Begin typing your search above and press return to search.

ష్ గప్ చుప్ : పొత్తు మీద మాట్లాడితే ఒట్టు...?

By:  Tupaki Desk   |   7 Jun 2022 9:32 AM GMT
ష్ గప్ చుప్ : పొత్తు మీద మాట్లాడితే ఒట్టు...?
X
రామాయణంలో పిడకల వేట మాదిరిగా ఎన్నికలు చూస్తే రెండేళ్ళ వ్యవధిలో ఉన్నాయి. ఇపుడు తీరి కూర్చుని పొత్తులు ఎత్తులు అంటూ ఆవేశకావేశాలు పెంచుకోవడం ధర్మనా మిత్రమా అని బీజేపీ అంటోంది. ఇక తెలుగుదేశం వైఖరి చూసినా అలాగే ఉంది. పొత్తుల మీద ఎవరూ మాట్లాడవద్దు, ఇది హై కమాండ్ ఆన అని నేరుగానే ఆర్డర్స్ వచ్చేశాయి. దాంతో చాలా నోళ్ళు కట్టేసుకున్నాయి. మరి పొత్తుల మీద ఎక్కువగా మాట్లాడిన జనసేన అయితే ష్ గప్ చుప్ అంటున్న పార్టీలను చూసి ఖంగు తింటోంది అనే చెప్పాలి.

నిజానికి జనసేన అధినాయకుడు పవన్ ఒక వ్యూహం ప్రకారమే పొత్తుల విషయాన్ని ప్రస్థావించారని అంతా ఇప్పటిదాకా అనుకున్నారు. ఆయన ఆప్షన్ల మీద ఆప్షన్లు ఇస్తూ ఇతర పక్షాలను కార్నర్ చేశారని కూడా భావించారు. కానీ ఇపుడు బీజేపీ టీడీపీ కామోష్ అంటూ చాలా ఎత్తుగడతో పొత్తుల మాటను చిత్తు చేసి పారేశాయి. దాంతో జనసేన ఇపుడు మరో ఎత్తు వేయాల్సిన అవసరం ఏర్పడింది.

నిజానికి టీడీపీ జనసేన పొత్తుని ఆశిస్తోందని ఎవరు చెప్పారు మాస్టారూ అని తమ్ముళ్ళు అంటే జనసేన వద్ద జవాబు ఉందా. చంద్రబాబు అన్యాపదేశంగా పరోక్షంగా అన్న మాటలను పట్టుకుని పొత్తులతోనే కాదు, ఏకంగా రేపు శాసనసభా పక్ష సమావేశం, ఎల్లుండే సీఎం ప్రమాణం అన్నట్లుగా అధికార వాటా దాకా కధ నడిపేసింది జనసేన. మీరు తగ్గండి మేము తగ్గామంటూ సెంటిమెంట్ మాటలు మాట్లాడింది.

అయితే దాని మీద తమ్ముళ్ళు గుస్సా అయ్యారు. అలా రెండు రోజుల పాటు వారిని కావాలనే వ్యూహాత్మకంగా మండించిన టీడీపీ అధినాయకత్వం ఇపుడు పెద్దరికం చూపించి పొత్తుల మీద మాట్లాడడానికి మీరు సరిపోరు, అది ఇపుడు అనవసర టాపిక్ అని నోరు మూయించేసింది. అంటే తమ్ముళ్లలో జనసేన పొత్తుల మీద కావాలనే వ్యతిరేకత పెంచి ఇపుడు వారి మౌత్ లను మూసేశారు అన్న మాట.

మరి ఇదే తమ్ముళ్లు గతంలో అధినాయకుడు టూర్ సందర్భంగా పొత్తులు జనసేనతో పెట్టుకోవాలని సూచించారు కదా. అందుకే వారి మాటకు వారితోనే జవాబు ఇలా చెప్పించారు అన్న మాట. అలా టీడీపీ తనదైన అద్భుత రాజకీయ చాతుర్యంతో తమ పార్టీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. మరో వైపు చూస్తే బీజేపీ తీరు కూడా అలాగే ఉంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఎవరు చెప్పమన్నారని పవన్ సీఎం అని ఏపీ బీజేపీ నేతలు చెప్పారు. ఆ తరువాత పవన్ వకీల్ సాబ్ సినిమా థియేటర్ వద్ద వైసీపీ సర్కార్ పవన్ సినిమాకు టికెట్ల రేట్లు పెంచలేదంటూ సునీల్ ఢియోధర్ వంటి ప్రముఖులు ఎవరడిగారు అని నిరసన చేశారు.

ఇలా పవన్ని నాడు తెగ పొగిడేసి మా సీఎం అని చెప్పుకున్న వారు ఇపుడు తాపీగా అది జాతీయ నాయకత్వం నిర్ణయించాల్సిన అంశం అంటున్నారు. అంతే కాదు ఎపుడూ ఎన్నికల ముందు సీఎం అభ్యర్ధిని ప్రకటించే సంప్రదాయం బీజేపీలో లేదని కూడా చెప్పుకుంటున్నారు. ఇక బీజేపీ అభ్యర్ధి కాక బయట పార్టీల వారిని కూడా సీఎం అభ్యర్ధిగా తాము ఏనాడూ ప్రకటించలేదని కూడా అంటున్నారు.

మొత్తానికి ఇరవై నాలుగు గంటలలో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా పవన్ని ప్రకటించాలన్న జనసేన డిమాండ్ ని చాలా లైట్ గా కమలనాధులు తీసుకున్నారు. అంతే కాదు ఏపీ టూర్ లో ఉన్న బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అయితే పొత్తుల గురించి ఎవరూ నోరిప్పవద్దు అని కళ్ళాలు వేశారు. మొత్తానికి కమలం కూడా ఆప్షన్స్ అన్నీ తన అందుబాటులో ఉంచుకోవాలని చూస్తోంది. ఇక గుప్పిట ఎపుడూ మూసి ఉంచే టీడీపీ చాణక్య రాజకీయం చివరి నిముషంలో కానీ తేలదు.

ఇవన్నీ చూస్తూంటే పవన్ కళ్యాణే తమ గుప్పిట తెరిచేసి తన హృదయం పరిచేసి ఏపీ రాజకీయ మైదానంలో అలా పొత్తుల ఎత్తులతో చిత్తు అయిపోతున్నారా అనిపించకమానదు, పొత్తులు అంటూ ముందే పాట పాడుతూంటే రేపటి రోజున ఎవరు వచ్చి ఆ పార్టీలో చేరుతారు, ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో ఏ రకమైన ఆసక్తి ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే టీడీపీ తెలివిగా పొత్తులు ఇపుడు కాదు అని మొత్తం మ్యాటర్ ని సైడ్ చేసేసింది.

బీజేపీదీ అదే ఆశ. ఎవరైనా తమ వైపు చివరి నిముషాన అయినా తమవైపునకు చూడకపోతారా అన్న ముందు చూపుతో పొత్తుల మీద ష్ గప్ చుప్ అంటోంది. మరి ఆ రాజకీయ తెలివిడి జనసేనకు కూడా ఉండాలి కదా అన్న చర్చ వస్తోంది. ఇప్పటికైనా కొంప మునిగింది ఏమీ లేదు. పొత్తుల మాటను పెదవుల వద్దనే కాదు హృదయంలో కూడా లేకుండా చేసుకుని జనసేన తన కార్యక్షేత్రంలో దూకుడు చేయడమే ముందున్న కర్తవ్యం.