Begin typing your search above and press return to search.

శభాష్ వైఎస్సార్...ఈ మాట అన్నది బాబు గారు

By:  Tupaki Desk   |   9 Dec 2022 3:09 PM GMT
శభాష్ వైఎస్సార్...ఈ మాట అన్నది బాబు గారు
X
వైఎస్సార్. దివంగత నేత. రాయలసీమకు చెందిన నిఖార్సు అయిన రాజకీయ నాయకుడు. ముక్కుసూటి మనిషి. మాట ఇస్తే వెనక్కి తగ్గని నైజం, ఎంతటి వారిని అయినా క్షమించే గుణం అందరి ప్రేమను అలా సొంతం చేసుకునే గొప్పదనం వైఎస్సార్ సొంతం. తెలుగింటి పంచెకట్టుతో ఏపీని ఏలిన చిట్ట చివరి నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు.

ఆయన జ్ఞాపకాలు ఏపీని ఎప్పటికీ వదలవు. ఆయనకు రాజకీయ వారసులుగా ఎవరు ఉన్నా ఆయనకు సరిసాటి నేతలు లేరనే అంటారు. ఆయన ఉమ్మడి ఏపీ సీఎం గా అయిదుంపావు ఏళ్ళు పాలించారు. ఆయన పాలన జనరంజకంగా సాగింది. ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలీ రెండూ తెలిసిన నాయకుడు వైయస్సార్.

ఇదంతా ఎందుకు అంటే వైఎస్సార్ పరిపూర్ణమైన నాయకుడు అని చెప్పడానికే. ఆయన ఇపుడు ప్రతిపక్ష తెలుగుదేశానికి కూడా చాలా బాగా నచ్చేస్తున్నాడు. వైఎస్సార్ జీవించి ఉన్న రోజులలో గట్టిగా పోట్లాడింది తెలుగుదేశమే. ఇక పీసీసీ చీఫ్ గా మూడున్నర పదుల వయసులో కీలక బాధ్యతలు మోసిన దగ్గర ఉంచి ముఖ్యమంత్రిగా 2009లో ఆకస్మిక మరణం వరకూ ఆయన రాజకీయ జీవితం అంతటా పోరాడింది టీడీపీతోనే.

అయితే ఆయన ప్రత్యర్ధిగా టీడీపీని ఏనాడూ చూడలేదు. అందుకే ఆయన మరణించిన తరువాత ఇన్నేళ్ళకు ఆయన రాజకీయం ఏంటో ఆయన మంచితనం గొప్పతనం ఏంటో టీడీపీకి బాగా తెలిసివస్తోంది అనుకోవాలి. అది కూడా ఆయన కుమారుడు ఏపీ సీఎం గా ఉన్నప్పటి నుంచి మరీ మరీ వైఎస్సార్ ని తెలుగుదేశం పార్టీ తలచుకుంటోంది. గొప్ప నాయకుడు వైఎస్సార్ అని ఎవరో అంటే ఏమో అనుకోవచ్చు. సాక్షాత్తు చంద్రబాబు అంటున్నారు.

ఆయనకు కితాబు ఇస్తున్నారు. ఇదేమి ఖర్మ అంటూ ఆయన జిల్లాల టూర్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శభాష్ వైఎస్సార్ అని వేలాది మంది తెలుగుదేశం జనాల మధ్యలో అనేసి అందరికీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇంతకీ శభాష్ వైఎస్సార్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే తను చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను వైఎస్సార్ సీఎం అయ్యాక కొనసాగించారు. ఆయన హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ఎంతో చేశారు. అలాగే ఐటీ పరిశ్రమల విషయంలో కూడా చేశారు.

అందుకే శభాష్ అని నేను అంటున్నారు అని బాబు చెప్పుకొచ్చారు. నిజానికి వైఎస్సార్ ని చంద్రబాబు పొగడడం ఇది తొలిసారి కాదు, ఆయన బాలయ్య బాబు ఓటీటీలో నిర్వహించే రియాల్టీ షోలో కూడా మాట్లాడుతూ తనకు అత్యంత ఆప్తమిత్రుడు వైఎస్సార్ అని చెప్పుకున్నారు. దాని కంటే ముందు ఏకంగా జగన్ సమక్షంలోనే నిండు అసెంబ్లీలోనే వైఎస్సార్ నేను అప్పట్లో ఒకే మంచం, ఒకే కంచం అన్నట్లుగా ఉండేవారమని చెప్పారు.

వైఎస్సార్ మంచి నాయకుడు అని సమయం సందర్భం దొరికినపుడల్లా బాబు కితాబు ఇస్తున్నారు. అందుకే తాను కడప జిల్లాకు వైఎస్సార్ పేరుని మార్చలేదని ఆయన అనడమూ విశేషం. మొత్తానికి వైఎస్సార్ పేరు ఎక్కువగా చంద్రబాబు తలుస్తున్నారు. ఇందులో రాజకీయం కూడా ఉంది. జగన్ వేరు, వైఎస్సార్ వేరు అన్నది వైఎస్సార్ అభిమానులకు తెలియచేసి వారు ఓట్లను రాబట్టడం.

అదే విధంగా తండ్రి గొప్ప నాయకుడు, ప్రజాస్వామ్యవాది, జగన్ అలా కాదు సుమా అని వారుకి గుర్తు చేయడం కూడా బాబు మార్క్ పాలిటిక్స్ ఏది ఎలా ఉన్నా బాబుకు కూడా మనసులో తెలుసు వైఎస్సార్ గొప్ప లీడర్ అని, ఇద్దరి స్నేహం కూడా అలాగే మొదట్లో సాగింది. వైఎస్సార్ బాబుల మధ్య రాజకీయ పరమైన విభేదాలు ఉన్నా ఏనాడూ ఇద్దరూ దారుణంగా తూలనాడుకోలేదు. హద్దులు మీర్లేదు. సో బాబు శభాష్ వైఎస్సార్ అన్నది రాజకీయం అని ఎంతలా అనుకున్నా కూడా గుండె లోతుల నుంచి వచ్చిన మాటగా కూదా చెప్పుకోవాలని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.