Begin typing your search above and press return to search.

బీజేపీ హ‌వా.. సీన్ రివ‌ర్స్ అవుతోందా?

By:  Tupaki Desk   |   11 Nov 2020 6:00 AM IST
బీజేపీ హ‌వా.. సీన్ రివ‌ర్స్ అవుతోందా?
X
దేశ‌వ్యాప్తంగా వెలువ‌డిన‌, వెలువ‌డుతున్న ఎన్నిక‌ల ఫ‌లితాలు రాజ‌కీయ వ‌ర్గాల‌ను , విశ్లేష‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌కు ఆమ‌డ దూరంలో మెజార్టీ చోట్ల ఫ‌లితాలు వ‌చ్చాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా బీజేపీ విష‌యంలో లెక్క‌లు తేడా కొడుతున్నాయంటున్నారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. అయితే, ఎగ్జిట్ పోల్స్ దీనికి భిన్నంగా ఉండ‌టం విశేషం.

కీల‌క రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తెలంగాణతో పాటుగా మణిపూర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. గుజరాత్ లో 8 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 8 చోట్ల బీజేపీ లీడింగ్ సాధించింది. మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉపఎన్నికలు జరగ్గా 22 చోట్ల లీడింగ్ లో ఉంది. ఉత్తర ప్రదేశ్ లో 7 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 6 చోట్ల లీడింగ్ లో ఉన్నది. ఇక మణిపూర్ లో ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే మూడు స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉండటం విశేషం. కర్ణాటకలో 2 చోట్ల ఉప ఎన్నికలు జరగ్గా రెండు చోట్ల బీజేపీ గెలుపు విష‌యంలో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.

ఇక బీజేపీకి షాక్ ఇస్తుంద‌ని భావించిన బీహార్ విష‌యంలోనూ స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారుతున్నాయి. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ ముందంజలో ఉంది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌పై మెజారిటీ సాధించేలా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఎన్‌డీఏ అభ్యర్థులు 107 స్థానాల్లో విజయం సాధించారు.243 మంది సభ్యులున్న అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 125 సీట్లు అవసరం కాగా.. సీఎం నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీఎ కూటమి ఇప్పటి వరకు 107 స్థానాల్లో విజయం సాధించగా.. 15 చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి అభ్యర్థులు 98 మంది విజయం సాధించగా.. 16 చోట్ల లీడ్‌లో ఉన్నారు. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరం నిబంధనలు పాటించేందుకు పోలింగ్‌ కేంద్రాల సంఖ్య ఈ సారి పెద్ద ఎత్తున ఈసీ పెంచింది. దీంతో ఫలితాలు ఆలస్యమవుతాయని, రాత్రి వరకైనా ఫలితాలను ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

బీహార్‌లో మూడు దశల్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 4.16 కోట్లు పోలు కాగా.. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోల్‌ ట్రండ్‌ చూస్తే బీజేపీ మరో బీజేపీ 74 స్థానాల్లో ఆధిక్యంతో అతిపెద్ద ఏకైక పార్టీగా నిలిచే అవకాశం ఉంది. నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ ప్రభుత్వం 39 స్థానాల్లో విజయం సాధించగా.. మిత్రపక్షాలు పలు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఆర్జేడీ 68 స్థానాల్లో విజయం సాధించి బీజేపీకి పోటీగా నిలుస్తోంది. కాంగ్రెస్‌ 19 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అలాగే సీపీఐ ఎంఎల్‌ 13, సీపీఐ (ఎం) అభ్యర్థులు మూడు చోట్ల ముందంజలో ఉన్నారు.