Begin typing your search above and press return to search.

బాబు ముచ్చుమ‌ర్రిలో గొప్ప‌ల‌న్నీ నీటిపాల‌య్యాయి

By:  Tupaki Desk   |   10 Sept 2017 2:23 PM IST
బాబు ముచ్చుమ‌ర్రిలో గొప్ప‌ల‌న్నీ నీటిపాల‌య్యాయి
X
``సీమలో నీటి వనరులు పెంచేందుకు టీడీపీ ప్రభుత్వం కంటికి నిద్ర లేకుండా పని చేస్తోంది. మేం అధికారం చేపట్టిన వెంటనే రాయలసీమ అభివృద్ధిపై దృష్టి సారించి పెండింగ్‌లో వున్న ముచ్చుమర్రి ఎత్తిపోతలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశాం. సీమకు ఈ ప్రాజెక్టు ప్రాణనాడి లాంటిది. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 834 అడుగులకు పడిపోతే హంద్రీనీవా - కేసీ కాలువ - పోతిరెడ్డిపాడుకు కృష్ణా జలాలు అందే పరిస్థితి లేకపోవడంతో చివరి దశలో పంటలకు నీరు అందకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయేవారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించుకునేందుకే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశాం``-- నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామ సమీపంలో ఉన్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీనీవా మొదటి ఎత్తిపోతల పథకానికి కృష్ణా జలాలను విడుదల చేసిన సంద‌ర్భంగా సీఎం చంద్రబాబు చెప్పిన మాట‌లు.

అయితే బాబు చెప్పిన ఈ మాట‌ల‌న్నీ నీటి మూట‌ల‌ని తేలిపోయింది. హంద్రీనీవా స్టేజ్-1 ప్రధాన ఎత్తిపోతల పధకానికి సంబంధించి మల్యాల దగ్గర తాత్కాలికంగా నిర్మించిన రెగ్యులేటర్ కూలిపోవడంతో ముచ్చుమర్రి నుంచి కృషా జలాలు ఎత్తిపోతను నిలిపివేశారు. సీఏం చంద్రబాబు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీ నీవా కాల్వకు మూడు పంపులు ఆన్ చేసి శుక్రవారం నీటిని విడుదల చేసిన మరుసటి రోజే మాల్యాల దగ్గర రెగ్యూలేటర్ కూలిపోవ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం. దీంతో నీటిని ఎత్తిపోసే పంపులను నిలిపివేశారు. సీఎం గొప్ప‌గా చేసిన కార్య‌క్ర‌మం - భారీగా చెప్పిన మాట‌ల త‌ర్వాతి రోజే ఇలాంటి ప‌రిస్థితి ఎదుర‌వ‌డంతో అప్ప‌టివ‌ర‌కు ముచ్చుమ‌ర్రి జోష్‌ లో ఉన్న తెలుగుదేశం పార్టీ నేత‌ల్లో ఆ ఆనందం ఆవిర‌యింద‌ని అంటున్నారు. ఈ వార్త జిల్లా స‌హా పొరుగు ప్రాంతాల్లో వైర‌ల్ అవ‌డంతో ఏం చెప్పాలో అర్థంకాని స్థితి చేరుకున్నార‌ని అంటున్నారు. ఇంకొంద‌రైతే గ‌తంలో ప‌ట్టిసీమ ఉదంతాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. ప‌ట్టిసీమ విష‌యంలో భారీ ఎత్తున‌ ప్ర‌క‌ట‌న‌లు చేసి ప్రారంభించగానే మోటర్లు ప‌నిచేయ‌డం ఆగిపోయాయ‌ని గుర్తుచేస్తూ ఎద్దేవా చేస్తున్నారు.