Begin typing your search above and press return to search.

టీడీపీకి టచ్ లో లేను అంటున్న బాలినేని... ఎందుకలా...?

By:  Tupaki Desk   |   21 Jan 2023 4:06 PM GMT
టీడీపీకి టచ్ లో లేను అంటున్న బాలినేని... ఎందుకలా...?
X
వైసీపీకి మూల స్తంభాలు అనుకున్న వారి మీద కూడా అనుమానం నీడలు ప్రసరిస్తున్నాయా. లేక ఆ విధంగా ప్రచారం సాగుతోందా. అదే కనుక జరిగితే మాత్రం హత విధీ అని అనుకోవాల్సిందే కదా. జగన్ కి దగ్గర బంధువు. వైసీపీ లో కీలక నేతలలో ఒకరు అయిన మాజీ మంత్రి ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి తాను టీడీపీకి టచ్ లో లేను అని వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏమిటి అర్ధం, దేనికి సంకేతం అన్న చర్చ అయితే వస్తోంది.

నిజానికి బాలినేని వైసీపీకి సంబంధించినంతవరకూ ఆ జిల్లాలో బ్యాక్ బోన్ గా ఉన్నారు. ఆయన పవర్ ప్రకాశం జిల్లాలో వెలుగుతోంది. కానీ ఆయన్ని నడి మధ్యలో మంత్రి వర్గం నుంచి తప్పించేశారు. ఆ బాధ ఆయనకు ఉంది. అది అసంతృప్తిగా మారిందా అన్న చర్చలు ప్రచారాలు ఒక వైపు ఉండనే ఉన్నాయి. దానికి తోడు ప్రత్యర్ధి పార్టీల మైండ్ గేం అనుకోవాలో లేక ఏదైనా అనుకోవాలో తెలియదు కానీ బాలినేని పార్టీ మారుతున్నారు. చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లారు అని టాక్ అయితే వెల్లువలా స్ప్రెడ్ అవుతూ వస్తోంది.

మొత్తానికి దాని మీద బాలినేని ధీటుగా స్పందించారు. తాను పార్టీ మారడమేంటి అని విస్మయం వ్యక్తం చేస్తూనే ఇదంతా తప్పుడు ప్రచారం అని కొట్టి పారేశారు. జిల్లాకు చెందిన టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ అసత్య ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లో 157 సీట్లు ఖాయమని కష్టపడితే మరో పద్దెనిమిది కూడా ఖాయమని జగన్ చెబుతున్నారు. దాని ప్రకారం తాము వై నాట్ 175 అన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని బాలినేని అంటున్నారు.

అలా మొత్తం 175 సీట్లు గెలవడం మీదనే తమ దృష్టి అంతా ఇపుడు ఉందని బాలినేని స్పష్టం చేశారు. అలా తాను పార్టీ మారడం అన్న దాన్ని ఆయన మొదలుకే కొట్టి పారేశారు. అయితే ఇలాంటి ప్రచారం ఎందుకు వచ్చింది అన్నదే చర్చ. జగన్ కి అతి దగ్గర వారి మీద ఈ తరహా ప్రచారం పుట్టడమే షాకింగ్ గా ఉంటుంది. అలాంటి దాన్ని ఎవరూ చేయలేరు కూడా.

ఎందుకంటే జనాలు నమ్మరు కాబట్టి. కానీ బాలినేని విషయంలోనే అలా జరుగుతోంది అంటే ఆయన మంత్రి పదవి కోల్పోయిన తరువాత ఆయన అసంతృప్తిగా ఉండడంతో పాటు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారు అన్న వార్తలు వచ్చిన నేపధ్యంలోనే ఇలా జరిగింది అని అంటున్నారు.

బాలినేని తాను పార్టీ మారడమేంటి అని చెప్పుకోవాల్సి రావడమే వైసీపీకి అతి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి అని అంటున్నారు. ఇది మైండ్ గేం అనుకున్నా జనాల్లోకి వెళ్ళవలసిన మెసేజ్ ని టీడీపీ తెలివిగా పంపుతోంది అన్నది ఫ్యాన్ పార్టీ పెద్దలు గ్రహించాలి అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.