Begin typing your search above and press return to search.

ఒట్టు అవన్నీ మీకే : బీజేపీకి బాబు బంపర్ ఆఫర్...?

By:  Tupaki Desk   |   9 Jun 2022 2:30 PM GMT
ఒట్టు అవన్నీ మీకే : బీజేపీకి బాబు బంపర్ ఆఫర్...?
X
బీజేపీ జాతీయ నాయకత్వం ఏపీలో రాజకీయాల మీద ఏ రకమైన విధానం అనుసరిస్తుందో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అయితే ఒక సందేశం ఇచ్చి పోయారు. ఆయన ఒక వైపే చూసి వెళ్లారు. వైసీపీకి ఫుల్ క్లాస్ తీసుకుని అనాల్సిన నాలుగు కరువు తీరా అనేసి మరీ వెళ్లారు.

దాంతో వైసీపీ గుస్సా అవుతూంటే టీడీపీ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతోంది. ఏపీలో మాదే అధికారం, మేమే రేపటి రాజ్యం చేస్తామని చెప్పుకున్న నడ్డా అధికార పార్టీ మీద ఘాటు విమర్శలు చేయడాన్ని ఎవరూ తప్పుపట్టారు. అది సహజం, చేయాలి కూడా. కానీ అంతే బలంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం నిన్నటి దాకా అధికారంలో ఉన్న టీడీపీ మీద కూడా కొన్ని కామెంట్స్ చేయాలి కదా.

కానీ నడ్డా టీడీపీ ఊసే అసలు మాట్లాడలేదు. పల్లెత్తు మాట పాత ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అనలేదు. ఇదే ఇపుడు టీడీపీలో కొత్త ఆశలను రేకెత్తిస్తోందిట. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీతో పొత్తు కుదురుతుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని కొందరు తమ్ముళ్ళు అయితే దీని మీద భాష్యం చెబుతున్నారుట.

ఇక జగన్ విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఎందుకు మొగ్గు చూపుతోంది, బాబు విషయంలో ఎందుకు డౌట్ పడుతోంది అంటే దానికి కారణం చంద్రబాబు కనుక ఏపీలో గెలిస్తే ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పుతారు అన్న భయం. ఆయన జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకుని మోడీ బీజేపీ అవకాశాలకు అడ్డం కొడతారు అన్న బెంగ వారిలో ఉంది.

ఆ విషయం గ్రహించిన రాజకీయ గండరగండడు చంద్రబాబు బీజేపీకి అభయహస్తం ఇస్తున్నారుట. తన వల్ల అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదని కూడా చెప్పబోతున్నారుట. తాను కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అవుతాను తప్ప తనకు జాతీయ రాజకీయాల మీద ఆసక్తి లేనే లేదని క్లారిటీ ఇస్తున్నారుట.

ఇక కేంద్రంలో బీజేపీకి అధికారంలోకి వచ్చేందుకు సరిపడా ఎంపీలను ఏపీలో సమకూర్చే పనిని చేపడతాను అని ఆయన అంటున్నారుట. ఏపీలో మొత్తం పాతిక ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో 13 ఎంపీ సీట్లను బీజేపీ వారికే ఇవ్వడానికి బాబు సుముఖత వ్యక్తం చేశారని టాక్ నడుస్తోంది.

ఆ విధంగా బీజేపీకి బాబు బంపర్ ఆఫరే ప్రకటించారు అంటున్నారు. అంటే ఎమ్మెల్యేలు మాకు ఎంపీలలో మెజారిటీ మీకు అన్న కొత్త ఒప్పందాన్ని బాబు తెరమీదకు తెస్తున్నారు అంటున్నారు. రేపటి రోజున టీడీపీ తరఫున గెలిచిన ఎంపీలు కూడా బీజేపీకే మద్దతు ఇస్తారు కాబట్టి ఏపీ నుంచి మంచి బలం బీజేపీకి 2024 ఎన్నికల తరువాత దక్కబోతోంది అని బాబు చెబుతున్నారని తెలుస్తోంది.

మరి ఇంతలా బాబు బీజేపీకి చక్కని ఆఫర్ ఇస్తూంటే వారు ఏం చేస్తారు అన్నదే చర్చ. జగన్ విషయంలో కేంద్ర బీజేపీ మొగ్గు చూపడానికి ఎంపీల బలమే కారణం. మరి చంద్రబాబే తానుగా తగ్గి ఎంపీలను కావాల్సినంతమందిని సమకూరుస్తామని చెబితే కమలానికి అభ్యంతరం ఏముంటుంది. ఇదిపుడు బీజేపీలో ఒక వర్గం హై కమాండ్ దృష్టిలో పెట్టడానికి చూస్తోంది అంటున్నారు.

అయితే కేంద్ర నాయకత్వం చంద్రబాబుని ఎంతవరకూ నమ్ముతుంది అన్నదే ఇక్కడ ప్రశ్న. బాబు ఇపుడు ఇలా అన్నా రేపటి రోజున ఏపీలో గెలిచాక కచ్చితంగా ఆయన జాతీయ రాజకీయాల వైపు చూస్తారు అన్నదే బీజేపీ కేంద్ర పెద్దల డౌటానుమానంగా ఉందిట.

అంతే కాదు ఏపీలో బాబుని గెలిపించి ఆయన తరువాత తరాన్ని కూడా బలోపేతం చేస్తే ఏపీ మీద ఎప్పటికీ బీజేపీకి ఆశలు ఉండవని కూడా ఆలోచిస్తున్నారుట. బీజేపీ అసలైన ఫిలాసఫీ ప్రాంతీయ పార్టీలను భారత లేకుండా చేసి అంతటా తమ ఆధిపత్యం చాటుకోవాలని, అందుకోసం ముందు సీనియర్ ప్రాంతీయ పార్టీలకు చెక్ చెప్పే పనిలో బీజేపీ ఉంది.

ఆనక ఆ కధ వైసీపీ వైపు కూడా వస్తుంది. అందువల్ల ప్రస్తుతానికి జగన్ సేఫ్ జోన్ లో ఉన్నారు. బాబు డేంజర్ లో ఉన్నారు. బీజేపీ కి ఇలాంటి బంపర్ ఆఫర్లు ఎన్ని ఇచ్చినా ప్రాంతీయ పార్టీగా టీడీపీ ఎలిమినేషనే ముఖ్యమైనపుడు ఏవీ పనిచేయవు అన్న మాట కూడా ఢిల్లీ స్థాయిలో వినిపిస్తోంది.