Begin typing your search above and press return to search.

అర్జెంట్ గా బాబుకో కొత్త ఇల్లు కావాల‌ట‌!

By:  Tupaki Desk   |   26 Jun 2019 1:00 PM IST
అర్జెంట్ గా బాబుకో కొత్త ఇల్లు కావాల‌ట‌!
X
అయ్య‌లారా.. అమ్మ‌లారా.. మా బాబుకు ఒక ఇల్లు కావాలి. అది కూడా అర్జెంట్ గా అంటూ తెలిసిన‌వారంద‌రిని అడుగుతున్నార‌ట తెలుగు త‌మ్ముళ్లు. ఏపీ రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో బాబుకు ఇప్పుడో కొత్త ఇల్లు అవ‌స‌ర‌మైంది. క‌ర‌క‌ట్ట‌కు ద‌గ్గ‌ర్లో నిర్మించిన లింగ‌మ‌నేని ఎస్టేట్స్ లో చంద్ర‌బాబు అద్దెకు ఉండ‌టం తెలిసిందే. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉన్న ఈ ఇంటిని కూల్చాల‌న్న యోచ‌న‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉంది.

అక్ర‌మ నిర్మాణాల మీద గుర్రుగా ఉన్న సీఎం జ‌గ‌న్‌.. ముందు ప్ర‌జ‌ల ఆస్తుల‌ను ఒక కొలిక్కి తెచ్చే దానికి ముందు.. ప్ర‌భుత్వం.. ప్ర‌ముఖులు ఉండే అక్ర‌మ నిర్మాణాల సంగ‌తి చూడాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉండ‌టం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్ర‌భుత్వానికి చెందిన ప్ర‌జావేదిక భ‌వ‌నాన్ని కూల్చేయ‌టం తెలిసిందే. దీని త‌ర్వాత బాబు అద్దెకు ఉంటున్న ఇంటినే కూల్చేయ‌నున్న‌ట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు బాహాటంగా చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం నుంచి నోటీసులు అందే లోపే కొత్త ఇంట్లోకి మారాల‌న్న ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు కొత్త ఇంటి కోసం అన్వేష‌ణ షురూ అయ్యింది. బాబుకు అవ‌స‌రాల‌కు తగ్గ‌ట్లు ఇంటి కోసం త‌మ్ముళ్లు విప‌రీతంగా వెతుకులాట మొద‌లెట్టార‌ట‌. బాబుకు అవ‌స‌ర‌మైన ఇంటికి స‌మావేశ మందిరం.. విశాలంగా ఉండ‌టంతోపాటు.. పెద్ద ఎత్తున వాహ‌నాలు వ‌స్తే పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా ఉండ‌టం.. వంద‌.. రెండు వంద‌ల‌కు పైగా నేత‌లు..కార్య‌క‌ర్త‌లు వ‌చ్చినా ఎలాంటి ఇబ్బందులు లేని ఇల్లు కావాలంటున్నారు.

అదే స‌మ‌యంలో కొత్త ఇల్లు ఉండాల‌ని.. ఇంటీరియ‌ర్ బాగుండాల‌న్న మాట వినిపిస్తోంది. వెంట‌నే ఇంట్లోకి షిఫ్ట్ కావాల్సి ఉన్నందున ఇంటీరియ‌న్ అంతా క‌రెక్ట్ గా ఉన్న ఇంట్లోకి దిగాల‌న్న యోచ‌న‌లో బాబు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. అన్నింటికి మించి గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ కు ద‌గ్గ‌ర‌గా ఉండే ఇంటి కోసం త‌మ్ముళ్లు వెతుకుతున్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి.. బాబుకు కావాల్సిన హంగులు ఉండే ఇల్లు విజ‌య‌వాడ‌.. గుంటూరులో ఉంటుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. సీఎంగా ఐదేళ్లు ఉండి.. సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోని బాబుకు ఈ తిప్ప‌లు త‌ప్ప‌వు మ‌రి.