Begin typing your search above and press return to search.

బాబు రెండో క‌న్ను మ‌ళ్లీ తెరిచారా?

By:  Tupaki Desk   |   22 Sep 2021 3:30 PM GMT
బాబు రెండో క‌న్ను మ‌ళ్లీ తెరిచారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత పూర్తిగా ఏపీ రాజ‌కీయాల‌పైనే ధ్యాస పెట్టిన మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మ‌న‌సు మ‌ళ్లీ ఇప్పుడు తెలంగాణ వైపు మ‌ళ్లిందా? ఇక్క‌డ తిరిగి పుంజుకునేందుకు ఆయ‌న అడుగులు వేస్తున్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల‌ని చూస్తున్నారా? అంటే అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. తాజాగా బాబు తెలంగాణ ప్ర‌భుత్వంపై చేసిన విమ‌ర్శ‌లే అందుకు కార‌ణమ‌ని చెబుతున్నారు.

ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మంలో బాబు రెండు క‌ళ్ల సిద్ధాంతాన్ని అనుస‌రించార‌నే విమ‌ర్శ‌లున్నాయి. త‌న‌కు ఏపీ ఓ క‌న్ను అని.. తెలంగాణ మ‌రో క‌న్ను అని పేర్కొన్న ఆయ‌న ఉద్య‌మానికి ఎలాంటి మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు. త‌ట‌స్థంగా ఉన్నారు. లేఖ‌లు రాసి సరిపెట్టుకున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మయ్యాయి. ఇక 2014లో ఉమ్మ‌డి ఏపీ విడిపోయి ప్ర‌త్యేక రాష్ట్రంగా తెలంగాణ విడిపోయిన త‌ర్వాత బాబు.. ఏపీలో అధికారాన్ని ద‌క్కించుకున్నారు. ఇక్క‌డ ఉద్య‌మ పార్టీ టీఆర్ఎస్ ధాటికి టీడీపీ త‌ట్టుకోలేక‌పోయింది. తెలంగాణ‌లో ఆ పార్టీ మ‌నుగ‌డే క‌ష్ట‌మైపోయింది. దీంతో బాబు ఏపీ రాజ‌కీయాల్లోనే బిజీగా గ‌డుపుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌గ‌న్ హ‌వాను ఎదుర్కోలేక ఘోర ఓట‌మి చ‌వి చూశారు. ఇక్క‌డ తెలంగాణ‌లో 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మ‌రీ బ‌రిలో దిగిన ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది.

ఇక తెలంగాణలోని కీల‌క టీడీపీ నాయ‌కుల‌ను కేసీఆర్ లాగేసుకున్నారు. ద‌శాబ్దాలుగా టీడీపీతో కొన‌సాగిన ఎల్‌.ర‌మ‌ణ కూడా ఇటీవ‌ల కారు ఎక్క‌డంతో పార్టీ ప‌రిస్థితి మ‌రీ ద‌య‌నీయంగా మారింది. బ‌క్క‌ని న‌ర్సింలును పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా చేసిన‌ప్ప‌టికీ టీడీపీకి ఇక్క‌డ భ‌విష్య‌త్ లేద‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. కానీ కొన్నాళ్లుగా తెలంగాణ నుంచి ప‌ట్టించుకోని బాబు.. ఇప్పుడు ఆక‌స్మాత్తుగా కేసీఆర్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్యం ఖూనీ అవుతుంద‌ని త‌న లాంటి నాయ‌కుడికి అక్క‌డ స‌మావేశం పెట్టుకునే అవ‌కాశం కూడా లేకుండా పోయింద‌ని బాబు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు అత్యంత న‌మ్మ‌కంగా ఉండే ర‌మ‌ణ‌ను టీఆర్ఎస్‌లోకి తీసుకోవ‌డంతో బాబు ఈ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని తెలుస్తోంది.


కొన్నేళ్లుగా తెలంగాణ‌లో రాజ‌కీయంగా జ‌రిగిన ఏ విష‌యంపైనా నేరుగా స్పందించ‌కుండా.. ఇక్క‌డి టీడీపీ నేత‌ల‌కు వ‌దిలేసిన బాబు ఇప్పుడు ఇక్క‌డి ప్ర‌భుత్వంపై వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అనేక ర‌కాల ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. తెలంగాణ‌లో ఇప్ప‌టికీ టీడీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంద‌ని బాబు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో క‌ష్ట‌ప‌డితే మ‌ళ్లీ ఆ పార్టీ నేత‌లు కీల‌కంగా మారే అవ‌కాశాలున్నాయ‌ని బాబు అభిప్రాయ‌ప‌డుతున్నార‌ని స‌మాచారం. దీంతో ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసిన ఆయ‌న‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ కాంగ్రెస్‌తోనే పొత్తు పెట్టుకునే అవ‌కాశాలున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇక్క‌డ బీజేపీతో క‌లిసి సాగే అవ‌కాశాలు దాదాపు లేన‌ట్లే! ఇక కొత్త‌గా పీసీసీ అధ్య‌క్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి త‌న‌కు స‌న్నిహితుడే కాబ‌ట్టి బాబు ఆ దిశ‌గా నిర్ణ‌యం తీసుకునే వీలుంద‌ని తెలుస్తోంది. కానీ బాబు ఎంత‌గా ప్ర‌య‌త్నించినా తెలంగాణ‌లో జాకీ వేసిన లేపినా టీడీపీ పుంజుకునే ప‌రిస్థితి లేద‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి బాబు ఏం చేస్తారో చూడాలి.