Begin typing your search above and press return to search.

నయింతో రిలేషన్ ను రివీల్ చేసిన నేతి?

By:  Tupaki Desk   |   6 March 2017 4:54 AM GMT
నయింతో రిలేషన్ ను రివీల్ చేసిన నేతి?
X
చివరకు ఏం జరుగుతుందన్న విషయాన్ని పక్కన పెడితే.. ప్రొసీజర్ ప్రకారం జరగాల్సినవి జరగటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిపోతుంటాయన్న భావన కలిగించటంలో కేసీఆర్ సర్కారు సక్సేస్ అవుతుందన్న మాట వినిపిస్తోంది. గ్యాంగ్ స్టర్ నయిం ఎన్ కౌంటర్ నేపథ్యంలో అధికార పార్టీ నేతలపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కొందరు నేతలకైతే నయింతో నేరుగా సంబంధాలు ఉన్నాయని.. అతడి దందాలతో వారు భాగస్వామ్యమైనట్లుగా వార్తలు వచ్చాయి. భారీగా డబ్బులు ఇవ్వాలని నయిం బెదిరిస్తే.. సాయం కోసం వెళ్లిన నేతలు సైతం.. డబ్బులు ఇచ్చేయొచ్చుగా అన్న మాటల్ని చెప్పారన్న విమర్శలు ఉన్నాయి.

ఈ తరహా ఆరోపణల్ని ఎదుర్కొన్న వారిలో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు ఒకరుగా చెబుతుంటారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆయన్ను.. నయిం కేసు విచారిస్తున్న సిట్ అధికారులు దాదాపు మూడు గంటల పాటు ఆయనింట్లోనే విచారణ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ మాటను నేతి తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ.. విచారణ జరిగిందన్న వాదన మాత్రం జోరుగా సాగుతోంది.

ఇంతకీ నేతి పేరు తెర మీదకు ఎలా వచ్చిందన్న విషయాన్ని చూస్తే.. భువనగిరికి చెందిన గంపా నరేందర్ అనే బిజినెస్ మ్యాన్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. నయిం తనను రూ.2కోట్లు ఇవ్వాలని బెదిరించారని.. ఈ నేపథ్యంలో తాను నేతి విద్యాసాగర్ ను ఆశ్రయించగా.. ‘‘అన్నతో లొల్లి ఎందుకు..? డబ్బు ఇచ్చేయ్’’ అన్న సలహా ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. నయింకు భయపడి తాను తన ఫోన్ ను స్విచ్ఛాప్ చేసుకుంటే.. విద్యాసాగర్ మాత్రం తన పక్కింటి వారికి ఫోన్ చేసి మరీ.. నయింకు డబ్బులు ఇవ్వాలని చెప్పినట్లుగా పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో నయింకు.. నేతికి మధ్యనున్న సంబంధాలపై పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు. ఇప్పటికే.. వీరిద్దరి మధ్య సంబంధాలపై కొన్ని ఆధారాల్ని పోలీసులు సేకరించినట్లుగా చెబుతున్నారు. తాజా సిట్ విచారణలో నయింతో తనకేమాత్రం సంబంధాలు లేవని.. కేవలం అతను మిత్రుడు మాత్రమేనని.. అంతకు మించి మరెలాంటి సంబంధం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. నేతి మాటలతో పోలీసులు తమ దగ్గరి ఆధారాల్ని చూపించినట్లుగా చెబుతున్నారు. దాదాపు వారం క్రితం జరిగినట్లుగా చెబుతున్న సిట్ విచారణ.. ఇప్పుడే బయటకు ఎందుకు వచ్చిందన్న అంశంపైనా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

మరికొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. నయిం కేసులో ప్రభుత్వం పక్కాగా ఉందని.. ప్రొసీజర్ ప్రకారం జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయని.. ఈ కేసు విషయంలో తమ ప్రమేయం ఎంతమాత్రం లేదన్న విషయాన్ని చెప్పేందుకే ప్రభుత్వం ఇలా ప్లాన్ చేసి ఉంటుందన్నఅభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంతోనే.. విచారణ వివరాలు బయటకు లీక్స్ రూపంలో ఇచ్చి ఉంటారన్న మాట వినిపిస్తోంది. మరోవైపు నేతి మాత్రం తనను ఎవరూ విచారించలేదని.. ఒకవేళ విచారించినట్లుగా నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/