Begin typing your search above and press return to search.

వామ్మో!... బాబులో ప‌ల్నాటి పౌరుష‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   4 April 2019 4:41 AM GMT
వామ్మో!... బాబులో ప‌ల్నాటి పౌరుష‌మ‌ట‌!
X
ఏపీలో అటు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌రుగుతున్న నేప‌థ్యంలో పొలిటిక‌ల్ హీట్ అమాంతంగా పెరిగిపోయింది. ఇప్ప‌టికే నామినేష‌న్ల ఘ‌ట్టం ముగిసిపోవడం, పోలింగ్‌కు కేవ‌లం వార‌మే మిగిలి ఉన్న నేప‌థ్యంలో ఇటు విప‌క్ష వైసీపీతో పాటు అటు అధికార పార్టీ టీడీపీ కూడా త‌మ‌దైన శైలిలో ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్ర‌చారంలో అటు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ల‌తో పాటు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కూడా ప‌దునైన వ్యాఖ్య‌ల‌తో వైరి వ‌ర్గాల‌ను గుల్ల చేసేసి... జ‌నాన్ని త‌మ వైపున‌కు తిప్పుకునే య‌త్నం చేస్తున్నారు. ఇందులో బాగంగా ఏనాడూ వీరి నోట రానటువంటి ప‌దాలు, ఘాటు వ్యాఖ్య‌లు, సంచ‌ల‌న ప‌ద‌బందాలు దొర్లుతున్నాయి. ఈ వ్యాఖ్య‌ల్లో గాఢ‌త అంత‌కంత‌కూ పెరిగిపోతోంద‌నే చెప్పాలి.

వైరి వ‌ర్గంపై ఎంత మేర నిప్పులు చెరిగినా క‌ట్టు త‌ప్పకుండా సాగే... చంద్రబాబు నోట కూడా ఇప్పుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఐటీ, ఈడీ సంస్థ‌లు వ‌రుస‌గా టీడీపీ నేత‌ల‌ను టార్గెట్ చేసుకుంటూ దాడులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా నిన్న టీడీపీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రిపై కొర‌డా ఝుళింపించిన ఈడీ.. ఏకంగా రూ.315 కోట్ల విలువ క‌లిగిన ఆస్తుల‌ను అటాచ్ చేసింది. ఈ షాక్ నుంచి తేరుకునేలోగానే.. నేడు క‌డ‌ప జిల్లా మైదుకూరు టీడీపీ అభ్య‌ర్థి, టీటీడీ తాజా మాజీ చైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ పై ఐటీ దాడులు జ‌రిగాయి. ఈ విష‌యాల‌పై స్పందించిన చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేటలో నిర్వ‌హించిన ఎన్నిక‌ల స‌భ‌లో మాట్లాడిన చంద్ర‌బాబు... ఐటీ, ఈడీ దాడుల‌పై నిప్పులు చెరిగారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌లో ప‌ల్నాటి పౌరుషం ఉందంటూ చంద్ర‌బాబు త‌న‌దైన శైలి కామెంట్ చేశారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే... *ఏపీ సాగునీటి ప్రాజెక్టులకు కేసీఆర్‌ ఆటంకాలు సృష్టిస్తున్నారు. కేసీఆర్‌ కు భజన చేసే జగన్‌ కు సిగ్గులేదా?. ఐటీ దాడులకు భయపడేదిలేదు, మాలో పల్నాడు పౌరుషం ఉంది. గుజరాత్‌ పేరును మోదీ చెడగొడుతున్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మోదీ కంకణం కట్టుకున్నారు. పోలవరాన్ని మోదీ ఒక్కసారైనా సందర్శించారా?. ఏపీ గడ్డపై మోదీ ఆటలు సాగనివ్వను. పేదలందరికీ పెన్షన్లను రూ.3వేలు ఇస్తాం. కోడికత్తి పార్టీని నమ్ముకుంటే జైలుకుపోతారు* అని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.