Begin typing your search above and press return to search.

కేశినేనికే బాబు ఓటు.. మ‌రి వాళ్ల సంగ‌తి?

By:  Tupaki Desk   |   23 Dec 2021 7:00 PM IST
కేశినేనికే బాబు ఓటు.. మ‌రి వాళ్ల సంగ‌తి?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్నారు. టీడీపీకి భ‌విష్య‌త్ ఉండాలంటే 2024 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను ఓడించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఆ దిశ‌గా బాబు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంఛార్జీల‌ను నియ‌మిస్తూ సాగుతున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల‌ను ఎంపీ కేశినేని నానీకి అప్ప‌గించారు. ఇప్పుడు బాబు తీసుకున్న ఈ నిర్ణ‌యం ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో ఇద్ద‌రు ముఖ్య నేత‌ల‌కు మింగుడు ప‌డ‌డం లేద‌ని స‌మాచారం.

వాళ్ల‌ను కాద‌ని..

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త బాధ్య‌త‌ల‌ను కేశినేని నానీకి బాబు క‌ట్ట‌బెట్ట‌డంపై మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌, టీడీపీ అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని టాక్. ముఖ్య నేత‌లైన ఈ ఇద్ద‌రికీ బాబు షాకిచ్చార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయకుడైన నానీకి పెద్ద‌పీట వేసి.. త‌మ నేత‌ల‌కు బాగా బుద్ధి చెప్పార‌ని వెంక‌న్న‌, నాగుల్ మీరా అనుచ‌రులు వాపోతున్నారు. ఈ ప‌ద‌విని త‌మ ఇద్ద‌రిలో ఎవ‌రికి ఇచ్చినా క‌లిసి ప‌ని చేసుకుంటామ‌ని కొంత‌కాలంగా వాళ్లు కోరుతున్నారు. కానీ ఇద్ద‌రినీ కాద‌ని నానీని ఎంపిక చేయ‌డంపై ఇప్పుడు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

ఆ విభేదాలు..

కేశినేని నానీతో బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరాకు విభేదాలున్నాయ‌న్న‌ది తెలిసిన విష‌య‌మే. గ‌త న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అవి బ‌య‌ట‌ప‌డ్డాయి. కేశినేని కుమార్తె శ్వేత‌ను మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డాన్ని బుద్ధా, నాగుల్‌, బొండా ఉమా బ‌హిరంగంగానే వ్య‌తిరేకించారు. సామాజిక మాధ్య‌మాల్లోనూ నానీకి వెంక‌న్న‌కు మ‌ధ్య వార్ జ‌రిగింది.

మ‌రోవైపు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ యాక్టీవ్‌గా లేక‌పోవ‌డంతో దానిపై పార్టీ దృష్టి సారించింది. ఈ అవ‌కాశాన్ని అందుకోవాల‌నే ఉద్దేశంతో వెంక‌న్న‌, నాగుల్ గ‌త కొంత కాలంగా అక్క‌డ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇప్పుడు వాళ్ల‌ను కాద‌ని నానీకి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంపై అసంతృప్తిగా ఉన్న‌ట్లు స‌మాచారం.

అంతే కాకుండా వెంక‌న్న‌, నాగుల్ వేసిన క‌మిటీల‌ను ప‌క్క‌న పెట్టి నియోజ‌క‌వ‌ర్గంలో డివిజ‌న్ స్థాయి క‌మిటీల‌ను నియ‌మించేందుకు నానీకి అధిష్ఠానం స్వేచ్ఛ‌నిచ్చింది. ఇది ఆ ఇద్ద‌రు నేత‌ల‌కు మ‌రింత ఆగ్ర‌హం తెప్పిస్తోంది. ఈ నేప‌థ్యంలో వీళ్లిద్ద‌రూ కేశినేని నానీకి ఏ మాత్రం స‌హ‌క‌రిస్తార‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏది ఏమైనా గ‌తంలో త‌న మీద తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన ఆ ఇద్ద‌రు నాయ‌కుల‌పై ఇప్పుడు నాని పైచేయి సాధించార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.