Begin typing your search above and press return to search.

దగ్గుబాటి రాజకీయ అడుగులు ఎటువైపు?

By:  Tupaki Desk   |   31 March 2022 1:30 AM GMT
దగ్గుబాటి రాజకీయ అడుగులు ఎటువైపు?
X
దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు దివంగత మాజీ సీఎం, అన్న ఎన్టీఆర్ అల్లుడిగా రాజకీయాలను శాసించిన ఆ నేత చంద్రబాబు పాలిటిక్స్ కు ఎటూ కాకుండా పోయాడు. చంద్రబాబు కంటే సీనియర్ గా తెలుగుదేశంలో వెలుగు వెలిగారు. టీడీపీని చంద్రబాబు హైజాక్ చేసుకున్నాక ఈ తోడల్లుడు రాజకీయాలకు దూరంగా జరిగారు. పోయిన ఎన్నికల్లో వైసీపీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడిని పర్చూర్ నియోజకవర్గం నుంచి నిలబెట్టాలని యోచించారు. కానీ చివరకు విపత్కర పరిస్థితుల్లో కుమారుడికి అమెరికా పౌరసత్వం కారణంగా ఎమ్మెల్యేగా పోటీచేయలేకపోయారు. దీంతో దగ్గుబాటినే బరిలోకి దిగాల్సి వచ్చింది. వైసీపీ తరుఫున పోటీచేసిన ఆయన తొలిసారి ఓడిపోయారు.

గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నుంచి ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాలా రోజుల తర్వాత పొలిటికల్ తెరపైకి వచ్చి వైసీపీ తరుఫున పోటీచేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినా.. దగ్గుమాటి మాత్రం తృటిలో ఓడిపోయారు. గెలిచి ఉంటే ఖచ్చితంగా స్పీకర్ అయ్యిండేవారనే చర్చ ఆదిలోనే సాగింది.

రాజకీయాల నుంచి వైదొలిగి చాలా కాలం కావడంతో వెంకటేశ్వరరావు బలం.. బలగం తగ్గిపోయింది. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడ్డా ఆయన గెలవలేకపోయారు. . దగ్గుబాటి వైసీపీలో ఇప్పుడు మౌనంగా ఉంటుండగా.. ఆయన భార్య, పురంధేశ్వరి బీజేపీలో కీలక స్థానంలో ఉన్నారు. అయితే రాజకీయంగా ఈ రెండు పార్టీలు వేరు వేరు. అందుకే పురంధేశ్వరి తన భర్త ఉన్న వైసీపీ పార్టీని తిట్టడం.. జగన్ పై విమర్శలు చేయడం వైసీపీని ఇరుకునపెట్టింది.దీంతో భర్త వైసీపీ, భార్య బీజేపీలో ఉండడం తగదంటూ వైసీపీ నుంచి దుగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అల్టీమేటం జారీ అయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. పురంధేశ్వరినీ కూడా వైసీపీలోకి తీసుకురావాలని దగ్గుబాటికి జగన్ స్పష్టం చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యవహారం కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా కొనసాగుతోంది.

అప్పట్లో బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఈ వివాదంపై తొలిసారి స్పందించారు. తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరినప్పుడే.. తనను చేరాలని వైసీపీ నుంచి ఆహ్వానం అందిందని పురంధేశ్వరి తెలిపారు. తామిద్దరం వేరు వేరు పార్టీలో ఉంటామని... తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టంగా వైసీపీ అధిష్టానానికి చెప్పినట్లు పురంధేశ్వరి వివరించారు. ఈ ప్రతిపాదనకు వైసీపీ నేతలు అంగీకరించిన తర్వాత నా భర్త, కుమారుడు వైసీపీలో చేరారని.. తాను బీజేపీలోనే కొనసాగనని పురంధేశ్వరి తెలిపారు.

ఇక ఇటీవల సంక్రాంతి పండుగకు తన బద్ద విరోధి అయిన చంద్రబాబుతోపాటు బావమరిది బాలకృష్ణ తో కలిసి దగ్గుబాటి ఫ్యామిలీ వేడుకల్లో పాల్గొనడంతో వీరంతా కలిసిపోయినట్టైంది. ఎన్టీఆర్ పెద్ద కూతురు ఉమా మహేశ్వరి కుమార్తె వివాహ వేడుకల్లోనూ దగ్గుబాటి, చంద్రబాబు అప్యాయంగా మాట్లాడుకోవడంతో ఇద్దరూ కలిసిపోతారనే టాక్ నడుస్తోంది.

ఈ క్రమంలోనే దగ్గుబాటి కుమారుడు హితేష్ చీరాలలో టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తారని ప్రచారం సాగింది. ఆయన కుమారుడు నిజంగానే టీడీపీలోకి వెళతారా? రెండు కుటుంబాలు కలిసిపోతాయా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే హితేష్ వ్యాపారం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారని.. రాజకీయాల్లో ఈ ఓట్లు అడగడాలు, ప్రజా సేవ, విపరీతంగా డబ్బులు ఖర్చు చేయడం తమ వల్ల కాదని దగ్గుబాటి చెబుతున్నారట.. ఇప్పటికే పురంధేశ్వరి బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. ఆమె ఉంటే చాలని ఇక ఎవరూ అక్కరలేదని భావిస్తున్నారు.

ప్రస్తుతం దగ్గుబాటి ఆలోచన కేవలం కుటుంబం, సొంత వ్యాపారాలు చూసుకోవడానికి మాత్రమేనని అంటున్నారు. రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారంటున్నారు. నిజంగానే ఆయన సైలెంట్ గా ఉన్నారా? వ్యూహాత్మక మౌనమా? అన్నది తేలాల్సి ఉంది.