Begin typing your search above and press return to search.

తాడిపత్రి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు లోకేష్

By:  Tupaki Desk   |   24 Dec 2020 1:49 PM GMT
తాడిపత్రి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు లోకేష్
X
అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిప్పులు చెరిగారు. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేయడాన్ని వీరిద్దరూ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సీఎం జగన్, వైసీపీ సర్కార్ కు వార్నింగ్ లు ఇచ్చారు.

ఏపీలో టీడీపీ నేతలు, దళితులు, బీసీలను లక్ష్యంగా చేసుకొని వైసీపీ నేతలు దాడులు, హత్యలు చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. అనంతపురంలో దళిత యువతి స్నేహలత హత్యకూ, ఇవాళ మాజీ ఎమ్మెల్యే జేసీ ఇంటిపై జరిగిన దాడికీ లింకు ఉందనేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా అమలవుతోందా అని చంద్రబాబు ప్రశ్నించారు. స్నేహలత కుటుంబానికి చంద్రబాబు రూ.2 లక్షల రూపాయల సాయం ప్రకటించారు.

స్నేహలత హత్యకూ.. ఇవాళ జేసీ ఇంటిపై దాడికి సంబంధం ఉందని చంద్రబాబు ఆరోపించారు. స్నేహలత హత్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జేసీ ఇంటిపై దాడికి దిగారని చంద్రబాబు ఆరోపించారు.దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఇక నారా లోకేష్ సైతం వైసీపీ ఎమ్మెల్యేలు వీధి రౌడీలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ రౌడీలకు ఖచ్చితంగా తామే బుద్ది చెబుతామని స్పష్టం చేశారు. టీడీపీ నాయకుల ఇళ్లపై దాడి చేసి కార్యకర్తలను కొట్టి హీరోలమంటూ వైసీపీ నేతలు విర్రవీగుతున్నారని.. జగన్ గ్యాంగుల తల పొగరు అణిచివేస్తామని లోకేష్ ఘాటు హెచ్చరికలు పంపారు. టీడీపీ అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని జగన్ ను హెచ్చరించారు.