Begin typing your search above and press return to search.

కలాం చెప్పినట్లే చేస్తున్న చంద్రబాబు

By:  Tupaki Desk   |   23 Sep 2021 6:31 AM GMT
కలాం చెప్పినట్లే చేస్తున్న చంద్రబాబు
X
‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోవటానికి ప్రయత్నించండి’ ఇది రాష్ట్రపతిగా పనిచేసిన ఏపీజే అబ్దుల్ కలాం యువత, విద్యార్ధులకు చెప్పిన మాటలు. సాకారం మాటలెగున్నా కలలు మాత్రం బాగానే కంటున్నట్లు చంద్రబాబునాయుడు. ఇంతకీ చంద్రబాబు కంటున్న కలలు ఏమిటయ్యా అంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది నూటికి నూరుశాతం తెలుగుదేశంపార్టీయేనట. అలాగే రాష్ట్రం బాగుపడాలంటే
టీడీపీ అధికారంలోకి రావాల్సిందే అని ప్రజలంతా కోరుకుంటున్నారట.

ఇక్కడ రెండు అంశాలున్నాయి. మొదటిదేమో అధికారంలోకి రావటానికి టీడీపీకి నూటికి నూరుశాతం ఉన్న అవకాశాలు ఏమిటో చెప్పలేదు. అలాగే టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న జనాలెవరో చెప్పలేదు. తెలుగు రైతుసంఘాల నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతు జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా నానా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. జగన్ పాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నది మాత్రం చెప్పలేదు.

ఎవరు సీఎంగా ఉన్నా అత్యాచారాలు, హత్యాచారాలు, దోపిడీలు, దాడులు జరుగుతునే ఉంటాయన్నది వాస్తవం. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు కూడా ఇవన్నీ యధేచ్చగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇక రైతుల గురించి మాట్లాడుతు రైంతాగాన్ని జగన్ మోసం చేస్తున్నట్లు విమర్శించారు. చంద్రబాబు హయాంలో కన్నా జగన్ హయాంలోనే రైతాంగానికి మేలు జరుగుతోందని మంత్రులు చెబుతున్నారు. ఎవరి హయాంలో తమకు మేలు జరిగిందో చెప్పాల్సింది రైతులే.

తాజాగా గుజరాత్ లో పట్టుబడిన రు. 21 వేల హెరాయిన్ అంతా ఏపిలో బిజినెస్ చేయటానికి వచ్చినట్లు చంద్రబాబు బురదచల్లేయటమే విచిత్రంగా ఉంది. గుజరాత్ లో పట్టుబడిన హెరాయిన్ కు జగన్ కు ముడిపెట్టేస్తున్న చంద్రబాబు మరి అదే రాష్ట్రానికి చెందిన ప్రధానమంత్రి నరేంద్రమోడి గురించి మాత్రం నోరెత్తలేకపోతున్నారు. హెరాయిన్ కు జగన్ కు ముడేసినట్లే మోడికి హెరాయిన్ వ్యాపారానికి ఎందుకు లింకు పెట్టి మాట్లాడటంలేదు. డ్రగ్స్ వ్యాపారానికి రాష్ట్రంలో గేట్లెత్తి సంఘ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాద సంస్ధలను జగన్ ప్రోత్సహిస్తున్నారట. జగన్ అంటే చంద్రబాబులో పెరిగిపోతున్న కసికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం.

చివరగా ప్రశాంత్ కిషోర్ ను తెచ్చి రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు మండిపడ్డారు. ఇదే ప్రశాంత్ బృందంలో పనిచేసిన రాబిన్ శర్మతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. అంటే చంద్రబాబు కూడా జనాలను మోసం చేయటానికి శర్మతో ఒప్పందం చేసుకున్నట్లేనా ? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రశాంత్ అయినా రాబిన్ అయినా ఎవరినీ అధికారంలోకి తేలేరు. వీళ్ళు ఎవరి కోసమైతే పనిచేస్తున్నారో వాళ్ళకి నిజంగా దమ్ముంటేనే వీళ్ళ వ్యూహాలు ఫలిస్తాయంతే. 2019లో ప్రశాంత్ వల్లే జగన్ అధికారంలోకి రాలేదని అందరికీ తెలుసు. వైసీపీ సాధించిన అఖండ విజయంలో ప్రధాన కారణం అప్పటికే చంద్రబాబుపై జనాల్లో పేరుకుపోయిన విపరీతమైన వ్యతిరేకత.

అదికారంలోకి రావాలని చంద్రబాబు అనుకోవటంలో తప్పులేదు. కానీ అధికారంలోకి వచ్చేస్తున్నట్లు కలలు కనటంతో సరిపోదు. టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పుకుని చంద్రబాబు తననను తాను మోసం చేసుకుంటున్నారు. తాజాగా వెల్లడైన పరిషత్ ఫలితాలు చూస్తే చంద్రబాబు చెప్పింది ఎంత నిజమో అర్ధమైపోతోంది. ప్రజల్లో మద్దతు కూడగట్టుకోవటం మానేసి జగన్ మీద బురదచల్లేస్తే తాము అధికారంలోకి వచ్చేస్తామని చంద్రబాబు కలలు కంటుండటమే ఆశ్చర్యంగా ఉంది.