Begin typing your search above and press return to search.

ఆర్టిక‌ల్ 370 పై కూడా ఉద్య‌మం చేస్తే కేంద్రం వెనక్కు తగ్గుతుందా !

By:  Tupaki Desk   |   19 Nov 2021 9:50 AM GMT
ఆర్టిక‌ల్ 370 పై కూడా ఉద్య‌మం చేస్తే కేంద్రం వెనక్కు తగ్గుతుందా !
X
కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఏడాది నుంచి రైతులు చేసిన పోరాటానికి కేంద్రం తలొగ్గింది. శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. సిక్కులకు అత్యంత పవిత్రమైన రోజున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు మోదీ పేర్కొన్నారు. అయితే, కొత్త సాగు చట్టాల వల్ల చిన్న రైతులకు మేలు జరుగుతుందని మోదీ అంతకు ముందు వ్యాఖ్యానించారు. రైతులకు మేలు జరిగేలా ఈ చట్టాలను తీసుకొచ్చినా, అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యారని తెలిపారు.

ఈ మూడు చట్టాలను వెనక్కు తీసుకునే ప్రక్రియ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిచేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రకటన చేస్తామని తెలిపారు. అలాగే, ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైతులు, నిపుణులు ఉంటారని తెలిపారు. ఈ కమిటీ నిర్ణయాల ఆధారంగా వ్యవసాయ రంగానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వ్యవసాయానికి బడ్జెట్‌లో కేటాయింపులు ఐదు రెట్లు పెంచామని తెలిపారు. రైతులకు తక్కువ ధరకే విత్తనాలు లభించేలా కృషిచేశామని అన్నారు.

అయితే, రైతు చ‌ట్టాలకు వ్య‌తిరేకంగా చేసిన పోరాటం మాదిరిగానే జ‌మ్మూకాశ్మీర్‌కు ప్ర‌త్యేక అధికారాలు అందించే ఆర్టిక‌ల్ 370ని తిరిగి తీసుకొచ్చేందుకు జ‌మ్మూకాశ్మీర్ నేత‌లు పోరాటం చేసే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవ‌డం మొద‌లుపెడితే న‌చ్చ‌ని ప్ర‌తి చ‌ట్టాన్ని వెన‌క్కి తీసుకునే వ‌ర‌కు పోరాటాలు జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

జమ్మూ కశ్మీర్‌ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నాటి భారత ప్రభుత్వం చేసిన ఏర్పాటే ఆర్టికల్ 370. ఈ ఆర్టికల్ వల్ల రాజ్యాంగం ప్రకారం ఇతర రాష్ట్రాలకు వర్తించిన నిబంధనలేవీ జమ్మూ కశ్మీర్‌ కు వర్తించవు. దీని ప్రకారమే 1965 వరకూ ఆ రాష్ట్రానికి సీఎం బదులు ప్రధాని, గవర్నర్ స్థానంలో ప్రెసిడెంట్ ఉండేవారు. ఆర్టికల్ 370 పట్ల రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ ఆర్టికల్‌ ను గోపాలస్వామి అయ్యంగార్ రూపొందించారు. ఆయన అంతకు ముందు జమ్మూ కశ్మీర్ రాజు మహారాజా హరి సింగ్ వద్ద దివాన్‌ గా పని చేశారు.

రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార శాఖల వ్యవహారాలు మినహా మిగతా చట్టాల అమలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి.ఆర్టికల్ 370 ప్రకారం బయటి వ్యక్తులు జమ్మూ కశ్మీర్లో భూమి లేదా ఆస్తులు కొనుగోలు చేయడం కుదరదు. యుద్ధం, విదేశీ దురాక్రమణ సమయంలోనే కేంద్రం ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించగలదు. అంతర్గత ఘర్షణలు తలెత్తినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేనిదే ఎమర్జెన్సీ విధించలేం. జమ్మూ కశ్మీర్‌ కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పీనల్ కోడ్ ఉన్నాయి.రాష్ట ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి ఆరేళ్లు.