Begin typing your search above and press return to search.

అక్కడ మళ్ళీ మోగుతున్న బాబు బ్రాండ్ ఇమేజ్!

By:  Tupaki Desk   |   17 Dec 2022 9:00 AM IST
అక్కడ మళ్ళీ మోగుతున్న బాబు బ్రాండ్ ఇమేజ్!
X
చంద్రబాబుకు మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తున్నాయి. ఆయన ఇమేజ్ కి మళ్ళీ కొత్త నగిషీలు చెక్కుతున్న కాలం వచ్చేసింది. చంద్రబాబు ముమ్మారు సీఎం గా చేశారు. అయితే ఉమ్మడి ఏపీలో ఆయన తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన రోజులనే అంతా గుర్తుంచుకుంటారు. దానికి కారణం ఆయన ఆనాడు అభివృద్ధిని నమూనాగా మారారు. హైదరాబాద్ ని కొత్త పధం వైపు నడిపించారు. కొత్త ఆలోచనలతో నవ్య నగరంగా భాగ్యనగరాన్ని తీర్చిదిద్దారు. హైదరాబాద్ కి ధీటుగా సైబరాబాద్ ని డిజైన్ చేసి ఇదీ నా బ్రాండ్ అని లోకానికి గొప్పగా చాటారు. అదే విధంగా విజన్ 2020 అంటూ అక్కడే అనేక ప్రాజెక్టులు తలపెట్టారు.

అలాగే ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కూల్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో విద్యను పరిచయం చేశారు. ఈ రోజుకి సరిగ్గా ఆ స్కూల్ ఏర్పాటై ఇరవై ఏళ్ళు. దాంతో వార్షికోత్సవాలకు ముఖ్య అథిదిగా బాబుని వారు ఆహ్వానించారు. అక్కడకు చేరుకున్న బాబుకు ఆనందం పట్టరానిదైంది. తాను ఒకనాడు కన్న కలలు ఈ రోజు వృక్షంగా మారి ఫలాలు ఇస్తున్నాయని ఆయన అన్నారు. తాను విజన్ 2020 అంటే అందరూ నాడు వేళాకోళం చేశారని, కానీ ఇపుడు అదే నిజమై కీర్తిపతాకాన్ని ఎగరేసింది అని అన్నారు.

ఇక నిర్వాహాకులు సైతం బాబు బ్రెయిన్ చైల్డ్ అని పేర్కొన్నారు. చంద్రబాబు సైతం ఆనాడు తాను దేశమంతా ప్రపంచమంతా తిరిగి ఎన్నో సంస్థలను హైదరాబాద్ లో ఏర్పాటు చేశాను అని చెప్పుకున్నారు. ప్రస్తుతం అవి అభివృద్ధి సాధించాయని అన్నారు. ఇదిలా ఉంటే టీయారెస్ బీయారెస్ గా ఎందుకు మారాలనుకుందో కానీ అది బాబుకు అతి పెద్ద అవకాశంగా మారింది. బాబు 2014 నుంచి 2019 వరకూ విభజన ఏపీని పాలించినా అమరావతిని ఆయన బ్రహ్మాండమైన రాజధానిగా చేయాలనుకున్నా అతి తక్కువ వ్యవధిలో సాధ్యపడలేదు. అలా బాబుకు విజయాలు అన్నీ ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ లో ఉండిపోయాయి.

ఇపుడు బాబు మళ్లీ తెలంగాణాలో రాజకీయాలు చేయడానికి అవకాశం ఏర్పడింది. తన పార్టీ పేరు నుంచే తెలంగాణాను తీసేసిన కేసీయార్ జాతీయ పార్టీ పెడుతూ ఎవరూ తెలంగాణాలో పోటీ చేయవద్దు అని అనలేరు. దాంతో బాబు ఇపుడు హైదరాబాద్ కి తాను చేసిన అభివృద్ధి అని గొప్పగా చెప్పుకునేందుకు దాన్ని ప్రచారం చేసుకునేందుకు మహత్తర అవకాశం లభించింది. రేపటి తెలంగాణా ఎన్నికలతో పాటు ఏపీ ఎన్నికల్లో కూడా బాబు బ్రాండ్ ఇమేజ్ హైటెక్ సిటీ కానీ సైబరాబాద్ కానీ మరో మారు మారుమోగడం ఖాయం. ఆ విధంగా చంద్రబాబు తాను విజన్ 2050 అని చెప్పి వచ్చే ఎన్నికల్లో ఏపీలో సైతం గెలిచేందుకు వీలు కలుగుతుంది అంటున్నారు.

మొత్తానికి చంద్రబాబు రాజకీయాల్లో కీలక మార్పునకు బీయారెస్ ఇండైరెక్ట్ గా కారణం అవుతోంది అని చెప్పాల్సిందే. టీయారెస్ బీయారెస్ గా మారడం వల్ల ఏమంత ప్రయోజనం సంకూరేది లేదు అని పెదవి విరిచే వారు ఉన్నారు. కానీ ఉమ్మడి ఏపీని ఏలి పటిష్టమైన పార్టీని అక్కడా ఇక్కడా ఉంచుకుని ఈ రోజుకీ చురుకైన రాజకీయం చేస్తున్న చంద్రబాబుకు మాత్రం ఈ పరిణామం ద్వారా ఎంతో మేలు జరగనుంది అంటున్నారు. సో చిన్న అవకాశం ఇస్తే అల్లుకుపోయే చంద్రబాబు ఇపుడు తన బ్రాండ్ ఇమేజ్ నే పెట్టుబడి పెట్టి అటు తెలంగాణాలోనూ ఇటు ఏపీలోనూ జెండా ఎగరేయడానికి సిద్ధమవుతారని తమ్ముళ్ళు ఆనందిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.