మీ సీఎం అభ్యర్ధి ఎవరు...వైసీపీ మైండ్ గేమ్

Tue Jan 31 2023 15:02:48 GMT+0530 (India Standard Time)

YSRCP Politics in AP on Chief Minister

విపక్షాలను గందరగోళంలో నెట్టేందుకు వైసీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. మీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు అని నేరుగా ప్రశ్నిస్తోంది. పొత్తులు ఏపీలో ఊపందుకున్నాయి. జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య అవి దాదాపు కుదిరినట్లే అని అంతా భావిస్తున్నారు. దాంతో  జనసేన టీడీపీ కూటమికి ముగ్గురు సీఎం అభ్యర్ధులు అంటూ వైసీపీ కొత్తగా జనంలోకి ప్రచారం తెచ్చింది.సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ చేస్తోంది. ఇక వైసీపీ మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ అయిన కొడాలి నాని అయితే ఇప్పటిదాకా పాదయాత్ర చేసినది సీఎం అభ్యర్ధులే అని గుర్తు చేశారు. వైఎస్సార్ చంద్రబాబు జగన్ పాదయాత్ర చేస్తూ తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పేవారు అని ఆయన అంటున్నారు. ఇపుడు లోకేష్ ని జనంలోకి పంపారూ అంటే ఆయన సీఎం అభ్యర్ధిగా పంపుతున్నారా అని నిలదీస్తున్నారు.

ఒకవేళ ఆయన సీఎం అభ్యర్ధి కాకపోతే ఆయన చెబుతున్న మాటలకు విలువ ఏమి ఉంటుంది అని ఆయన లాజిక్ పాయింట్ లాగుతున్నారు. అంతటితో ఆగకుండా సీఎం అభ్యర్థులు మీకు ఎందరు అని కూడా అంటున్నారు. చంద్రబాబా పవన్ కళ్యాణా నారా లోకేషా ఎవరు విపక్ష కూటమి నుంచి ఉంటారు అని వైసీపీ నేతలు అంటున్నారు

వారు మరి కాస్త ముందుకు వెళ్ళి వైసీపీకి అనుకూలంగా ఉండే వెబ్ సైట్లలో కూడా పవన్ కళ్యాణ్ణి సీఎం అభ్యర్ధిగా ప్రకటించమని ఒక మీడియా యజమాని చంద్రబాబుని కోరారని దానికి ఆయన నో చెప్పారని వార్తలు వండి వార్చుతున్నారు అని అంటున్నారు. ఆ విధంగా ప్రచారం చేయడం ద్వారా కాపులకు సీఎం పదవి మీద ఉన్న కోరికను వారి ఆకాంక్షలు తెలుగుదేశం పట్టించుకోవడం లేదు అని చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు.

ఇపుడు నారా లోకేష్ పాదయాత్రను ఆసరాగా చేసుకుని లోకేష్ ని సీఎం క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ చేస్తూ ఆయన ఉంటే ఇక పవన్ కి చాన్స్ ఏది అన్న డౌట్ వచ్చేలా చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి మాస్టర్ స్ట్రోక్ అన్నట్లుగా విపక్ష కూటమిలో చీలికలు వచ్చేలా వైసీపీ ముగ్గురు సీఎంలు అంటూ ప్రచారం తలకెత్తుకుందని అంటున్నారు.

అయితే విపక్ష కూటం వైసీపీ మైండ్ గేమ్ లో చిక్కుకోలేదని అంటున్నారు. తమ ముందు సీఎం ఎవరు అన్నది ప్రశ్న కాదని ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ని గద్దె దించడమే తమ లక్ష్యమని అంటున్నారు. ప్రజల కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏపీలో వైసీపీ అధికారంలో ఉండరాదని తాము భావిస్తున్నట్లుగా విపక్షాలు పేర్కొంటున్నాయి.

ఇప్పటికే చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ఓట్లలో చీలిక లేకుండా అంతా కలసి పోటీ చేయాలని అంటున్నారు. అంటే ముందు తమకు అధికారం కాకుండా జగన్ని మాజీ సీఎం చేయడమే లక్ష్యంగా ఉందని తెలుస్తోంది. ఇక ఈ రకమైన ప్రచారం మీద బలమైన సామాజికవర్గాల్లో కూడా పెద్దగా అలజడి రేగడం లేదని అలా వైసీపీ ప్లాన్ పెద్దగా పారడం లేదని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ ఈ వ్యూహాన్ని మరింతగా పదును చేసి ఎన్నికల వేళ గట్టిగా ప్రయోగించే చాన్స్ ఉంది.

ఎందుకంటే ఏపీలో బలమైన రెండు కులాలు రెండు పార్టీల మధ్య విభేదాలు వస్తాయని రావాలని అలా జరిగితేనే తమ రాజకీయ పబ్బం గడుస్తుంది అని వైసీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. మొత్తానికి లోకేష్ ని పవన్ని అసలు తాము లీడర్స్ గా పట్టించుకోమని అంటూనే వారిని సీఎం క్యాండిడేట్స్ గా వైసీపె చెప్పడంలోనే అసలైన డొల్లతనం ఉంది అని అంటున్నారు.      నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.