Begin typing your search above and press return to search.

శ్రీ‌కాకుళంపై చంద్రబాబు ఫోకస్

By:  Tupaki Desk   |   8 Jun 2022 8:30 AM GMT
శ్రీ‌కాకుళంపై చంద్రబాబు ఫోకస్
X
ఇటీవ‌ల ఓ సోష‌ల్ మీడియా పోస్టు విష‌య‌మై సీఐడీ నోటీసులు అందుకుని, త‌రువాత నిన్న‌టి వేళ గంట‌ల త‌ర‌బ‌డి విచార‌ణ ఎదుర్కొన్న ప‌లాస నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇంఛార్జ్ గౌతు శిరీషకు అధినేత చంద్ర‌బాబు అండ‌గా నిలిచారు. అక్ర‌మ కేసుల‌కు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌ర‌మేమీ లేద‌ని, పార్టీ అండ‌గా ఉంటుంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఇదే సంద‌ర్భంగా ప‌లాస, ఇచ్ఛాపురం నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌తినిధుల‌తో టీడీపీ బాస్ చంద్ర‌బాబు భేటీ అయి వివిధ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై, స్థానికంగా ఉన్న నాయ‌కుల‌పై అధికార పార్టీ చేస్తున్న వేధింపులపైనా ఆయ‌న ఆరా తీశారు.

ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌పై పోరాటం చేయాల‌ని అధినేత బాబు చెప్పారు. మ‌హిళ అయినా ధైర్యంగా పార్టీ త‌ర‌ఫున పోరాటం చేస్తున్న శిరీష‌ను అభినందించారు. మ‌రోవైపు లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జుల‌తోనూ చంద్ర‌బాబు భేటీ అయ్యారు. శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, అన‌కాప‌ల్లి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ ల‌తో కూడా భేటీ అయ్యారు. అదేవిధంగా పార్టీ జోన్ 1 ఇంఛార్జి బుద్ధా వెంక‌న్న‌తోనూ బాబు స‌మావేశం అయ్యారు. పార్టీలో గ్రూపుల‌కు ఆస్కార‌మే ఉండ‌కూడ‌ద‌ని స్ప‌ష్ట‌మ‌యిన ఆదేశాలు ఇచ్చారు.

ఇక ప‌లాస నియోజ‌క‌వ‌ర్గ వివాదం విష‌య‌మై ఎప్ప‌టి నుంచో టీడీపీకి, వైసీపీకి మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోంది. వాస్త‌వానికి మంత్రి సీదిరి అప్ప‌ల్రాజు వ్యాఖ్య‌ల కార‌ణంగా టీడీపీ ప‌లు సార్లు రోడ్డెక్కి నిరన‌స‌లు తెలిపిన దాఖ‌లాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్క‌డ అభివృద్ధి ప‌నులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయ‌న్న వాద‌న‌లూ ఉన్నాయి. కొన్నింటి వ‌ర‌కూ మంత్రి అనుచ‌రులే అంతా అయి న‌డిపిస్తున్నార‌న్న అభియోగాలూ ఉన్నాయి.

వీట‌న్నింటిపై టీడీపీ ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌శ్నిస్తూనే ఉంది. ముఖ్యంగా ప‌లాస కేంద్రంగా రియ‌ల్ ఎస్టేట్ వ్య‌వ‌హారాలు కూడా వివాదాలు సృష్టిస్తున్నాయి. వీటిని నిలువ‌రించాల్సిన అధికారులు పెద్ద‌గా చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. వీటిని కూడా టీడీపీ ప్ర‌శ్నించింది. ఎంపీ కి ప‌ట్టున్న ప్రాంతం కావ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గౌతు శిరీష గెలుపున‌కు సంబంధించి ఇప్ప‌టి నుంచే కార్యాచ‌ర‌ణ ఆరంభం అయింది.

ఈ నేప‌థ్యంలో ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడినీ ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు సీదిరి. త‌రువాత ఎంపీ విష‌య‌మై కాస్త వెనుకంజ వేసినా, శిరీష కుటుంబంపై మాత్రం ఆయ‌న అదే విధంగా కోపం ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నారు. ఇవే త‌రుచూ వాగ్వాదాల‌కు కార‌ణం అవుతున్నాయి. ఇక్క‌డి రైల్వే స్టేష‌న్ అభివృద్ధి కానీ, సంబంధిత ప‌నుల విష‌య‌మై కానీ ఎంపీ చొర‌వ చూపిస్తుండ‌డంతో అవ‌న్నీ టీడీపీకి బాగానే క‌లిసి వ‌స్తున్నాయి.

ఓ విధంగా అప్ప‌టి క‌న్నా ఇప్పుడు టీడీపీ బ‌ల‌ప‌డింది. నియోజ‌క‌వ‌ర్గంలో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మంలో కూడా ఎంపీతోస‌హా ప‌లువురు కీల‌క నాయ‌కులు శిరీష‌తో క‌లిసి న‌డిచారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను వివ‌రించారు. ఇవ‌న్నీ సీదిరికి కాస్త కంట‌గింపుగానే ఉన్నాయి.అందుకే రానున్న రోజుల్లో యుద్ధం మ‌రింత తీవ్ర‌త‌రం కానుంది. పోలీసులు కూడా టీడీపీ సోష‌ల్ మీడియా విభాగంపై పూర్తిగా నిఘా ఉంచారు. అందుకే నిన్న‌టి వేళ అధినేత చంద్ర‌బాబు సైతం స‌మ‌స్య‌ల‌పై రాజీలేని పోరాటం చేయాల‌ని ప‌దే ప‌దే నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు.