Begin typing your search above and press return to search.

హిందువు గురించి మాట్లాడావా అస‌ద్‌?

By:  Tupaki Desk   |   27 July 2015 8:39 AM GMT
హిందువు గురించి మాట్లాడావా అస‌ద్‌?
X
మ‌తాన్ని ఓటుబ్యాంకుగా మార్చి.. అధికారంలో భాగ‌స్వామ్యం కావ‌టం.. ఎదురే లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం.. రాజ‌కీయాల్ని క‌లుషితం చేయ‌టం మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీకి కొత్తేం కాదు. స్వార్థ రాజ‌కీయాల కోసం అధికార‌ప‌క్షంతో చెట్టాప‌ట్టాలు వేసుకునేందుకు అర్రులు జాచే చ‌రిత్ర ఉన్న మ‌జ్లిస్‌కు పెంచి పెద్ద చేసిన వారిలో కాంగ్రెస్ పాత్ర‌ను త‌క్కువ చేయ‌లేం.

2001 నుంచి 2013 ముందు వ‌ర‌కు కాంగ్రెస్‌తో బాగానే ఉన్నా..త‌మ గొంతెమ్మ కోర్కెల‌కు నాటి ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్ రెడ్డి స‌సేమిరా అన‌టంతో కాంగ్రెస్‌ పై క‌త్తి క‌ట్టిన అస‌దుద్దీన్‌.. తాజాగా కాంగ్రెస్‌ పై విరుచుకుప‌డ్డారు.

మ‌జ్లిస్ మ‌త రాజ‌కీయాల‌కు వ‌త్తాసు ప‌లికినందుకు కాంగ్రెస్ మూల్యం చెల్లించాల్సిందే. అస‌ద్ నోటి నుంచి వ‌చ్చిన విమ‌ర్శ‌లు చూసిన‌ప్పుడు ఈ భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. త‌మ‌ను మ‌త‌తత్వ వాద పార్టీ అని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్య‌పై మండిప‌డిన అస‌ద్‌.. గ‌తంలో హైద‌రాబాద్‌ లోని త‌మ పార్టీ కార్యాల‌యానికి ఇందిరాగాంధీ వ‌చ్చార‌ని గొప్ప‌లు చెప్పుకున్నారు.

ఏదో ఒక రోజు కాంగ్రెస్ త‌మ మ‌ద్ధ‌తు కోరే రోజు వ‌స్తుంద‌ని చెప్పిన ఆయ‌న‌.. యాకూబ్ మెమ‌న్ కు ఉరిశిక్ష విధించ‌టం స‌రికాద‌ని మ‌రోసారి వ్యాఖ్యానించారు. మెమ‌న్ స్థానంలో హిందువు ఉన్నా తాను మ‌ద్ధ‌తు ప‌లికే వాడిన‌ని వ్యాఖ్యానించారు.

ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల్లో ఒక హిందువు ఉండే సంగ‌తి త‌ర్వాత‌.. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ఒక్క అంశంలో అయినా.. హిందువుల‌కు అనుకూలంగా ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడిన చ‌రిత్ర అస‌ద్ కు ఉందా? పేరుకు రాజ‌కీయ పార్టీనే కానీ.. నిత్యం మైనార్టీల పేరు మీద సెంటిమెంట్ రాజ‌కీయాలు చేయ‌టం త‌ప్పించి.. ఏ ఒక్క హిందువుకు జ‌రిగిన అన్యాయం గురించి అయినా అస‌ద్ మాట్లాడిన ఉదంతం లేదు.

అలాంటి ఆయ‌న‌.. ఉగ్ర‌వాద ఆరోప‌ణ‌లు ఉన్న యాకూబ్ స్థానంలో హిందువు ఉన్నా మాట్లాడ‌తాన‌ని అన‌టానికి మించిన జోక్ మ‌రొక‌టి ఉండ‌దు. వివాదాస్ప‌ద క‌ట్ట‌డం (అయోధ్య‌లోని క‌ట్ట‌డాన్ని వివాదాస్ప‌ద క‌ట్ట‌డంగానే వ్య‌వ‌హ‌రించాల‌ని సుప్రీంకోర్టు విస్ప‌ష్టంగా పేర్కొన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రికి తోచిన‌ట్లుగా వారు వ్యాఖ్య‌లు చేయ‌టం ఒక అల‌వాటుగా మారిపోయింది) కూల్చి వేత‌కు సంబంధించి అద్వానీపై కేసు ఉన్నా.. ప‌ద్మ‌విభూష‌ణ్ ఇచ్చార‌ని.. అదే త‌న‌కు అయితే పాస్‌పోర్ట్ కూడా ఇచ్చే వారు కాద‌ని వ్యాఖ్యానించారు.

అస‌ద్ మాట‌లు నిజ‌మే అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి త‌స్లీమా నస్రీన్ హైద‌రాబాద్‌ లో ప‌ట్ట‌ప‌గ‌లు.. త‌న పార్టీ ఎమ్మెల్యేలు భౌతిక దాడి జ‌రిగితే కేసు పెట్టి ఊరుకున్నారే కానీ.. అరెస్ట్ చేసింది లేదు. అంతేనా.. అధికారుల మీద చేయి చేసుకోవ‌టాలు.. విద్వేషం పెంచేలా వ్యాఖ్య‌లు చేయ‌టం లాంటి ఎన్నో ఆరోప‌ణ‌లు ఉన్నా.. అస‌ద్ అండ్ కో మీద చ‌ట్టం త‌న ప‌ని తాను ఎందుకు చేయ‌లేద‌న్న విష‌యానికి ఆయ‌నిచ్చే స‌మాధానం ఏమిటి..?