Begin typing your search above and press return to search.

జగన్ కి ధీటైన లీడర్ చంద్రబాబు కాదుట... ?

By:  Tupaki Desk   |   27 Jan 2023 8:22 PM GMT
జగన్ కి ధీటైన లీడర్ చంద్రబాబు కాదుట... ?
X
ఈ మాట ఎవరో అంటే ఏమో అనుకోవచ్చేమో. కానీ స్వయంగా తెలుగుదేశం నాయకులే అంటున్నారు. బిగ్ షాట్స్ నోటి వెంట ఆ మాట వస్తోంది. ఎన్టీయార్ నుంచి పార్టీని తీసుకున్నాక విజయవంతంగా ఇరవై ఏడేళ్ల పాటు చంద్రబాబు నడిపించారు. ఈ మధ్యలో రెండు సార్లు అధికారంలోకి టీడీపీని తెచ్చారు. కేంద్ర స్థాయిలో చక్రం తిప్పారు. చంద్రబాబు రాజకీయ చాణక్యం అని ఈ రోజుకీ అంతా చెప్పుకునేలా ఆయన హిస్టరీ ఉంటుంది.

అలాంటి చంద్రబాబుని చిన్న గీత చేస్తున్నారు సొంత పార్టీ నేతలు. చినబాబు లోకేష్ ని ఎత్తాలని ఆయనకు హైప్ క్రియేట్ చేయడానికి లోకేష్ ఈజ్ గ్రేట్ అని చెప్పడానికి ఏకంగా చంద్రబాబునే తగ్గించేస్తున్నారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అయితే చంద్రబాబు మీద డైరెక్ట్ గానే విమర్శలు చేశారు కుప్పంలో లోకేష్ మొదటి రోజున జరిగిన సభలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తాను ఈ మాటలు అంటే బాబుకు ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పాల్సి వస్తోంది అంటూ చెప్పేశారు.

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నపుడు మంచిగా ఉంటారని, కార్యకర్తలను బాగా చూసుకుంటాను అంటారని, కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం అధికారులతోనే ఉంటూ క్యాడర్ ని ఇబ్బంది పెట్టేస్తున్నారు అని అనాల్సినవి అనేశారు. బాబు బాధపడినా తాను ఈ మాటలే అంటాను అని సర్ది చెప్పుకున్నారు. కానీ లోకేష్ మాత్రం అలా కాదని, క్యాడర్ కి ఎంతో విలువ ఇస్తారని, వారి జోలికి ఎవరైనా వస్తే చాలు తాట తీస్తారు అని అచ్చెన్న చాలా గొప్పగా చెప్పారు.

అంటే బాబు మెతక అయితే లోకేష్ మహా చురుకు అని అచ్చెన్న నిర్ధారించి చెప్పారన్న మాట. ఇప్పటిదాకా ఏపీలో అభివృద్ధి అంటే చంద్రబాబు పేరే తెలుగుదేశం నాయకులు వల్లె వేసేవారు. కానీ ఫస్ట్ టైం టీడీపీలో లోకేష్ మంత్రిగా ఎంతో చేశారు అని చెబుతున్నారు. అచ్చెన్నాయుడు అయితే పంచాయతీ రాజ్ మంత్రిగా లోకేష్ చేసిన పని వల్లనే ఏపీలో గ్రామాలలో ఎల్ ఈ డీ లైట్లు కనిపిస్తున్నాయని మంచి నీటి సదుపాయాలు ఆయన ఇచ్చినవే అని, రోడ్లు ఇరవై వేల కిలోమీటర్లు మంత్రిగా లోకేష్ మాత్రమే వేయగలిగారు అని మెచ్చేసుకున్నారు.

లోకేష్ మంచి పాలనాదక్షుడు అని అచ్చెన్న కితాబు ఇచ్చారు. రాజకీయంగా చూస్తే లోకేష్ తెలుగుదేశం పార్టీకి నాయకుడు మాత్రమే కాదు ఏపీకే దిశా నిర్దేశం చేసే లీడర్ అని అచ్చెన్న అనడమూ విచిత్రమే. లోకేష్ ఏపీ భవిష్యత్తు మలుపు తిప్పే నేత అని కొనియాడుతున్నారు. అంటే ఇక్కడ కూడా చంద్రబాబు కంటే లోకేష్ బెటర్ లీడర్ అని చెబుతున్నారన్న మాట.

ఏపీలో వైసీపీ సర్కార్ని గద్దె దించేది లోకేష్ మాత్రమే అని కూడా అంటున్నారు. జగన్ కి సరైన మొగుడు లోకేష్ అని అచ్చెన్న అనడం బట్టి చూస్తే చంద్రబాబు వల్ల కాలేదా ఇంతకాలం బాబు జగన్ మీద చేసిన పోరాటం తీసికట్టేనా అన్న డౌట్లు ఎవరికో కాదు తమ్ముళ్ళకు వచ్చినా ఆశ్చర్యం లేదు.

ఆనాడు ఎన్టీయార్ ని దించేసినపుడు బాబుని ఇంద్రుడు చంద్రుడు అని తెగ పొగిడారు తమ్ముళ్ళు. ఇపుడు లోకేష్ ని ఫ్యూచర్ లీడర్ గా చూపించే ప్రయత్నంలో ఆ ఉత్సహాంలో చంద్రబాబునే తగ్గించేయనుకుంటున్నారు. నిజంగా బాబుని మించిన నేత లోకేష్ అని తమ్ముళ్ళు అనవచ్చేమో కానీ అది నిజమా కాదా అన్నది జనాలు చెబుతారు. లోకేష్ నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. తండ్రి సీఎం కాబట్టి మంత్రి అయ్యారు.

ఆయన తానుగా మంగళగిరిలో ఓడారు. మరి ఆయన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెస్తారని గద్దె దింపుతారు అని తమ్ముళ్ళు సంబరంగా చెబితే చెప్పుకోవాలి కానీ లోకేష్ నిజమైన సామర్ధ్యం ఏంటి ఆయన నాయకత్వ లక్షణాలు ఏంటి అన్నది నాలుగు వందల రోజుల పాదయాత్ర తరువాతనే జనాలు అసలైన తీర్పు ఇస్తారు. చివరిగా ఇక్కడ ఒక మాట. తెలుగుదేశానికి బాబు తరువాత ఎవరూ అంటే ఇపుడు ఆశాకిరణంగా లోకేష్ బాబు కనిపించవచ్చు.

కానీ ఆ మాత్రానికి చిన్న గీతను పెద్ద గీత చేయాలని చంద్రబాబుని ఇంకా చిన్న గీత గీస్తే లోకేష్ పెద్దగా కనిపించవచ్చేమో కానీ బాబు మార్క్ బ్రాండ్ లేకుండా టీడీపీ సక్సెస్ ఎలా అన్నదే అసలైన ప్రశ్న. మరి దీనికి జవాబు తమ్ముళ్ళు కాదు జనాలే చెబుతారేమో.