద రెడ్లుగా ముద్రపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తమ సామాజికవర్గానికి ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదనే భావనలో రెడ్లు ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలో రెడ్డి సామాజికవర్గంపైన చంద్రబాబు దృష్టి సారించారని చెబుతున్నారు.

మరోవైపు వైసీపీ... రఘురామకృష్ణరాజు, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డిలను పార్టీ నుంచి బహిష్కరించడం లేదు. ఈ పని చేస్తే వారికి సానుభూతి వస్తుందని భయపడుతోంది. అందుకే పొమ్మనకుండా పొగ బెడుతోందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే వారిని నియోజకవర్గ ఇంచార్జులుగా తప్పించడం, వారి భద్రతను కుదించడం, వైసీపీ నేతలతో వారిని తిట్టించడం చేస్తుందని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.