Begin typing your search above and press return to search.

అరుగొలనులో చంద్రబాబు ఫ్లెక్సీ పెట్టాడని జేసీబీతో షాపు కూల్చేశారు

By:  Tupaki Desk   |   10 May 2023 9:57 AM GMT
అరుగొలనులో చంద్రబాబు ఫ్లెక్సీ పెట్టాడని జేసీబీతో షాపు కూల్చేశారు
X
రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపులు ఇప్పటి రాజకీయాల్లో మామూలే. అందుకు భిన్నంగా సానుభూతిపరులు.. మద్దతుదారులపై పెద్ద ఎత్తున రివెంజ్ కార్యక్రమాన్ని చేపడుతున్న వైనం తెలుగు రాష్ట్రాల్లో మొదలైనట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీకి మద్దతు ఇవ్వని పక్షంలో.. వారెప్పటికి కోలుకోలేనంత నష్టానికి గురి చేయటం అలవాటుగా మారిందన్న ఆరోపణలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. దీనికి నిలువెత్తు నిదర్శనంగా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అరుగొలనులో చోటు చేసుకున్న ఒక ఘటన కలకలాన్ని రేపింది.

ఇప్పటివరకు విశాఖ.. అమరావతి లాంటి పట్టణ ప్రాంతంలో జేసీబీలతో ఆస్తుల ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టినట్లుగా విపక్ష నేతలు తరచూ ఆరోపిస్తుంటారు. ఇప్పడు అది పల్లెలకు పాకినట్లుగా వారు చెబుతున్నారు. టీడీపీకి చెందిన మాదల శ్రీనివాసరావు గతంలో తిప్పనగుంట సహకార సంఘం మాజీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయనకు అరుగొలను హైస్కూల్ ఎదురుగా ఉన్న నాలుగు సెంట్ల స్థలం (దగ్గర దగ్గర 200 గజాలకు కాస్త తక్కువ)లో పురుగ మందుల షాపు ఏర్పాటు చేశారు. ఐదేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం ఎదుట ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ షాపు ఎదుట ఫ్లెక్సీ పెట్టారు.

తాజాగా ఆయన షాపును మంగళవారం ఉదయం వచ్చి.. అక్రమణలో ఉందంటూ ప్రహరీగోడ కొట్టేసి..వెంటనే భవనాన్ని ఖాళీ చేయకుంటే పూర్తిగా కూల్చేస్తామని చెప్పారు. రోజు కూడా గడవక ముందే రాత్రి పది గంటల వేళలో.. షాపు మొత్తాన్ని నేలమట్టం చేశారు. కూల్చివేత వేళ.. పోలీసు బందోబస్తు పెట్టారు. ఇదంతా చంద్రబాబు పర్యటన సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయటంతో కక్ష కట్టి తమపై ఇలాంటి వేధింపు చర్యలకు పాల్పడినట్లుగా పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే.. తహసీల్దార్వాదన మరోలా ఉంది. ఈ షాపు వాగు స్థలం.. రోడ్డుపోరంబోకుగా ఉందని.. నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మించారని కంప్లైంట్ల వచచాయని చెబుతున్నారు. గత నెలలో 24, ఈ నెల 1న మరోసారి శ్రీనివాసరావుకు నోటీసులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. అయినా, స్పందించకపోవటంతో కూల్చేశామని చెప్పారు. దీనిపై షాపు యజమాని శ్రీనివాసరావు వాదన భిన్నంగా ఉంది. తానీ స్థలాన్ని చీపురుపల్లి శ్రీనివాసరావు వద్ద కొన్నానని.. ఇప్పటికే నాలుగైదు చేతులు మారిందని.. అక్రమ కట్టడమైతే పంచాయితీ పన్ను.. కరెంటు కనెక్షన్ ఎందుకు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా నోటీసులు ఇవ్వలేదని.. ప్రహరి కూల్చివేత వేళలో.. గోడకు అంటించినట్లుగా చెప్పారు. దీనిపై విపక్ష టీడీపీ ఏ రీతిలో రియాక్టు అవుతోందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.