Begin typing your search above and press return to search.

ఎన్నికల ఫలితాల నుంచి బాబు ఇంకా తేరుకోలేదు

By:  Tupaki Desk   |   7 Aug 2019 6:22 PM IST
ఎన్నికల ఫలితాల నుంచి బాబు ఇంకా తేరుకోలేదు
X
మూడు నెలలు గడిచినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల ఫలితాలను జీర్ణించుకున్నట్లు కనిపించడం లేదు. ఆయన రెండు ఘాటు విమర్శలు చేశారు.

ఏపీ ప్రజలు ఆవు ఇచ్చే పాలును కాదని, దున్నపోతును తెచ్చుకున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేను పట్టుదలతో తెచ్చిన పట్టిసీమ నీటిని తాగారు గాని నాకు ఓటు వేయడం మాత్రం మరిచిపోయారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తన నివాసం వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు కలిశారు, వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అమరావతిని ఒక ఉపాధి అవకాశాల కేంద్రంగా, హైదరాబాదుకు దీటుగా సృష్టిద్దామని తలపెట్టానని... కానీ నాపై కోపంతో ఈ ప్రభుత్వం అమరావతిని వదిలేసిందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వరల్డ్ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకులు కూడా వెనక్కిపోయాయని అన్నారు. తక్కువ వడ్డీతో వచ్చే రుణం వెనక్కిపోయిందని... ఇపుడు అమరావతిని ఎలా అభివృద్ధి చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

నేను కష్టపడ్డాను. ప్రజలు నాకు ఓట్లు వేయలేదు. నేను ప్రజలను అడుగుతున్నాను. నేను ఏం తప్పు చేశానో చెప్పండి. సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఇప్పటికీ ఎన్నికల జరిగిన విధానంపై అనుమానాలు ఉన్నాయి అని చంద్రబాబు మరోసారి అన్నారు. అభివృద్ధికి దూరమై ప్రజలు బాధపడుతుంటే చూడలేకపోతున్నానని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోతున్నాయని అన్నారు.

పార్టీ నేతలను, కార్యకర్తలను వైసీపీ వాళ్లు వేధిస్తున్నారని... వీల్లకు భయపడి ఊళ్లొదిలేసి వెళ్లిపోవాలా అని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఒకవేళ రేపు మేము అధికారంలోకి వస్తే... వారు కూడా ఇలా ఊరు వదిలేసి వెళ్లిపోతారా? మాకు అధికారం ఉన్నపుడు ఇలా ప్రవర్తించలేదు. ప్రవర్తించి ఉంటే మీరు ఇక్కడ ఉండేవారా? పోలీసులు అయినా బాధ్యతగా వ్యవహరించాలి. అరాచకాలను అరికట్టాలి అని చంద్రబాబు పోలీసులను కోరారు. తప్పుడు కేసులు బనాయించి, వేధింపులకు గురిచేస్తే ఊరుకోనని... ఎక్కడయినా బెదిరింపులు వేధింపులు ఉంటే... ఆ ఊరికి వెళ్లి ఆ సమస్య తీరేదాకా అక్కడే ఉంటానని చంద్రబాబు అన్నారు.