Begin typing your search above and press return to search.

'ఆది' వ‌ల్లే చైనా స్టీల్ కంపెనీ వ‌స్తోంద‌ట‌

By:  Tupaki Desk   |   30 Jun 2016 10:26 AM GMT
ఆది వ‌ల్లే చైనా స్టీల్ కంపెనీ వ‌స్తోంద‌ట‌
X
ఇటీవ‌లే తెలుగుదేశం పార్టీలో చేరిన జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి త‌న స‌త్తాను ఓ రేంజ్‌ లో చాటుకుంటున్నారు. అదికూడా స్వ‌యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్న ఫ‌లితాన్ని త‌న ఖాతాలో వేసుకునే రీతిలో కావ‌డం ఆస‌క్తిక‌రం. పైగా త‌న కండీష‌న్ వ‌ల్లే ఇంత గొప్ప నిర్ణ‌యం వెలువ‌డింద‌న్న‌ట్లుగా చెప్ప‌డం గ‌మనార్హం. ఇంత‌కీ ఆదినారాయ‌ణ‌రెడ్డి డ‌బ్బా కొట్టుకున్న‌ది దేని గురించి అంటే బ్ర‌హ్మ‌ణి ఉక్కు క‌ర్మాగారం విష‌యంలో.

అర్ధంతరంగా ఆగిపోయిన బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ స్థానంలో చైనా ప్రభుత్వ రంగ సంస్థ రూ.3వేల కోట్లతో ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఆది నారాయ‌ణ‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు నిర్ణయం వెలువడట‌ హర్షణీయమన్నారు. వెనుకబడిన ప్రాంతమైన కడప జిల్లా, పూర్తిగా వెనుకబడిన జమ్మలమడుగు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. చైనా ప్రభుత్వ రంగసంస్థ అన్‌ స్టీల్‌ ముందుకు రావడం, అందుకు చైనా పర్యటనలో ముఖ్యమంత్రి 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తామని చెప్పడం మంచి పరిణామమన్నారు. తాను తెదేపాలో చేరిన తరువాత 100 రోజుల ప్రణాళిక ప్రకటించిన సమయంలో బ్రహ్మణి పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారన్నారు. అంతేకాకుండా ఈ నెల 22న మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో బహిరంగ సభలో బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ గురించి ప్రస్తావించానన్నారు.

ఆది వ్యాఖ్య‌ల‌తో కొత్త‌ డిస్క‌ష‌న్ ప్రారంభం అయింది. ఆది 100 రోజుల ప్ర‌ణాళిక ప్ర‌క‌టించ‌డం వ‌ల్లే ముఖ్య‌మంత్రి చైనా పర్యటన పెట్టుకున్నారా? ఆది కోస‌మే బ్రహ్మ‌ణిని ప్ర‌తిపాదించి మూడువేల కోట్ల రూపాయ‌ల‌తో ఉక్కు పరిశ్రమను జ‌మ్మ‌ల‌మ‌డుగులో నిర్మించడానికి ముందుకు వ‌చ్చారా? మ‌రీ ఈ స్థాయిలో బ‌డాయి ఎందుకు? అంటూ తెలుగు త‌మ్ముళ్లు చ‌ర్చించుకుంటున్నారు.