Begin typing your search above and press return to search.

సీఎం జగన్ వ‌ల్లే హత్యా రాజకీయాలు: చంద్రబాబు ఫైర్‌

By:  Tupaki Desk   |   19 July 2022 8:30 AM GMT
సీఎం జగన్ వ‌ల్లే హత్యా రాజకీయాలు: చంద్రబాబు ఫైర్‌
X
ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ఒక ఉన్మాది అని.. ఆయ‌న ప్రోత్సాహం వ‌ల్లే.. రాష్ట్రంలో హ‌త్యారాజ‌కీయాలు తెర‌మీదికి వ‌స్తున్నాయ‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డి పై అలవల గ్రామంలో వైసీపీ రౌడీలు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. మంగ‌ళ‌వారం ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడిచేశారంటే ఏపీలో శాంతిభద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయని నిల‌దీశారు.

రాష్ట్రంలో పోలీసులు నిద్రపోతున్నారా? అని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేత ల హత్యలకు జగన్ రెడ్డి ప్రోత్సాహం ఉంది కాబట్టే వైసీపీ రౌడీలు ఇలా రెచ్చిపోతున్నారని వ్యాఖ్యానించారు.

పోలీసులను ఈ విషయంలో కల్పించుకోవద్దని జగన్ రెడ్డి ఆదేశాలిచ్చారా? లేకపోతే ఇలాంటివి జరుగుతుంటే వారెందుకు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారని విస్మ‌యం వ్య‌క్తం చేశారు.

తెలుగుదేశం వైవు నుంచి కూడా ప్రతీకార చర్యలు ఉంటే వాటికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? జగన్ తీసుకుంటారా? లేక పోలీసులా? అని చంద్ర‌బాబు గ‌ద్దించారు. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చావుబతుకు ల మధ్య ఉన్న బాలాకోటిరెడ్డికి ఏం జరిగినా దానికి జగన్ రెడ్డే సమాధానం చెప్పాలని అన్నారు.

అస‌లు ఏం జ‌రిగింది?

పల్నాడు జిల్లాలో మరో టీడీపీ నాయకుడిపై హత్యాయత్నం జరిగింది. రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడి చేశారు. అలవలలో వాకింగ్‌కు వెళ్తున్న బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థుల దాడికి పాల్పడగా.. తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

బాలకోటిరెడ్డిపై దాడిని టీడీపీ నేతలు ఖండించారు. హ‌త్యలు, దాడుల‌తో కేడ‌ర్‌ని భ‌య‌పెట్టాల‌నుకుం టున్న జ‌గ‌న్ రెడ్డికి శిశుపాలుడిలా పాపాలు పండిపోయాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ప్రజావ్యతిరేక‌త తీవ్రం కావ‌డంతో, రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం చేయిస్తోన్న హ‌త్యలు, దాడులే వైసీపీ ప‌త‌నానికి దారులని మండిపడ్డారు. బాల‌కోటిరెడ్డికి ఏమైనా జ‌రిగితే జ‌గ‌న్‌ స‌ర్కారుదే బాధ్యత అని అన్నారు.