Begin typing your search above and press return to search.

శాంతి భ‌ద్ర‌తలు కుప్పకూలాయి... డీజీపీకి చంద్ర‌బాబు లేఖ‌

By:  Tupaki Desk   |   24 Dec 2021 9:00 PM IST
శాంతి భ‌ద్ర‌తలు కుప్పకూలాయి... డీజీపీకి చంద్ర‌బాబు లేఖ‌
X
ఏపీ లో శాంతి భ‌ద్ర‌తలు మృగ్య‌మ‌య్యాయ‌ని.. వైసీపీ నేత‌ల‌తో పోలీసులు కుమ్మ‌క్క‌య్యార‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆరోపించారు. కుప్పం ఐ-టీడీపీ సభ్యులు మురళి పై వైసీపీ గుండాల దాడిని ఖండిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఆయ‌న‌ లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలి పోతున్నాయన్నారు. ప్రతిపక్ష టిడిపి నాయకులు, సానుభూతిపరులపై పదేపదే హింసాత్మక దాడులు జరుగుతున్నప్పటికీ దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

వైసీపీ నేతలు, గూండాలు ఓ వర్గం పోలీసులతో కుమ్మక్కై ప్రతిపక్ష టీడీపీ నేతల ప్రజాస్వామిక గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. కుప్పం ఐ-టీడీపీ సభ్యులు సి. మురళిని 20 డిసెంబర్ 2021 మధ్యాహ్నం అధికార పార్టీ గూండాలు కుప్పం పట్టణంలో కిడ్నాప్ చేసారని, మురళిని నేరుగా రెస్కో చైర్‌పర్సన్ జిఎస్ సెంధిల్ కుమార్ ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిసింద‌న్నారు. సెంధిల్ కుమార్, అతని అనుచరులు మురళిపై దాడి చేసి కొట్టి చంపేస్తామని బెదిరించారని పేర్కొన్నారు.

ఆ తర్వాత సెంధిల్ కుమార్ అనుచరులలో ఒకరు... హెచ్‌ఎం మురుగేష్ కు గురించిన వాంగ్మూలాన్ని బలవంతంగా మురళి చేత చెప్పించి వీడియో రికార్డ్ చేశారని, వైసీపీ గుండాల దాడిలో మురళి కుడి కన్ను , ముఖం పై తీవ్ర గాయాలయ్యాయని చంద్ర‌బాబు డీజీపీకి వివ‌రించారు. తర్వాత 20 డిసెంబర్ 2021 సాయంత్రం 6.30 గంటల సమయంలో సెంధిల్ కుమార్ ఇంటి నుంచి రెండు కార్లు, రెండు బైక్‌లలో అతన్ని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి కొట్టారని పేర్కొన్నారు.

తనను కిడ్నాప్ చేసి దాడి చేసినట్లు బయటపెడితే తీవ్ర పరిణామాలుంటాయని మురళిని బెదిరించారని తెలిపారు. దీనితో, మురళి భయపడి 23 డిసెంబర్ 2021 వరకు ఈ ఘోరమైన సంఘటన గురించి బయటకు చెప్పలేదన్నారు. భవిష్యత్తులో మురళిపై ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు.

కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి ప్రతిపక్ష పార్టీల స్వేచ్చ కాపాడే దృష్ట్యా పోలీసులు విచారణ జరిపి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం సముచితమ‌నిపేర్కొన్నారు. అదే సమయంలో, మురళికి తగిన రక్షణ కల్పించాలన్నారు. పోలీసుల సత్వర చర్యలు మాత్రమే రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించబడుతాయ‌న్న చంద్ర‌బాబు.. రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించ‌కుండా చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.