Begin typing your search above and press return to search.

ఏపీ అవినీతి తిమింగ‌లం ఏశాలు దిమ్మ‌తిరిగేలా!!

By:  Tupaki Desk   |   4 April 2017 7:24 AM GMT
ఏపీ అవినీతి తిమింగ‌లం ఏశాలు దిమ్మ‌తిరిగేలా!!
X
అవినీతి నిరోధ‌క‌శాఖ‌ అధికారులు దాడులు జరిపినప్పుడు అవినీతిపరులు అక్రమాస్తుల్ని ఎలా కూడబెట్టారో, ఎక్కడెక్కడ దాచారో తెలుసుకోగలుగుతారు. కానీ ఏపీ అవినీతి నిరోధక శాఖ ఇప్పటివరకూ కనీ వినీ ఎరుగని కేసు ఎదురైంది. ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ గంగాధరం తను కూడబెట్టిన అక్రమాస్తులు దిమ్మ తిరిగే ప్లాన్ వేశారు. అక్ర‌మ సంపాద‌న‌ను ఏసీబీ కంటపడకుండా డొల్ల కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారు. ఈ వైనం గమనించిన ఏసీబీ అధికారులు విస్తుపోయారు. ఈ విషయాన్ని విశాఖ ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ మీడియాకు తెలిపారు.

గంగాధరం సంపాదించిన ఆస్తులను ఆరు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. ఐమ్యాజిక్స్ పొలారీస్‌ లో 24 లక్షలు, సుప్రజ హెచరీస్‌ లో 35 లక్షలు - నమిత హోమ్స్‌లో 1.5 కోట్లు - ఎస్‌ విఎస్ లాజిస్టిక్స్‌లో ఐదు లక్షలు - ఆర్ ఆర్ ఫార్మ్స్ - ఎస్‌ ఎస్ ఫార్మ్స్ పేరిట చావలిలో 5.37 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు ఏసీబీ కూపీ లాగింది. ఇప్పటివ‌ర‌కు జ‌రిగి దాడుల్లో సుమారు 100 కోట్ల రూపాయల అక్రమాస్తులు బయటపడగా, సోమవారం జరిగిన దాడుల్లో మరిన్ని ఆస్తులు వెలుగు చూశాయి. హైదరాబాద్‌ లోని కూకట్‌ పల్లిలోని రెండు ఆంధ్రా బ్యాంకులు - జెడ్ కాలనీలోని ఎస్‌ బీహెచ్ - సనత్‌ నగర్ - కూకట్‌ పల్లిలోని హెచ్‌ డీఎఫ్‌ సీ బ్యాంకులు - కూకట్‌ పల్లిలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ - కూకట్‌ పల్లి పంజాబ్ నేషన్ బ్యాంకుల్లో గంగాధరం - ఆయన బంధువులకు సంబంధించిన లాకర్లను తెరిచారు. ఇందులో ఐదు లాకర్లలో గంగాధరం అక్రమాస్తులు వెలుగు చూశాయి. ఒక లాకర్ లో ఒరిజినల్ డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఇవి నెల్లూరు జిల్లా కల్లూరు ప్రాంతంలో నాలుగు ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు. వీటితోపాటు ఇదే ప్రాంతంలో గంగాధరానికి చెందిన 19 ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఈ భూమిని ఆనుకుని ఆరు ఎకరాల డీ పట్టా భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా గంగాధరం లాకర్‌లో దొరికాయి.

నాలుగు ఎకరాల భూమి విలువ 1.53 కోట్ల రూపాయలు ఉంటుందని డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలియచేశారు. అలాగే ఈ లాకర్లలో రెండు కిలోల బంగారం దొరికింది. అదేవిధంగా గంగాధరం అకౌంట్‌లో 21.79 లక్షల రూపాయలు లభ్యమయ్యాయి. విజయవాడలోని గంగాధరం తాత్కాలిక కార్యాలయంలో హార్డ్ డిస్క్, 2.15 లక్షల రూపాయలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. సున్నపుబట్టీల సెంటర్ ప్రాంతంలో గంగాధరానికి చెందిన గెస్ట్‌ హౌస్‌ లో తనిఖీలు జరిపి, రూ.2.40 లక్షల నగదు ఇతర విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఏసీబీకి దిమ్మ‌తిరిగే విధంగా అక్ర‌మాస్తులు బ‌య‌ట‌పడుతుండ‌టం గ‌మనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/