Begin typing your search above and press return to search.

బాబు స‌ర్కార్ ఖ‌ర్చుల్ని క‌డిగి పారేసిన కాగ్!

By:  Tupaki Desk   |   7 Feb 2019 5:35 AM GMT
బాబు స‌ర్కార్ ఖ‌ర్చుల్ని క‌డిగి పారేసిన కాగ్!
X
పుట్టెడు ఆర్థిక క‌ష్టాలు ఉన్న‌ప్పుడు ఏం చేస్తాం? ఆచితూచి ఖ‌ర్చు చేస్తాం. కానీ.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరు మాత్రం అందుకు భిన్నం. ఓప‌క్క పేద అరుపులు అరుస్తూనే.. మ‌రోవైపు చేతికి ఎముక లేన‌ట్లుగా ఖ‌ర్చు చేసే తత్త్వం బాబులో ఎక్కువ‌. ప్ర‌చార క‌క్కుర్తితో బాబు చేసే ఖ‌ర్చుల లెక్క‌ను చెబుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి తీరును క‌డిగి పారేసింది కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ సంస్థ‌.

ఏపీ స‌ర్కారు ప్ర‌చార తీరు ఏ మాత్రం బాగోలేద‌ని చెప్ప‌టంతో పాటు.. అధికార పార్టీకి అనుకూలంగా అంత భారీగా ప్ర‌జాధ‌నాన్ని ఎలా ఖ‌ర్చు చేస్తార‌న్న ప్ర‌శ్న‌ను సంధించింది. 2015లో సుప్రీం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఉల్లంఘిస్తూ చేస్తున్న ఖ‌ర్చు లెక్క‌ను బ‌య‌ట‌పెట్టింది. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్ ను పెంచుకోవ‌టం కోసం కేంద్రాన్ని త‌ప్పు ప‌డుతూ రూ.13.76 కోట్ల‌తో చేప‌ట్టిన ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లపైన అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించే స‌మాచారాన్ని ప్ర‌చారం కోసం వినియోగించాలి. అధికార పార్టీ ఇమేజ్ పెంచేలా.. వ్య‌క్తులకు రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం క‌లిగించే ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌ల్ని జారీ చేయ‌కూడ‌దు. న్యాయ‌ప‌రంగా.. ఆర్థిక నియంత్ర‌ణ ప్ర‌క‌ట‌న‌ల్లో ఉండాలన్న సుప్రీం మాట‌ను ఏపీ స‌ర్కార్ ప‌ట్టించుకోలేద‌ని త‌ప్పు ప‌ట్టింది.

సుప్రీం తీర్పుకు భిన్నంగా ఏపీ అధికార పార్టీకి అనుకూలంగా నిర్వ‌హించే ప్ర‌చారానికి ప్ర‌జాధ‌నాన్ని ఎలా ఖ‌ర్చు చేస్తారంటూ ఏపీ స‌మాచార శాఖ క‌మిష‌న‌ర్ ను కాగ్ లిఖిత పూర్వ‌క స‌మాధానాన్ని కోరింది. దీనిపై స్పందించిన క‌మిష‌న‌ర్ ఆఖ‌రి క్ష‌ణంలో ముఖ్య‌మంత్రితో పాటు.. ఆయ‌న కార్యాల‌యం నోటి మాట‌గా ఆదేశాల్ని జారీ చేయటంతో.. వాటిని అమ‌లు చేయ‌టం త‌మ బాధ్య‌త‌గా భావించిన‌ట్లుగా పేర్కంది.

గ‌త ఏడాది చంద్ర‌బాబు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా నిరాహార దీక్ష పేరుతో భారీ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయ‌టం తెలిసింది. ఇందుకోసం రూ.1.91 కోట్ల‌తో ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు జారీ చేసిన‌ట్లుగా కాగ్ గుర్తించింది. ఈ దీక్ష మొత్తం బాబు త‌న ఇమేజ్ ను పెంచుకోవ‌టానికే వాడుకున్న‌ట్లు వెల్ల‌డించింది.

గ‌త ఏడాది జూన్ 30న అంబేడ్క‌ర్ ఆశ‌యం.. చంద్ర‌న్న ఆచ‌ర‌ణ పేరుతో చేప‌ట్టిన ప్ర‌చారాన్ని త‌ప్పు ప‌ట్టింది. ఇందుకోసం రూ.3.01 కోట్ల ప్ర‌జాధ‌నాన్ని వినియోగించారు. సుప్రీం మార్గ‌ద‌ర్శ‌కాల‌కు విరుద్ధంగా ఈ ప్ర‌చారాన్ని చేప‌ట్టిన‌ట్లుగా కాగ్ వెల్ల‌డించింది. అదే రీతిలో న‌వ‌నిర్మాణ దీక్ష‌తో కేంద్రాన్ని వ్య‌తిరేకిస్తూ ప్ర‌క‌ట‌న‌ల్ని రూపొందించారు. ఇందుకోసం రూ.4.08 కోట్లు ఖ‌ర్చు చేయ‌గా.. గ‌త ఏడాది ఏప్రిల్ 20న ధ‌ర్మ‌పోరాట దీక్ష పేరుతో చేప‌ట్టిన ప్ర‌క‌ట‌న‌ల ప్ర‌చారానికి రూ.3.99 కోట్లు ఖర్చు చేసిన వైనాన్ని కాగ్ త‌ప్పు ప‌ట్టింది.