Begin typing your search above and press return to search.

నెల్లూరులో రూల్ కుప్పంలో పనిచేయదా!

By:  Tupaki Desk   |   29 Dec 2021 4:30 PM GMT
నెల్లూరులో రూల్ కుప్పంలో పనిచేయదా!
X
కుప్పంలో టీడీపీ స్థానిక నేత‌ల నుంచి స‌హ‌కారం లేక‌పోయాని బాబు ఉపేక్షిస్తున్నారా? త‌న కంచుకోట బ‌ద్ధ‌ల‌వుతున్నా వేచి చూసే ధోర‌ణి అవ‌లంబిస్తున్నారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో నెల్లూరులో టీడీపీ ప‌రాజ‌యానికి బాధ్యుల‌ను చేస్తూ ఇద్ద‌రు స్థానిక నేత‌ల‌ను బాబు సస్పెండ్ చేశారు.

కానీ కుప్పంలో మాత్రం ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. దీంతో కుప్పం మున్సిపాలిటీ ఓట‌మిపై బాబు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న పాత నాయ‌క‌త్వాన్నే అక్క‌డ కొన‌సాగించాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం.

వాళ్లనే కొన‌సాగించాల‌ని.. కుప్పం అంటే మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి కంచుకోట‌. ఆయ‌న ఏడు సార్లు అక్క‌డి నుంచి గెలిచారు. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్ల‌క‌పోయినా అక్క‌డి స్థానిక నేత‌లే అంతా చూసుకుని బాబు విజ‌యం కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు. అక్క‌డ బాబు త‌న కుటుంబ స‌భ్యుల‌ను కూడా ప‌క్క‌కుపెట్టి మునిర‌త్నం, మ‌నోహ‌ర్‌ల‌ను నియ‌మించుకున్నారు.

వాళ్లే అన్ని వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడుతున్నారు. కానీ 2019 ఎన్నిక‌ల‌ప్ప‌టి నుంచి ప‌రిస్థితి మారిపోయింది. బాబు కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డికి జ‌గ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు. పెద్దిరెడ్డి త‌నదైన వ్యూహాల‌ను అమ‌లు చేస్తూ అక్క‌డ జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ టీడీపీని ఓడిస్తూ వ‌స్తున్నారు. తాజాగా మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ చిత్తుగా ఓడింది. ఎన్నిక‌ల కంటే ముందు బాబు కుప్పానికి వ‌చ్చినా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో కీల‌క నేత‌లు వ‌చ్చి ప్ర‌చారం చేసినా ఎలాంటి ప్ర‌యోజనం లేకుండా పోయింది.

చ‌ర్య‌లు ఉంటాయ‌నుకుంటే.. కుప్పంలో విజ‌యం కోసం బాబు అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేసినా ప‌రాజ‌యమే మిగిలింది. దీంతో స్థానిక టీడీపీ నాయ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటార‌నే అంతా అనుకున్నారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల ఓట‌మికి గల కార‌ణాల‌పై బాబుకు పూర్తిస్థాయి నివేదిక కూడా అందింది. అందులో మునిర‌త్నం, మ‌నోహ‌ర్‌ల పేర్లే ప్ర‌ముఖంగా ఉన్నాయి.

కానీ వాళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవడానికి బాబు వెన‌కాడుతున్నార‌ని స‌మాచారం. వాళ్లిద్ద‌రిపైనే కొన్ని ద‌శాబ్దాలుగా ఆధార‌ప‌డ‌డంతో పార్టీ లొసుగులు వాళ్ల‌కు తెలిసే ఉంటాయి. అందుకే నెల్లూరులో మాదిరి అక్క‌డ చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నెల్లూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఓట‌మిపై స‌మీక్ష చేసిన బాబు పార్టీ ఓట‌మికి కార‌కులైన‌వారిపై చ‌ర్య‌లు తీసుకున్నారు. నెల్లూరు న‌గ‌రానికి చెందిన ఇద్ద‌రు నేత‌ల‌ను స‌స్పెండ్ చేశారు.