Begin typing your search above and press return to search.

లెక్క‌ల‌తో స‌హా అసెంబ్లీలో బాబును ఇరుకున పెట్టిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   19 July 2019 5:30 PM GMT
లెక్క‌ల‌తో స‌హా అసెంబ్లీలో బాబును ఇరుకున పెట్టిన జ‌గ‌న్‌
X
ఐదేళ్ల టీడీపీ ప్ర‌భుత్వ పాల‌న‌లో సౌర, పవన విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలలో (పీపీఏ) అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ అధికారపక్షం గ‌త కొద్ది రోజులుగా తీవ్రమైన ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఈ కొనుగోళ్ల‌పై అటు అసెంబ్లీలోనూ.. ఇటు బ‌య‌టా కూడా టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ నేత‌ల మ‌ధ్య అప్ర‌క‌టిత యుద్ధ‌మే న‌డుస్తోంది. ఇదిలా ఉంటే కేంద్ర‌ప్ర‌భుత్వం సైతం ఈ విష‌యంలో జ‌గ‌న్‌కు నేరుగా లేఖ రాసి క‌ల‌క‌లం సృష్టించింది. అయినా జ‌గ‌న్ మాత్రం ఈ విష‌యంలో ఉడుంప‌ట్టుతోనే ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే శుక్ర‌వారం కూడా ఇదే అంశంపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విద్యుత్‌ కొనుగోళ్లపై గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను ఆధారాల‌తో స‌హా ఎండ‌గ‌ట్టారు. విద్యుత్ కొనుగోళ్ల‌లో గ‌త ఐదేళ్ల‌లో ఎన్నో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని... గ‌త ప్ర‌భుత్వం అవ‌స‌రం లేకున్నా ఎక్కువ ధ‌ర‌కు విద్యుత్ కొనుగోలు చేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు.

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై ప‌క్కా ఆధారాలు ఉన్నా ప్ర‌తిప‌క్షం మాత్రం ప్రతి విషయంలోనూ కుక్కతోక వంకరే అన్న విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీనిపై క‌మిటీ వేసినా కూడా చంద్ర‌బాబు క‌మిటీ నివేదిక రాకుండానే ఆ క‌మిటీ స‌భ్యుల‌ను విమ‌ర్శిస్తున్నార‌ని ఆరోపించారు. పీపీఏలపై సమీక్ష అనగానే చంద్రబాబు ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని కూడా జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

ఇక గ‌త ప్ర‌భుత్వంలో 2015-16లో ఆర్పీఓ 5 శాతం నిర్ణయిస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 5.5 శాతం కొనుగోలు చేస్తే ఇదే 2016-17లో 5 శాతం ఉంటే 8.6 శాతం కొనుగోలు... 2017-18లో ఆర్పీఓ 11 శాతం ఉంటే ప్ర‌భుత్వం 23.4 కొనుగోలు చేసింద‌న్నారు. ఈ అద‌న‌పు రేట్ల కొనుగోళ్ల‌తో ప్రభుత్వంపై వ‌రుస‌గా 2016-17లో రూ.430 కోట్లు - 2017-18లో రూ.924.9 కోట్లు - 2018-19లో రూ.1292.8 కోట్లు భారం ప‌డింద‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి తెలిపారు.

2016-18 మ‌ధ్య మూడేళ్ల‌లో బాబు ప్రభుత్వం రూ. 5,497 కోట్ల విద్యుత్‌ కొనుగోలు చేసింద‌ని... ఇందులో కోట్లాది రూపాయ‌ల అక్ర‌మాలు జ‌రిగాయ‌న్న జ‌గ‌న్‌.. టెక్నాల‌జీ తానే క‌నిపెట్టాన‌ని చెప్పుకునే చంద్ర‌బాబుకు దీనివ‌ల్ల ఎంత న‌ష్టం వ‌స్తుందో తెలియ‌క‌పోవ‌డం విడ్డూరంగా ఉంద‌ని ఎద్దేవా చేశారు. ఏపీలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న‌ప్పుడు అధిక ధ‌ర‌ల‌కు విద్యుత్ ఎందుకు ? కొనుగోళ్లు చేశార‌ని కూడా జ‌గ‌న్ ఆధారాల‌తో స‌హా అసెంబ్లీలో బాబును ఏకేశారు.