Begin typing your search above and press return to search.

రాఫెల్ ర‌గిల్చిన చిచ్చే సీబీఐలో తాజా ర‌చ్చా?

By:  Tupaki Desk   |   25 Oct 2018 4:51 AM GMT
రాఫెల్ ర‌గిల్చిన చిచ్చే సీబీఐలో తాజా ర‌చ్చా?
X
అంద‌రికి క‌నిపించే అంశాల‌కు.. తెర వెనుక జ‌రిగే అంశాల‌కు ఎక్క‌డా పొంత‌న ఉండ‌దు. అలాంటిదే తాజాగా తెర మీద క‌నిపిస్తున్న సీబీఐ కీల‌కాధికారుల ర‌చ్చ‌. సీబీఐ లాంటి ద‌ర్యాప్తు సంస్థ‌లో ఇద్ద‌రు కీల‌క అధికారులు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌టం.. పోటాపోటీగా సోదాలు నిర్వ‌హించ‌టం లాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు ఎందుకు చోటు చేసుకున్నాయి? అస‌లీ ప‌రిణామాల వెనుక బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఇద్ద‌రు మోడీ స‌న్నిహితులు ఎందుక‌ని ఇంత ర‌చ్చ చేసుకున్నారు? మోడీ బ్యాచ్ లోని ఆ ఇద్ద‌రికి ఎందుకు ప‌డ‌లేదు? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతికితే ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు రావ‌ట‌మే కాదు.. ఈ మొత్తం ర‌చ్చ వెనుక మోడీని ముప్పుతిప్ప‌లు పెడుతున్న రాఫెల్ స్కాం కార‌ణ‌మ‌న్న కొత్త విష‌యం తెర మీద‌కు వ‌స్తుంది.

సీబీఐ అద‌న‌పు డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న రాకేశ్ అస్థానాకు సీబీఐ డైరెక్ట‌ర్ అలోక్ వ‌ర్మ‌కు మ‌ధ్య గొడ‌వ అస‌లు ఎలా షురూ అయ్యింద‌న్న విష‌యంలోకి వెళితే.. కాస్త వెన‌క్కి వెళ్లాలి. గ‌తంలో జ‌రిగిన ప‌రిణామాల్ని ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో తెలుసుకునే ఇష్యూ సింఫుల్ గా అర్థ‌మ‌వుతుంది.

ఇంత‌కీ ఈ రాకేశ్ అస్థానా ఎవ‌రు? అంటే.. మోడీకి అత్యంత ఆప్తుడు. ఆయ‌న మ‌నసు ఎరిగి ప‌ని చేసే పోలీసు అధికారి. ప‌లు అవినీతి ఆరోప‌ణ‌లున్న ఉన్న‌తాధికారి. గుజరాత్‌కు చెందిన ఈ పోలీసు అధికారి తీరు మొద‌ట్నించి వివాదాస్ప‌ద‌మే. త‌న మ‌నుషులు సీబీఐలో ఉంటే అదెప్ప‌టికైనా లాభ‌మే అన్న ముందుచూపుతో అస్థానాను సీబీఐలో నియ‌మించారు మోడీ. ఇత‌గాడికి ఆ అవ‌కాశాన్ని మోడీ ఎందుకిచ్చారంటే.. గుజ‌రాత్‌లో తాను సీఎంగా ఉన్న‌ప్పుడు.. త‌న ప్ర‌త్య‌ర్థుల ప‌ని ప‌ట్ట‌టానికి అస్థానా విశేష‌మైన సేవ చేశార‌ని చెబుతారు.

అలాంటి అస్థానా కీల‌క‌మైన సీబీఐలో ఉంటే.. తాను కోరుకున్న ప‌నులు ఇట్టే జ‌రిగిపోతాయ‌ని మోడీ భావించ‌టం త‌ప్పేం కాదు క‌దా. అందుకే ఆయ‌న్ను సీబీఐలోకి తెచ్చారు. 2016లో సీబీఐలోకి వ‌చ్చిన ఆయ‌న్ను అద‌న‌పు డైరెక్ట‌ర్ గా ఎంపిక చేసి అత్యున్న‌త ద‌ర్యాప్తు సంస్థ‌లోకి పంపారు. సీబీఐ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న అనిల్ సిన్హా రిటైర్ అయిన వెంట‌నే.. సీబీఐ బాస్ కుర్చీలో అస్థానాను నియ‌మించాల‌న్న‌ది మోడీ ఆలోచ‌న‌గా చెబుతారు.

అయితే.. మరిన నిబంధ‌న‌లతో సీబీఐ డైరెక్ట‌ర్ ప‌ద‌వి అస్థానాకు ఇవ్వ‌టం సాధ్యం కాలేదు మోడీకి.ఎందుకంటే.. లోక్ పాల్ చ‌ట్టం ప్ర‌కారం సీబీఐ డైరెక్ట‌ర్‌ను కేవ‌లం ప్ర‌ధాని మాత్ర‌మే ఓకే అనేయ‌లేరు. ప్ర‌ధానితో పాటు విప‌క్ష నేత‌.. సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ తో కూడిన బృందం ఎంపిక చేయాల్సి ఉంటుంది. అస్థానా స్పెష‌ల్ ఏమంటే.. మోడీ మ‌నిషిగా ముద్ర ప‌డ‌టంతో పాటు.. ప‌లు అవినీతి ఆరోప‌ణ‌ల్ని ఆయ‌న‌ ఎదుర్కొంటున్నారు. అలాంటి ఆయ‌న సీబీఐ డైరెక్ట‌ర్ గా అవ‌కాశం ల‌భించే ఛాన్స్ లేదు.

ఈ విష‌యాన్ని గుర్తించిన మోడీ.. త‌న‌దైన శైలిలో అస్థానాను సీబీఐ డైరెక్ట‌ర్ స్థానానికి బ‌దులుగా యాక్టింగ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించారు. ఇదే స‌మ‌యంలో కొత్త డైరెక్ట‌ర్ గా అలోక్ వ‌ర్మ‌ను త్రిస‌భ్య క‌మిటీ ఓకే చేసింది. విచిత్ర‌మైన విష‌యం ఏమంటే అలోక్ వ‌ర్మ కూడా మోడీకి ఆప్తుడే. కాకుంటే.. అంతో ఇంతో రూల్ ప్ర‌కారం పోయే పెద్ద మ‌నిషి. అడ్డ‌గోలుగా ఏం చెబితే ఆ ప‌ని చేసే తీరు ఆయ‌న‌లో త‌క్కువ‌. అంతో ఇంతో రూల్ బుక్ ప్ర‌కారం న‌డిచే వ్య‌క్తి.

ఇదే.. అలోక్‌కు.. అస్థానాకు మ‌ధ్య ప‌వ‌ర్ గేమ్ మొద‌లైంది. అర్హ‌త లేకున్నా ఇంచుమించు త‌న‌తో స‌మానంగా ఉన్న అస్థానా ప‌వ‌ర్ ను అలోక్ ఇష్ట‌ప‌డే వారు కాదు. పేరుకు ఇద్ద‌రు మోడీ మ‌నుషులైనా.. ప‌ని విష‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు అంత‌కంత‌కూ పెరిగాయి. రెండు ప‌వ‌ర్ స్టేష‌న్లు సీబీఐలోకి వ‌చ్చేశాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మోడీ టార్గెట్ చేసిన రాజ‌కీయ వ‌ర్గాల‌ను అస్థానా దూసుకుపోతూ ముప్ప‌తిప్ప‌లు పెడుతుంటే.. అలోక్ మాత్రం అలాంటి వాటిని ఏ మాత్రం ఎంక‌రేజ్ చేసేవారు కాదు. అదే స‌మ‌యంలో పెద్ద‌ల అండ‌తో చెల‌రేగిపోతున్న అస్థానాను కంట్రోల్ చేయ‌టానికి అలోక్ చాలానే ప్ర‌య‌త్నాలు చేసినా ఆయ‌న ప్ర‌య‌త్నాలు సాగ‌లేదు. వీరిద్ద‌రి వ్య‌వహారం ఒకే ఒర‌లో రెండు క‌త్తులన్న‌ట్లుగా మారింది. ఇలాంటి వేళ‌లోనే అస్థానాకు కేంద్రం ప్ర‌మోష‌న్ ఇచ్చి సీబీఐ అద‌న‌పు డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. దీంతో డైరెక్ట‌ర్ గా ఉన్న అలోక్ కు మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింది. ఎందుకంటే తాజా ప్ర‌మోష‌న్ తో వీరిద్ద‌రికి స‌మాన ప‌వ‌ర్స్ వ‌చ్చేసే ప‌రిస్థితి.

ఇలాంటి వేళ అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్న అస్థానాను సీబీఐ స్పెష‌ల్ డైరెక్ట‌ర్ హోదా ఎలా ఇస్తారంటూ ప్ర‌ముఖ న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్ రంగంలోకి దిగారు. కోర్టును ఆశ్ర‌యించారు. అయితే.. కోర్టు ప్ర‌శాంత్ భూష‌ణ్ ఆరోప‌ణ‌ల్ని కొట్టిపారేస్తూ.. నియామ‌కంలో తేడా లేద‌ని తేల్చింది. ఈ లొల్లి ఇలా సాగుతున్న వేళ‌లోనే అంత‌ర్గ‌తంగా ప‌లు అంశాలు వారిద్ద‌రి మ‌ధ్య ముఖాముఖి పోరుగా మారింది.

ఇదే స‌మ‌యంలో అలోక్ వ‌ర్మ ఫారిన్ ట్రిప్ కు వెళ్ల‌టం.. ఆ స‌మ‌యంలో యాక్టింగ్ సీబీఐ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన అస్థాన.. సీబీఐ బ‌దిలీల‌కు సంబంధించి సీవీసీ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.దీంతో అనిల్ కు ఎక్క‌డో కాలింది. తాను లేన‌ప్పుడు కీల‌క బ‌దిలీలు ఎలా చేస్తారు? అనిప్ర‌శ్నించ‌టంతో పాటు అస్థానా అవినీతిపై బుర‌ద చ‌ల్ల‌టం.. ఆయ‌న ముడుపులు తీసుకున్నారంటూ కేబినెట్ సెక్ర‌ట‌రీకి ఫిర్యాదు చేయ‌టంతో ఈ ఇష్యూ మ‌రింత ముదిరి పాకాన ప‌డిన‌ట్లైంది.

మోడీకి అత్యంత స‌న్నిహితులైన ఇద్ద‌రి మ‌ధ్య మొద‌లైన ప‌వ‌ర్ గేమ్ ఫైన‌ల్స్ కు చేరింది. అస్థానాకు ఉన్న బ‌లం ఏమంటే.. మోడీ కోరుకున్న ప‌నుల్ని ఇట్టే చేసేయ‌టం.. ఏ విప‌క్ష నేత ఇంటి మీద అయినా సోదాలు నిర్వ‌హించేందుకు వెనుకాడ‌ని త‌త్త్వం ఆయ‌నిది. కానీ.. అలోక్ మాత్రం ఈ విష‌యంలో కాస్త భిన్నం. ఎవ‌రి మీద ప‌డితే వారి మీద‌క సోదాల పేరుతో వెళ్లి దాడుల‌కు దిగ‌రు. పైనుంచి ఆదేశాలు వ‌చ్చినా వాయిదా వేస్తారే త‌ప్పించి చ‌ర్య‌లు త‌క్కువ‌. దీన్ని మోడీ స‌ర్కారు భ‌రించ‌లేక‌పోయింద‌ని చెబుతారు.

అలోక్ త‌మ ప్ర‌యోజ‌నాల్ని ముందుకు తీసుకెళ్ల‌లేక‌పోతున్నార‌న్న కినుకు ఉన్న‌ప్ప‌టికీ త‌గిన టైం కోసం ఎదురుచూస్తోంది. ఇటీవ‌ల రాఫెల్ ఇష్యూ సీబీఐ ముందుకు రావ‌టం.. అనిల్ ఆ ఆరోప‌ణ‌ల్ని తీసుకోవ‌టంతో ల‌క్ష్మ‌ణ రేఖ‌ను అలోక్ దాటిన‌ట్లైంది. ఒక్క‌సారి సీబీఐ డైరీలో రాఫెల్ ఇష్యూ కానీ న‌మోదైతే.. అదెప్ప‌టికైనా త‌మ‌కు చుట్టుకునే ప్ర‌మాదం ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించిన మోడీ అండ్ కో అలెర్ట్ అయ్యారు. అందుకే లొల్లి ప‌డుతున్న ఇద్ద‌రిని ఒకేసారి సెల‌వుపై పంపి.. కొత్త డైరెక్ట‌ర్ గా తెచ్చుకున్నారు. ఇలా మోడీకి సన్నిహితుల మ‌ధ్య మొద‌లైన విభేదాలు చివ‌రికి మోడీ స‌ర్కారును ఇబ్బందుల‌కు గురి చేసే వ‌ర‌కూ వెళ్లిందని చెప్ప‌క త‌ప్ప‌దు.